అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో వచ్చే ఏడాది(2025) జనవరిలో నూతన రామాలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పుటినుంచే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది.
అప్పటి నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతినిత్యం అయోధ్య ఆలయాన్ని సందర్శించుకుంటూ వస్తున్నారు. తాజాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామాలయ వార్షికోత్సవ వేడుల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. దీనిప్రకారం జనవరి 22న కాకుండా జనవరి 11నే వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇలా 10రోజుల ముందుగా ఈ వేడుకలు నిర్వహించడం వెనుక ఒక కారణం ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
అయోధ్యలోని మణిరామ్ దాస్ కంటోన్మెంట్‌లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పండితులతో సంప్రదింపులు జరిపారు. రాబోయే సంవత్సరంలో రామాలయంలో ఎప్పుడు ఏ ఉత్సవం నిర్వహించాలనేదీ నిర్ణయించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.
ప్రతి సంవత్సరం పౌష్య శుక్ల ద్వాదశి అంటే కూర్మ ద్వాదశి నాడు ఈ ఉత్సవం జరుపుకోవాలని పండితులు తెలిపారు. 2025లో ఈ తిధి జనవరి 11న వచ్చింది. దీని ప్రకారం అయోధ్యలో నూతన రామాలయ, బాల రాముని ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవ కార్యక్రమాలు జనవరి 11న జరగనున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ సమావేశంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే వార్షికోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన పలు నిర్ణయాలు కూడా తీసుకుంది.
ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment