చెట్టు ఎక్కి కొమ్మ నరుక్కున్నారు! | Ramachandra Murthy Guest Column On Nallari Kumar Reddy | Sakshi
Sakshi News home page

సెంటిమెంటు లేకపోతే సరి!

Published Sun, Jul 15 2018 1:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ramachandra Murthy Guest Column On Nallari Kumar Reddy - Sakshi

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి స్వాగతించేందుకు ఆయన నివాసానికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఊమెన్‌చాందీ వెడుతున్నారని పది రోజుల కిందట మధ్యాహ్నభోజన సమయంలో విన్నప్పుడు కేంద్ర మాజీమంత్రి జైరామ్‌ రమేష్‌ ఆశ్చర్యం వెలిబుచ్చారు. నాకేమీ అది అసాధారణ చర్యగా కనిపించలేదు. కాంగ్రెస్‌ సంస్కృతికి, ముఖ్యంగా సోనియాగాంధీ మనస్తత్వానికి తగినట్టుగానే ఉందనిపించింది.  రాజకీయాలలో కొందరికి సెంటిమెంట్లు ఏ మాత్రం ఉండవు. కొందరు మాత్రం ఇచ్చిన మాట తప్పకూడదనీ, అసత్యాలు చెప్పకూడదనీ నియమాలు పెట్టుకొని నష్టపోతారు. కష్టపడతారు. ఏదో ఒక విధంగా గెలవడమే పరమావధి అని భావించేవారిని సెంటిమెంట్లు బాధించవు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో శుక్రవారం నాడు కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించినప్పుడు 22 సంవత్సరాల కిందట జరిగిన ఒక ఉదంతం జ్ఞాపకం వచ్చింది. 1996 ఎన్నికలు జరగడానికి ముందు ఏదో పనిమీద ఢిల్లీ వెళ్ళాను. పీవీఆర్‌కె ప్రసాద్‌ని కలిసేందుకు ఆయన దగ్గరికి వెడితే ‘పీవీ గారింటికి పోతున్నా మీరూ రండి’ అంటూ తీసుకొని వెళ్ళారు. రాజకీయ నాయకులకు అయాచితంగా సలహాలు ఇచ్చే అలవాటు పెద్దగా లేదు కానీ నాకు నచ్చిన,  నాకు చనువున్న రాజకీయ నాయకుల హితంకోరి వారు అడగ కపోయినా సలహా ఇచ్చే అమాయకత్వం ఉంది.

మేం వెళ్ళినప్పుడు పీవీ, సుబ్రహ్మణ్యస్వామి కూర్చొని తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మేము కూడా వారితోనే కూర్చున్నాం. ‘తమిళనాడులో ఇప్పుడు డిఎంకే హవా ఉంది. జయలలితతో పొత్తు కొనసాగిస్తే మీకు ఒక్క సీటు కూడా రాదు. డీఎంకేతో పెట్టుకుంటే కనీసం 20 వస్తాయి’ అని నేను అన్నాను. ‘అదేనండీ సమస్య. డిఎంకేతో పొత్తు పెట్టుకోలేం. జయలలితే శరణ్యం’ అంటూ నిస్సహాయంగా నిట్టూర్చారు పీవీ.  ఆయన అన్ని మాటలు మాట్లాడటమే విశేషం. ‘హీ ఈజ్‌ టూ సెంటిమెంటల్, యూ నో...,’ అన్నారు స్వామి. నేపథ్యం కాస్త వివరంగా చెప్పాలంటే, రాజీవ్‌గాంధీ హత్య  కేసులో శ్రీలంక తీవ్రవాద సంస్థ ఎల్‌టీటీఈ పాత్ర ఉన్నదనీ, ఆ సంస్థతో  డీఎంకేకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, రాజీవ్‌ హత్య వెనుక డీఎంకే హస్తం ఉన్నదనీ ఆ రోజుల్లో అందరినోటా వినిపించిన మాట. 1991 సార్వత్రిక ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి.

మానవబాంబు దురంతం
తమిళనాడులో ఎన్నికలు రెండో దశలో భాగం. మొదటి దశ తర్వాత తమిళనాడు శ్రీపెరంబదూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాజీవ్‌గాంధీని మానవబాంబు రూపంలో సమీపించిన ధను తనను తాను పేల్చుకొని పెద్ద విస్ఫోటనం సృష్టించింది. రాజీవ్‌ సహా 15 మంది ఆ దుర్ఘటనలో మర ణించారు. ఎల్‌టీటీఈకి రాజీవ్‌పైన అంత పగ ఎందుకు? శ్రీలంకలో తమిళుల తిరుగుబాటును అణ చివేయడానికి ఆ దేశ అధ్యక్షుడు జయవర్ధనేతో రాజీవ్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ఇండియన్‌ పీస్‌కీపింగ్‌ ఫోర్స్‌ (ఐపీకేఎఫ్‌) పేరుతో భారత సైనికులను తమిళ పులులతో తలబడటానికి జాఫ్నాకు పంపించారు. వారిలో అత్యధికులను ఎల్‌టీటీఈ బలితీసుకుంది. దారుణంగా విఫలమైన ఈ దౌత్య, సైనిక వ్యూహం రాజీవ్‌ జీవితంలో మచ్చగా మిగిలిపోయింది.

ఆ రోజుల్లో కొలం బోలో భారత హైకమిషనర్‌గా పనిచేసిన జెఎన్‌ దీక్షిత్‌ చెప్పినట్టు  ఐపీకే ఎఫ్‌ను జాఫ్నాకు పంపించాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ మినహా తమిళనాడు లోని రాజకీయ పార్టీలన్నీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాయి. ఏఐఏడిఎంకె అధినేత జయలలిత రాజీవ్‌కి సన్నిహితురా లుగా కనిపించినప్పటికీ తమిళ రాజకీయాలలో మనుగడ కోసం ఐపీకే ఎఫ్‌ను మాటవరుసకైనా వ్యతిరేకించక తప్ప లేదు. 1991 జనవరి 10న పార్లమెంటులో నాటి ప్రధాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, ‘తమిళనాడులోనే కాకుండా జాఫ్నాలోని ఎల్‌టీటీఈ కేంద్రకార్యాలయానికి కూడా తమి ళనాడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళినట్టు నాకు సమా చారం ఉంది.

ఇది చాలా తీవ్రమైన విషయం (I have information that the chief minister of Tamil Nadu has gone to the LTTE headquarters not only in Tamil Nadu but also in Jaffna. This is something very serious)' అన్నారు. కరుణానిధి ప్రభుత్వాన్ని బర్త రఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించారు. దాంతో తమిళ నాడులో తమిళ పులులకు శిక్షణ  కార్యక్రమాలను నిలిపి వేయవలసి వచ్చింది. అంతవరకూ యధేచ్ఛగా తిరు గుతూ, తమ కార్యక్రమాలను నిర్నిరోధంగా కొనసాగిస్తున్న  టైగర్స్‌ ఉనికికి ప్రమాదం ఏర్పడింది. బర్తరఫ్‌ చేయాలన్న నిర్ణయం చంద్రశేఖర్‌ స్వయంగా తీసుకున్నదేననీ, కాంగ్రె స్‌కు సంబంధం లేదనీ ఆయన దగ్గర ప్రిన్సిపల్‌ సెక్రట రీగా పని చేసిన ఎస్‌ఎన్‌ మిశ్రా తాను రచించిన ‘ఫ్లయింగ్‌ ఇన్‌ హై విండ్స్‌’ అనే పుస్తకంలో స్పష్టం చేశారు.

కానీ ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్‌ మాత్రం చంద్రశేఖర్‌ ప్రభుత్వానికి  బయటి నుంచి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి కారణంగానే డిఎంకే ప్రభుత్వంపైన వేటు వేశారని నమ్మాడు. జయవర్దనేతో ఒప్పందం చేసుకొని ఐపీకేఎఫ్‌ను పంపడమే కాకుండా తమ మిత్రప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కారకుడైన రాజీవ్‌ 1991 ఎన్నికల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవ కాశం ఉంది. అందుకే రాజీవ్‌ హత్యకు ప్రభాకరన్‌  వ్యూహం రచించాడు. 1991లో రాజీవ్‌ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, ఏఐఏడిఎంకేలకు వరుసగా 28, 11 స్థానాలు వచ్చాయి. డిఎంకే ఊసే లేదు. (ఆ రాష్ట్రంలో 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి) అయితే 1996లో లోక్‌సభకు జరిగిన ఎన్ని కలలో రాజీవ్‌ హంతకులైన ఎల్‌టీటీఈ నాయకులతో సంబంధాలు కలిగిన డిఎంకేతో ఎన్నికల పొత్తు పెట్టు కుంటే రాజీవ్‌ సతి సోనియా బాధపడిపోతారనీ, ఆగ్రహిస్తారనీ పీవీ భావించి కరుణానిధితో మాట్లాడటానికి కూడా సంకోచించారు. ఇష్టం లేకపోయినా జయలలితతోనే ఎన్ని కల పొత్తు కొనసాగించారు.

ఆ ఎన్నికలలో కాంగ్రెస్, ఏఐఏడిఎంకేలు తుడిచి పెట్టుకొని పోయాయి. ఒక్క సీటు కూడా దక్కలేదు. తమిళ మానిల కాంగ్రెస్‌–మూపనార్‌ (టీఎంసీ–ఎం)కి 20, డిఎంకేకి 17, సీపీఐకి రెండు స్థానాలు వచ్చాయి. తమిళనాడులో కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కక పోయినా పర్వాలేదు కానీ డిఎంకేతో పొత్తు పెట్టుకొని సోనియాగాంధీ మనస్సు నొప్పించకూడదని పీవీ భావిం చారు. అదే సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అదే డిఎంకేతో 2004లో, 2009లో, 2016లో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోరాడింది. అంటే రాజీవ్‌ హత్యకు సంబంధించి సోనియాగాంధీకి లేని సెంటిమెంటు పీవీకి ఉంది. కాంగ్రెస్‌పార్టీకి తీరని అపకారం చేసిన కిరణ్‌ కుమార్‌రెడ్డికి చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ కనబడిన రాహుల్‌గాంధీని  చూసినప్పుడు ఆ సెంటిమెంటు గుర్తు కొచ్చింది.

సెంటిమెంటు లేని సోనియా కుటుంబం
సోనియాగాంధీకి సెంటిమెంటు ఉంటే కాంగ్రెస్‌ పార్టీ 2004లో కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికీ, 2009లో అధికారంలో కొనసాగడానికీ ప్రబల కారకుడైన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు బనాయించి, 16 మాసాలు జైలుపాలు చేసేవారు కాదు. 2004లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలలో 29 స్థానాలనూ, 2009లో 33 స్థానాలనూ గెలిచి యూపీఏ ప్రభుత్వ అస్తిత్వాన్ని పరిరక్షించిన వ్యక్తి కుటుంబానికి సెంటిమెంటు ఉన్నవారైతే  చేతనైతే సాయం చేసే వారు కానీ కక్షకట్టి, కత్తికట్టేవారు కాదు.

కాంగ్రెస్‌ నుంచి వైదొలిగి సొంత పార్టీ పెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి అధి కారంలోకి రాకుండా నిరోధించడానికే నాటి హోంమంత్రి చిదంబరం సలహా మేరకు కొణిజేటి రోశయ్యను తొలగించి ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని సోనియాగాంధీ నియమించారు. 2014లో వైఎస్సార్‌సీపీ తలవెంట్రుకవాసిలో ఓడిపోవడంలో కిరణ్‌రెడ్డి పాత్ర ఇసుమంతైనా లేదు. కాంగ్రెస్‌ నేలమట్టం కావడంలో మాత్రం ప్రధాన భూమిక ఆయనదే. పీవీకి సన్నిహితుడైన అమరనాథరెడ్డి కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి. చిత్తూరు రాజకీయాలలో అమర్‌నాథ్‌ రెడ్డికీ, చంద్రబాబుకూ పడేది కాదు. 1980లో చిత్తూరు జిల్లా పరిషత్తు అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో నాటి మంత్రి అమరనాథరెడ్డి నిలబెట్టిన అభ్యర్థిని  మరో మంత్రి సి దాస్‌తో భుజం కలిపి మంత్రి చంద్రబాబునాయుడు ఓడించారు. డాక్టర్‌  కుతూహలమ్మను అధ్యక్షురాలుగా గెలిపించారు.

సీనియర్‌ మంత్రి, నాటి పీసీసీ అధ్యక్షుడు కోన ప్రభాకరరావుకు సన్నిహితుడూ అయిన అమరనాథ్‌ రెడ్డికి అది తీరని అవమానం. తన తండ్రికి ప్రత్యర్థి అయిన చంద్రబాబునాయుడితోనూ, చిదంబరంతోనూ షరీకై జగన్‌మోహన్‌రెడ్డిపైన కేసులు పెట్టించడంలో కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఏ సెంటిమెంటూ అడ్డురాలేదు. తనను మనసారా ప్రేమించి, చీఫ్‌విప్‌గా, శాసనసభాపతిగా పదోన్నతి కల్పిం చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడికి అపకారం చేస్తు న్నాననే స్పృహ రవ్వంతైనా లేకుండా రాజకీయ ప్రయోజ నాలు సాధించడానికి ప్రయత్నించడం మామూలు విష యం కాదు. వ్యక్తుల సంగతి సరే. తన అభ్యున్నతికి కారణమైన కాంగ్రెస్‌ పార్టీకి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా రుణం తీర్చుకున్నారు?

ఊపందుకున్న  తెలంగాణ ఉద్యమం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైఎస్‌ హఠాన్మరణం తర్వాత ఊపందుకున్నది. 2009 డిసెంబర్‌ తొమ్మిదో తేదీన ఉద్యమ సారధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పన్నెండు రోజుల నిరశన దీక్షతో దిగివచ్చిన యూపీఏ సర్కార్‌  చిదం బరం చేత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు ప్రారం భిస్తామంటూ ప్రకటన చేయించింది. ఇందుకు నిరసనగా కోస్తాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలూ, ఎంఎల్‌ఏలు మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం కాలహరణం కోసం క్షేత్ర వాస్తవికత ఏమిటో కనుక్కో వాలంటూ జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ కమిటీని 2010 ఫిబ్రవరి 3న  నియమించింది.

2010 నవంబర్‌ 24న రోశయ్య రాజీనామా చేశారు. అనంతరం నాలుగు మాసాల తర్వాత, 2011 మార్చి 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించింది. అంతకంటే ముందు 2010 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ నుంచి వైదొలగడంలో భాగంగా జగన్‌ కడప పార్లమెంటు సీటుకూ, విజయమ్మ పులివెందుల అసెంబ్లీ సీటుకూ రాజీనామా చేశారు. 2011 మే మొదటివారంలో ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉపఎన్నికలలో జగన్‌ కడప లోక్‌సభ స్థానాన్ని 5,45,671 ఓట్ల ఆధిక్యం తోనూ, విజయమ్మ పులివెందుల సీటును 81,373 ఓట్ల తేడాతోనూ గెలుచుకొని చరిత్ర సృష్టించారు.

జగన్‌ను నిరోధించడం రోశయ్య వల్ల కాదని తీర్మానించుకున్న పార్టీ అధిష్ఠానం ఆయనకు ఉద్వాసన చెప్పి రాయలసీమకే, రెడ్డి సామాజికవర్గానికే చెందిన యువనాయకుడు కిరణ్‌ కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. 2012 జూన్‌ 12న 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలకు రెండు వారాల ముందుగా సీబీఐ చేత జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించారు. విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఉప ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ 15 స్థానాలు గెలుచుకున్నది. నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని 2,90,000 మెజారిటీతో నిలబెట్టుకుంది. ఉపఎన్నికలలో పోలైన మొత్తం ఓట్లలో వైఎస్సార్‌సీపీకి 46.8 శాతం ఓట్లు పడగా, కాంగ్రెస్‌ ఓట్ల శాతం 22కి తగ్గింది. తెలుగుదేశం పార్టీ సోదిలోకి లేదు.

అధికారం ఉంటే చంద్రబాబునాయుడు మాయా మర్మం చేసి ఉపఎన్నికలలో గెలవగలరు కానీ ప్రతిపక్షంలో ఉంటే ధరావత్తు సైతం దక్కించుకోలేరు. పదేళ్ళ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలోనూ గెలవలేదు. సీబీఐ ద్వారా జగన్‌పై కేసులు బనాయించి జైలుకు పంపే తెలివితేటలు కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉన్నాయి కానీ ఎన్నికలలో జగన్‌ను ముఖాముఖిగా ఎదుర్కొనే శక్తి లేదని కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రహించింది. కిరణ్‌ ఇన్నింగ్స్‌ చివరలో అంతకంటే పెద్ద మూల్యం కాంగ్రెస్‌ పార్టీ చెల్లించుకోవలసి వచ్చింది.

రాష్ట్ర విభజనలో విచిత్రవిన్యాసాలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను ఆమోదించాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యవర్గం, యూపీఏ ప్రభుత్వం నిర్ణయిం చుకున్న తర్వాత పద్ధతి ప్రకారం ఏమి జరగాలి? కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం ముఖ్యమంత్రినీ, కేంద్ర మంత్రులనూ, పార్టీ ఎంపీలనూ, శాసనసభ్యులనూ, ఇతర ముఖ్యనాయకు లనూ కూర్చోబెట్టుకొని సమాలోచన జరపాలి. విభజన నిర్ణయానికి పార్టీ నాయకులందరినీ ఒప్పించి నిర్ణయం సజావుగా అమలు జరిగేటట్టు చూడాలి. ఆ పని చేయ కుండా ఆంధ్ర, తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాదులాటలూ, ఎత్తులూపైఎత్తులూ సాగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించింది.

రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగులుతుంటే బాధ్యతారహితంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కిరణ్‌ తన  కార్యాలయంలో విలేఖరుల గోష్ఠి నిర్వహించి వర్కింగ్‌ కమిటీ, కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తూ ఉంటే అధిష్ఠానం నిమ్మకు నీరెత్తినట్టు మౌనం పాటించింది. తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ, చివరి బంతి ఇంకా బౌల్‌ చేయవలసి ఉన్నదంటూ ఆత్మవంచనకూ, పర వంచనకూ తమ పార్టీ ముఖ్యమంత్రి ఒడిగడుతూ ఉంటే సోనియాగాంధీ కానీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌  కానీ,  ప్రధాని ఉత్తర్వులను ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధుల సమక్షంలో పరపరా చించివేసే తెగువ ఉన్న రాహుల్‌గాంధీ కానీ కిమ్మనలేదు.

ఆంధ్రప్రదేశ్‌ సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతుంటే ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కివెక్కి ఏడుస్తోంది అన్న చందంగా కేంద్ర నాయకత్వం స్పందించ కుండా మొండికేసింది. చివరకు ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత అందుకు నిరసనగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇంత హంగామా చేసినా, ఎన్ని విలేఖరులు గోష్ఠులు నిర్వహించి ఎంత గంభీరంగా మాట్లాడినా సమైక్యవాదాన్ని గట్టిగా సమర్థించిన నాయకుడిగా ప్రజలకు అర్థమై ఉంటే 2014 ఎన్నికలలో ఆయన నాయకత్వంలోని ‘జై సమైక్యాంధ్ర పార్టీ’కీ, ఎన్నికల సంఘం ప్రసాదించిన చెప్పు గుర్తుకీ జనం బ్రహ్మరథం పట్టేవారు. కిరణ్‌కు పోటీ చేసే ధైర్యం లేకపోయింది. పార్టీ అభ్యర్థులకు ధరావతు రక్షించుకునే ప్రజాదరణ లేకపోయింది. తన పార్టీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ మట్టి కరిచింది. ఎవరు ఎంత ప్రయత్నిం చినప్పటికీ సమీప భవిష్యత్తులో ఆ  పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కోలుకోలేదు. అంత దెబ్బ కొట్టారు పార్టీ నాయకులందరూ కలిసి. చెట్టు ఎక్కి కొమ్మ నరుక్కున్నారు.

రాహుల్‌ రాజనీతికి జేజేలు!
ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగా ఉండాలని అంత ప్రగాఢంగా ఆకాంక్షించి ఉంటే కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గంతో వాదించి ఒప్పించి ఉండవలసింది. 2009 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)తో పొత్తు పెట్టుకోవాలని సోని యాగాంధీ, దిగ్విజయ్‌ సింగ్, ఇతర జాతీయ నాయకులు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌తో గట్టిగా వాదించారు. పోటీ లేకుండా విజయం సాధిస్తామంటూ వైఎస్‌ కూడా అంతే గట్టిగా ఎదురు వాదించారు. చివరికి సోనియాగాంధీని ఒప్పించారు. ఒంటరిగానే కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించింది. చేతనైతే అధిష్ఠానవర్గాన్ని ఒప్పించాలి.

లేకపోతే అ«ధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహించాలి. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కిరణ్‌ సోనియాగాంధీ నిర్ణయాన్ని మన్నించి దాని అమలుకు సహకరించి ఉంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగేది. కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఇంతటి అపారమైన నష్టం వాటిల్లేది కాదు. 2013 జూలై ప్రాంతంలో వర్కింగ్‌ కమిటీ ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కసరత్తు చేసినప్పుడే కిరణ్‌ చొరవ తీసుకొని విభజన  నిర్ణయాన్ని ఆమోదించి ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకుల మధ్య సదవగాహన సాధించడానికి ప్రయత్నం చేసి ఉంటే ఎవ్వరి సహకారం లేకుండా జైరామ్‌ రమేష్‌ ఒంటరిగా విభజన బిల్లును రూపొందించే అవసరం వచ్చేది కాదు.

కనీసం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసనకర్తలైనా ఒక చోట సమావేశమై అన్ని అంశాలనూ సాకల్యంగా పరి శీలించి విభజనబిల్లు తయారు చేసి చట్టం చేసి ఉంటే, రాష్ట్ర  విభజన ఎన్నికల కంటే ఏడెనిమిది మాసాల ముందే జరిగి ఉండేది. రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉండేవి. విభజన బిల్లులోని అంశాలు అమలు జరిగితే ప్రజలలో ఏర్పడిన అపోహలు కొంతమేరకైనా తొలగి పోయేవి. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల సారథ్యంలో పార్టీ ఎన్నికలలో ప్రత్యర్థులను ఎదుర్కొనేది.

అటువంటి అవ కాశం ఇవ్వకుండా, ఎవ్వరినీ సంప్రదించకుండా, ఒంటరి వ్యూహంతో, ఒంటెత్తు పోకడతో కొంప ముంచిన నాయ కుడిని, రహస్యోద్యమం నడిపిన నాయకుడిని ఇంటికి వెళ్ళి పార్టీలో చేరమంటూ అభ్యర్థించడం ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే చెల్లింది. పార్టీకి ఎనలేని ఉపకారం చేసిన వైఎస్‌ కుటుంబాన్ని  అవమానించి, పార్టీకి అన్ని రకాలా నష్టం కలిగించి నాలుగేళ్ళుగా ఆజ్ఞాతవాసంలో ఉంటూ, తమ్ముడిని తెలుగు దేశం పార్టీలో చేరడానికి అనుమతించిన కిరణ్‌కుమార్‌ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కున చేర్చుకున్న రాహుల్‌ గాంధీ రాజనీతిని ఏమని వర్ణించాలి? ఆయన మెడలో ఎన్ని వీరతాళ్ళు వేయాలి? ‘సిగ్గులేకపోతే సరి’ అన్నట్టే రాజకీయాల్లో ‘సెంటిమెంట్‌ లేకపోతే సరి’!

-కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement