సోమవారం హల్ చల్ చేసిన ఎలుగుబంటి
సాక్షి, పలాస (శ్రీకాకుళం): భల్లూకాలు అడవి వదిలి ఊళ్ల మీద పడుతున్నాయి. పలాస నియోజకవర్గంలోని ఉద్దానం ప్రాంతాలుగా పేరుపొందిన పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని జీడి తోటల్లో ఎలుగు బంట్లు స్వైర విహార చేస్తున్నాయి. ఒక్కోసారి రాత్రి పూట వీధుల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే గత మూడేళ్లలో పదుల సంఖ్యలో రైతులు మృత్యువాత పడ్డారు. రాత్రి పగలు జీడి తోటల్లో పశువులు మందలతో రైతులు స్వేచ్ఛగా తిరుగుతూ తమ పనులను చక్కబెట్టుకునే వారు. అలాంటిది ఇప్పుడు గ్రామ పొలిమేరలు దాటి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. గతంలో ఉన్న ఉద్దానం ప్రాం తంలోని పెద్ద కొండ, రట్టికొండ, బాతుపురం కొండలతో పాటు జీడి తోటలు చాలా చిక్కగా దట్టంగా ఉండేవి. సాయంత్రం వేళ తర్వాత ఎలుగు బంట్లు తమ దాహార్తిని తీర్చుకోవడానికి వాటికంటూ ప్రత్యేకంగా ఒక తోవలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ తారుమారయ్యాయి. దీనికి తోడు గత ఏడాది అక్టోబరులో వచ్చిన తిత్లీ తుపానుకు జీడి చెట్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ పరిస్థితిలో వాటికి అలవాటైన తోవలు కనుమరుగయ్యాయి.
ఒక పక్క అవి ఉండటానికి తగిన ఆవాసాలు లేక మరో పక్క దాహార్తిని తీర్చుకోవడానికి దగ్గరలో చెరువులు ఇతర నీటి సదుపాయాలు లేకపోవడంతో.. ఉద్దానం ప్రాంతం నుంచి అటు సముద్రం వైపు ఇటు పల్లపు మైదాన ప్రాంతాల వైపు పరుగులు తీస్తూ ఊళ్లలోకి వస్తున్నాయి. ఇలా వస్తున్న క్రమంలో ఎలుగుబంట్లకు పగలు రాత్రి తేడా తెలీడం లేదు. ఎక్కడ చీకటి పడితే అక్కడ ఉండిపోవడం, ఎక్కడ పొద్దు తూరితే అక్కడ నుంచి బయలు దేరడం ప్రా రంభిస్తున్నాయి. ఈ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరగుతున్నాయి.
♦ సోమవారం ఉదయం ఉద్దానం గ్రామాలైన లోహరబంద, రట్టి, బాహాడపల్లి తదితర గ్రామాల్లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఎలాంటి భయం లేకుండా మోటారు బైకులు శబ్దం వినిపిస్తున్నా ఖాతరు చేయకుండా నడుస్తూ వెళ్లి ప్రజలను ఆశ్చర్యం చేసింది. ఇది తాజా ఉదాహరణ మాత్రమే. రెండేళ్ల కిందట పలాస మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మద్దిల జానకిరావు అనే పశువుల కాపరి తన జీడితోటలో పశువుల మంద వద్దకు వెళ్లి వస్తుండగా పిల్లల ఎలుగుబంటి దాడి చేసింది. అతను తీవ్రగాయాలపాలయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
♦ వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు ఒంకులూరుగెడ్డ సమీపంలో కాశీబుగ్గకు చెందిన ఒక బట్టల వ్యాపారి కాలకృత్యాల కోసం రోడ్డు పక్క కూర్చోగా ఎలుగు దాడి చేసింది. ఈ దాడి జరుగుతున్న సందర్భంగా ఆర్టీసి బస్సు కూడా అక్కడకు చేరింది. ఎంత మంది రాళ్లు విసిరి కేకలు వేసినా ఆయన మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయాడు.
వణుకుతున్న ఉద్దానం
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన తీర ప్రాంతంలో ఎలుగులు సంచరించడంతో ఉద్దాన ప్రజలు భయాందోళనతో వణుకుతున్నారు. గత రెండు రోజులుగా ఉద్దాన ప్రాంతంలో డెప్పూరు, అనకపల్లి, సీతానగర్, వంకులూరు, చీపురుపల్లి తదితర గ్రామాల్లో ఎలుగులు సంచరిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎలుగులు సంచరించడంతో ఏ సమయంలో ఏమవుతుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వీటి సంచారం ఎక్కువగా ఉంటోం దని, ఆరుబయట అడుగు పెట్టేందుకు భయపడుతున్నామని వారు వాపోతున్నారు. గతంలో ఈ ఎలుగులు చీపురుపల్లి, గుణుపల్లి, అనకపల్లి, గడూరు తదితర గ్రామాల్లో సంచరించి దాడులు చేయడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కపల్లి, రాజాం గ్రామాల్లో రాత్రి సమయంలో ఎలుగులు సంచరించి కిరాణ దుకాణం, అంగన్‌వాడీ కేంద్రంలోకి ప్రవేశించి సరుకులు ధ్వంసం చేశాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలుగుల సంచారాన్ని నియంత్రించాలని వారు కోరుతున్నారు.
గత ఏడాది ఇదే రోజు ఎలుగు దాడి
గత ఏడాది ఎర్రముక్కాం, పితాతొళి, లోహరబంద, లింబుగాం తదితర ప్రాంతాల్లో ఎలుగుబంటి చేసిన దాడిలో ఇద్దరు చనిపోయారు. ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆ దాడి జరిగి సరిగ్గా సోమవారానికి ఏడాది అవుతోంది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఎలుగుబంట్లు తిరగాడటంతో ప్రజలు భయపడుతున్నారు. బాతుపురం కొండ సమీపంలో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విధంగా ఎలుగుబంట్లు ఉద్దానం ప్రాంతంలో విచ్చల విడిగా తిరుగుతున్నాయి. గతంలో ఇవి సంచరించడానికి రాత్రి పూట ఒక సమ యం అంటూ ఉండేది. రాత్రి పది గంటల తర్వాత తమ ఆవాసాల నుంచి బయటకు వచ్చి ఆహారం, మంచినీటి కోసం వచ్చేవి. ఇప్పుడు వాటికి ఒక సమయం అంటూ లేదని ఉద్దానం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వీటిపై దృష్టి సారించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు వాటిని సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment