ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
♦ సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి వెల్లడి
♦ పరీక్షల కోసం నీటి నమూనాలు జీఎస్‌ఐకి..
నాగోలు (హైదరాబాద్): శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత గ్రామాల్లో మంచినీరు కలుషితమై స్థానికులు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని, ఇప్పటికే వేలాది మంది మృత్యువాత పడ్డారని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో ఆయా ప్రాంతాల నీటి నమూనాలను పరీక్షల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ)కు అందజేశామన్నారు.
రామచంద్రమూర్తితో పాటు సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం శ్రీకాకుళం కార్యదర్శి వంకాయల మాధవరావులు గురువారం బండ్లగూడలో జీఎస్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ఎం. శ్రీధర్‌ను కలసి ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల్లో ఇటీవల సేకరించిన నీటితో కూడిన 12 సీసాలను అందజేశారు. ఈ నీటిని ల్యాబ్‌లో పరీక్షించి, కిడ్నీ వ్యాధులకు మూలాలు కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు.
మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి..
ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల బారిన పడినవారు ప్రతిరోజూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందని రామచంద్రమూర్తి చెప్పారు. ఈ జబ్బులు ప్రాణాలు హరిస్తున్నా ఎవ రూ స్పందించక పోవడం బాధాకరమన్నారు. ఆ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. కేంద్రం,ఐరాస, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులను కాపాడాలని కోరారు.
ఉద్దానం ప్రాంత ప్రజలు నీటి కాలుష్యంతో పిట్టల్లా రాలిపోతున్నారని, సాక్షి యాజమాన్యం ఆ ప్రాంతానికి వచ్చి నీటి నమూనాలు సేకరించి పరీక్షలకివ్వడం అభినందనీయమని మాధవరావు అన్నారు. గతంలో పవన్‌కల్యాణ్ వచ్చి హడావుడి చేశారే తప్ప పరిష్కారం చూపలేదన్నారు. వ్యాధుల మూలాలు కనుగొని సమస్య కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. నీటిని పరీక్షించి త్వరలో నివేదిక అందజేస్తామని జీఎస్‌ఐ అదనపు డీజీ శ్రీధర్ చెప్పారు.