త్రికాలమ్
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అన్ని వర్గాల ఆమోదం కోసం తాను అనేకమందితో సమాలోచనలు జరుపుతున్నట్టు శ్రీశ్రీ రవిశంకర్ రెండురోజుల క్రితమే ప్రకటించారు. ఆయనకు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వంటి బీజేపీ అగ్రనాయకులు మద్దతు పలికారు. భారతదేశంలో నివసించే హక్కు హిందువులకు మాత్రమే ఉన్నదని శనివారం ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఉద్ఘాటించారు. ఈ పరిణామాలకూ, గుజరాత్ ఎన్నికలకూ ఏమైనా సంబంధం ఉన్నదా? గుజరాత్ ఎన్నికలకూ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ)లో సవరణలకూ లంకె ఉన్నదా? వికాస్ (అభివృద్ధి), అవినీతి రహిత పాలన అంటూ రెండు నినాదాలతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ హిందూత్వను కూడా జోడిస్తే కానీ ఆశించిన ఫలితం రాదని భావించారా? అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమా?
ఎందుకంత శ్రమ?
‘రాహుల్‌గాంధీలాగా మా మోదీ సోమరి కాదు. ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరి గినా శక్తివంచన లేకుండా కష్టపడతారు.’ ఇవి బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు ఒక ఇంగ్లీషు చానల్ చర్చాకార్యక్రమంలో అన్న మాటలు. మోదీ అక్టోబర్ మాసంలో గుజరాత్‌లో అయిదు పర్యాయాలు పర్యటించారు. గుజరాత్‌లో ఘనవిజయం ఖాయమనే విశ్వాసం ఉంటే ఒక ప్రధాని అన్నిసార్లు ఆ రాష్ట్రానికి వెళ్ళడం ఎందుకనే ప్రశ్నకు చెప్పిన సమాధానం అది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో చివరి మూడు రోజులూ ఒక్క కాశీ నగరంలోనే మోదీ ప్రచారం చేయడం విస్తుగొలిపింది. గెలుపు చాలా కష్టసాధ్యమని భావిం చిన కారణంగానే ప్రధాని ఒకే నగరంలో అన్ని రోజులు ఉన్నారేమో అనుకున్నాం. ఉత్తరప్రదేశ్‌లో అంతిమంగా బీజేపీ ఘనవిజయం సాధించింది.
బీజేపీకి యూపీలో గెలుపొందడం చాలా అవసరం. ఆ గెలుపు పార్టీకి కొత్త ఊపునిచ్చింది. దేశప్రజల దృష్టిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్థాయి పెంచివేసింది. యూపీ కంటే గుజరాత్ బీజేపీ దృష్టిలో కీలకం. ఈ రాష్ట్రాన్ని మోదీ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు పరిపాలించారు. గుజరాత్ తరహా అభివృద్ధి దేశవ్యాప్తంగా సాధిస్తాననే వాగ్దానంతోనే ఆయన 2014 ఎన్నికలలో బీజేపీకి మెజారిటీ సాధించిపెట్టారు. ఆ ఎన్నికలలో గుజరాత్‌లో ఉన్న మొత్తం 26 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకున్నది. పైగా బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అడ్వాణీ గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. షా కూడా ఆ రాష్ట్రం నుంచే ఇటీవల రాజ్యసభకు ఎన్నికైనారు. సొంతరాష్ట్రంలో ఓడిపోతే మోదీ–అమిత్‌షా ద్వయానికి తలవంపులు. గెలిచినా ఆధిక్యం 2012లో కంటే తగ్గిందంటే అప్రతిష్ఠ.
మారిన రాహుల్
1995 నుంచీ అధికార పీఠానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ‘పప్పు’గా పేరుమోసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కత్తిలాగా మాటల తూటాలు ప్రయోగించి దేశ ప్రజల మెప్పు సంపాదిం చారు. ఆత్మవిశ్వాసంతో, జీఎస్‌టీని గబ్బర్‌సింగ్ టాక్స్‌గా అభివర్ణిస్తూ విసురుతున్న చలోక్తులతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ‘ఇండియా టుడే’, ‘టైమ్స్ నౌ’ వంటి మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు బీజేపీకి ఈ సారి 2012లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని జోస్యం చెబుతున్నప్పటికీ మోదీకి నమ్మకం కలగడం లేదు. అందుకే అంత తరచుగా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడటానికి ముందు ఆ రాష్ట్రంలో రూ.15,000 కోట్ల రూపాయాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కూడా అందుకే. ‘అచ్ఛే దిన్’గురించి అంతగా ప్రస్తావించకపోవడానికీ అదే కారణం.
ఈ సంవత్సరం ఆరంభంలో యూపీలో అమిత్‌షా, 1970లలో గుజరాత్‌లో ఇందిరాగాంధీ చేసిన ప్రయోగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్నారు. యూపీలో సుమారు 200 కుల సమావేశాలను అమిత్‌షా నిర్వహించి అన్ని కులాల మద్దతూ కూడగట్టి యాదవ కులాన్ని ఒంటరిదాన్ని చేశారు. ఇందిరాగాంధీ క్షత్రియులనూ ( గుజరాత్ జనాభాలో 37శాతం ఓబీ సీలు), దళితులనూ (6), ఆదివాసీలనూ (15), ముస్లింలనూ (10 శాతం) ఒక తాటిపైకి తెచ్చి (ఓఏఅ M‘ఖామ్’) బలమైన సంకీర్ణం నిర్మించారు. నాడు ఈ కృషిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓబీసీ నాయకుడు జీనాభాయ్ దర్జీది ప్రధానపాత్ర. నేడు రాహుల్‌గాంధీ చాకచక్యం వల్ల కాకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల 70 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాల నాయకులు కాంగ్రెస్‌తో భుజం కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మోదీ, షాలను బాగా కలవరపెడుతున్న పరిణామం.
వ్యాపారమే ప్రధానంగా భావించే గుజరాతీయులలో అకస్మాత్తుగా ఒక చైతన్యం వెల్లువెత్తుతుంది. చినికి చినికి గాలివానగా మారుతుంది. యువత అతి వేగంగా స్పందించి తిరుగుబాటు చేస్తుంది. అహ్మదాబాద్ హాస్టళ్ళలో ఆహారం నాసిరకంగా ఉండటానికీ, మెస్ బిల్లులు పెరిగిపోవడానికీ నిరసనగా 1973 డిసెంబర్‌లో ఆరంభమైన విద్యార్థుల ఆందోళన క్రమంగా ఊపందుకొని నవనిర్మాణ ఉద్యమంగానూ, అనంతరం జయప్రకాశ్‌నారాయణ్ నాయకత్వంలో సంపూర్ణ విప్లవంగానూ పరిణమించింది. 1975లో ఆత్యయిక పరిస్థితికి దారితీసి, 1977లో ఇందిరాగాంధీ ఘోర పరాజయానికి కారణమై దేశ రాజకీయాలను సమూలంగా మార్చివేసింది. విద్యార్థి ఉద్యమం గుజరాత్‌లో చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. 43 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుజరాత్‌లో యువత ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తోంది. మూడు బలమైన వర్గాలకు ప్రతినిధులుగా ముగ్గురు యువనేతలు– హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకుర్, జిగ్నేశ్ మెవానీ– ఎదిగారు.
ముగ్గురు మరాఠీలు
పతీదార్లకు ఉద్యోగాలలో, విద్యాసంస్థలలో రిజర్వేషన్లు కావాలంటూ పతీదార్ అనామత్ ఆందోళన్ సమితి (PASS )ఆధ్వర్యంలో 2015లో 22 ఏళ్ళ హార్దిక్ పటేల్ ఆందోళన మొదలుపెట్టారు. ఆనందీబెన్ పటేల్ సర్కార్‌ను గడగడలాడిం చారు. పతీదార్లు వ్యవసాయం ప్రధానంగా జీవించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయాధార పరిశ్రమలకూ, ఇతర పరిశ్రమలకూ, రాజకీయాలకూ విస్తరించారు. కడ్వ, ల్యూవా పటేల్ ఉపకులాలవారు హార్దిక్‌పటేల్‌ను సమర్ధిస్తున్నారు. గుజరాత్ జనాభాలో కడ్వ పటేళ్ళు ఆరు శాతం, ల్యూవా పటేళ్ళు ఎని మిది శాతం, ఇతర పటేళ్ళు రెండు శాతం ఉంటారు. 1984–85 నుంచీ పటేళ్ళు మూకుమ్మడిగా బీజేపీతో ఉన్నారు. ఈ సారి తేడా వచ్చింది. కానీ నాయకులు మాత్రం ఇప్పటికీ బీజేపీతోనే ప్రయాణం చేస్తున్నారు.
అల్పేశ్ ఠాకుర్ (40) ఓబీసీ నాయకుడు. కాంగ్రెస్ నేత ఖోడాభాయ్ పటేల్ తనయుడు. ఆరేళ్ళ కిందట ‘క్షత్రియ ఠాకుర్ సేన’ను అల్పేశ్ స్థాపించారు. ఆ సంస్థలో ఏడు లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఏక్తామంచ్ (OSS ) నెలకొల్పారు. మంచి నిర్వాహకుడిగా పేరు సంపాదిం చారు. అల్పేశ్ ప్రభావం ఉత్తర గుజరాత్‌లోని సబర్‌కాన్తా (3 నియోజకవర్గాలు), బనాస్కాంతా (9), ఖేడా (7), మెహసానా(7), ఆనంద్ (7), పట్నా (4), గాంధీనగర్ (5), ఆరావళీ (3) జిల్లాలలో విశేషంగా ఉంటుంది. ఉత్తర గుజరాత్‌లోని మొత్తం 33 శాసనసభ స్థానాలలో 2012 ఎన్నికలలో కాంగ్రెస్ 17 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 15కే పరిమితమైంది. అప్పుడు శంకర్‌సిన్హ్ వఘేలా కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆయనకు 15 నియెజకవర్గాలలో పట్టు ఉంది. గత జులైలో వఘేలా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారు. ‘జనవికల్ప్’ పేరుతో కొత్త కుంపటి పెట్టుకున్నారు. 1996 లో సైతం బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా కాంగ్రెస్‌లో చేరకుండా ‘రాష్ట్రీయ జనతా పార్టీ’ని నెలకొల్పారు. 1998 ఎన్నికలలో ఆ పార్టీ గుర్తుపై అభ్యర్థులను నిలబెట్టి 12 శాతం ఓట్లు చీల్చుకున్నారు. ఓబీసీలలో ఠాకూర్లది పెద్ద వర్గం. దాని నాయకుడు అల్పేశ్ ఇటీవల జనాదేశ్ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి తన నాయకత్వం లోని ఓఎస్‌ఎస్ సంస్థను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
జిగ్నేశ్ మెవానీ 37 సంవత్సరాల యువకుడు. వృత్తిరీత్యా న్యాయవాది. పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు వేయడంలో దిట్ట. 2016లో ఉనా నగరంలో నలుగురు అర్ధనగ్నంగా ఉన్న దళిత యువకులను గోరక్షకులు విపరీతంగా కొట్టిన ఘటనపై పెద్ద ఉద్యమం నిర్మించి దళిత నేతగా ఎదిగిన వ్యక్తి జిగ్నేశ్. చాలామంది దళితులను బౌద్ధంలో చేర్పించారు. గుజరాత్ జనాభాలో దళితులు ఆరు శాతం. ముస్లింలు పది శాతం. ఈ రెండు వర్గాల మద్దతు లేకుండానే ఎన్నికలలో గెలవడం బీజేపీకి పరిపాటి. గుజరాత్‌లోని వివిధ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ముగ్గురు యువకులు గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలలోనూ 111 స్థానాలను ప్రభావితం చేయగలరు. వీరిని కాంగ్రెస్ అక్కున చేర్చుకోగలిగితే బీజేపీ విజయావకాశాలు గణనీయంగా దెబ్బతింటాయి. అల్పేశ్, జిగ్నేశ్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. తాను పోరాడుతున్నది పటేళ్ళకు రిజర్వేషన్లకోసం కనుక రిజర్వేషన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే తాను పూర్తి మద్దతు ఇస్తానని హార్దిక్ చెబుతున్నాడు. హామీ ఇవ్వడం అంత తేలిక కాదు. పటేళ్ళకు రిజర్వేషన్లు అవసరమా, లేదా అనే విషయంపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాహుల్‌గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయినా బీజేపీని ఓడించి గుణపాఠం చెప్పాలని పట్టుదలగా ఉన్న హార్దిక్ కాంగ్రెస్ పార్టీని సమర్థించక తప్పకపోవచ్చు.
బీజేపీ నేతల్లో గుబులు
ఆర్ధిక మాంద్యం గుజరాత్‌లో వివిధ వర్గాలను దెబ్బతీస్తున్నది. వ్యవసాయరంగం దీనావస్థలో ఉంది. ఇటీవలి వరదలలో నష్టపోయినవారిలో చాలామంది ఇంకా కోలుకోలేదు. ఆరోగ్యం, రవాణా రంగాలు కుదేలైనాయి. ఇంతవరకూ బీజేపీని బేషరతుగా బలపరిచిన అహ్మదాబాద్, సూరత్ వజ్రాలూ, జౌళి వ్యాపారులు జీఎస్‌టీతో దారుణంగా దెబ్బతిని ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ఈ నెల 8 వ తేదీన వదోదరా సభలో ప్రసంగిస్తున్న మోదీపైన పరిమిత వేతనాలకు వ్యతి రేకంగా పోరాడుతున్న సంస్థ అధ్యక్షురాలు చంద్రికా సోలంకీ అరడజను గాజులు విసిరి నిరసన ప్రకటించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భరత్‌సింగ్ సోలంకీ సమర్థుడుగా పేరు తెచ్చుకున్నాడు. పంచాయతీ ఎన్నికలలో సాధించిన విజయం తాలూకు ఉత్సాహం పార్టీ కార్యకర్తలలో ఉంది. అయినప్పటికీ నవంబర్ 9, 14 తేదీలలో 14వ గుజరాత్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఓడించగలదని చెప్పడం కష్టం.
బీజేపీ చేతిలో అధికారం ఉంది. వివిధ వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది. అంగబలం, అర్థబలం ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దయినప్పటికీ అధికారపార్టీ చేతుల్లో నల్లధనం అపారంగా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణుల క్షేత్రస్థాయి సేవలు ఉన్నాయి. 2002 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పొందిన ఓట్ల కంటే బీజేపీకి వచ్చిన ఓట్లు 10–11 శాతం అధికం. మోదీ ప్రధానిగా వచ్చి ఓట్లు అడుగుతున్నారు కనుక బీజేపీకే వేయాలనే ఆలోచన చాలామందిలో ఉండవచ్చు. అయినప్పటికీ మోదీ ర్యాలీలకు జనం ఉత్సాహంగా హాజరు కాకపోవడం బీజేపీ నాయకత్వంలో గుబులు పుట్టిస్తున్నది. ఈ ఎన్నికలలో బీజేపీ గెలిస్తే సరిపోదు. భారీ ఆధిక్యం సాధించాలి. లేకపోతే ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం క్షమించదు. ప్రజల దృష్టిలో మోదీ–షా ద్వయం పలచన అవుతారు. వారి మ్యాజిక్ పనిచేయడం లేదనే అభిప్రాయం కలుగుతుంది. అటువంటి అభిప్రాయం ప్రబలితే గుజరాత్ ఎన్నికల తర్వాత జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, ఆ తర్వాత 2019 నాటి సార్వత్రిక ఎన్నికలలోనూ బీజేపీకి నష్టాలూ, కష్టాలూ పెరుగుతాయి. అందుకే మోదీ అంతగా శ్రమిస్తున్నారు.
కె. రామచంద్రమూర్తి
Comments
Please login to add a commentAdd a comment