ఆచితూచి వేయాలి ఓటు | K Ramachandra Murthy Article On Elections | Sakshi
Sakshi News home page

ఆచితూచి వేయాలి ఓటు

Published Sun, Apr 7 2019 12:46 AM | Last Updated on Sun, Apr 7 2019 12:46 AM

K Ramachandra Murthy Article On Elections - Sakshi

ఎన్నికల ప్రచారానికి ఎల్లుండి సాయంత్రం తెరబడుతుంది. కొన్ని వారాలుగా ఎన్నికల ప్రచారం పేరుతో సాగిన రణగొణధ్వని ఆగిపోతుంది. ఓటర్లు ప్రశాం తంగా ఆలోచించి వివేకంతో తమ హక్కు వినియోగించుకునే సమయం ఆసన్న మైంది. ప్రజలకు తగిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యంలో వస్తుందంటారు (People get the government they deserve). ఎందుకంటే ప్రజలు ఎన్ను కున్న ప్రతినిధులే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు.  కడచిన అయిదేళ్ళ అనుభవం ఆధారంగా మన ప్రతినిధులుగా చట్టసభలకు ఎవరిని పంపించాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించాలి. కలమతాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగకుండా, సమాజశ్రేయస్సే పరమావధిగా పరిగణించి ఓటు వేయాలి. అధికారపక్షం, ప్రతిపక్షం, ఇతర పక్షాల నాయకులు ఎన్నికల సభలలో చెప్పింది విన్నాం. అన్ని రకాల ప్రచారాలనూ చూశాం. వివిధ పార్టీల ఎన్నికల ప్రణాళికల (మేని ఫెస్టోల)ను అధ్యయనం చేశాం.

ఏ ఎన్నికల ప్రణాళిక జనజీవన ప్రమాణాల పెరుగుదలకు దోహదం చేస్తుందో, మెరుగైన సమాజ నిర్మాణానికి దారి తీస్తుందో, మౌలిక రంగాల అభివృద్ధికి తోడ్పడుతుందో, ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే ప్రగతిశీలమైన పరిపాలన అందిస్తుందో గుర్తించాలి. ముఖ్యంగా ఎవరిని విశ్వసించాలో, ఎవరి చేతుల్లో మనలను పరిపాలించే బాధ్యత, అధి కారం పెట్టాలో, ఎవరికి రాష్ట్ర, దేశ సారథ్యం అప్పగించాలో క్షుణ్ణంగా ఆలోచించి సవ్యంగా నిర్ణయించుకోవాలి.  గురువారంనాడు (11వ తేదీ) జరిగే పోలింగ్‌లో పొరపాటు చేస్తే వచ్చే అయిదు సంవత్సరాలూ కష్టనష్టాలు అనుభవించక తప్ప దనే వాస్తవాన్ని గ్రహించాలి. సరైన నిర్ణయం తీసుకుంటే ఆశలూ, ఆకాంక్షలూ కార్యరూపం ధరించే అవకాశం ఉంటుంది.

విధానాల కంటే వ్యక్తులే ప్రధానం  
బ్రిటన్‌లో వలె మన దేశంలోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ పార్టీలూ, సిద్ధాంతాలూ, మేనిఫెస్టోల కంటే నాయకులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల మాదిరి లోక్‌సభ ఎన్నికలలోనూ, చాలా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలోనూ పోటీ జరుగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాని పదవికి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాన అభ్యర్థులు. ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్ణాయక పాత్ర పోషించవచ్చు. కానీ వారిద్దరితో పోల్చదగిన స్థాయిలో మరో నాయకుడు లేడు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గడువుకంటే ముందే జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఘన విజయం సాధించింది. అక్కడ లోక్‌సభ ఎన్నికలే జరుగుతున్నాయి. అంతగా సందడి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో సామాన్య ప్రజలతో మమేకమై, వారి బాధలనూ, సమస్యలనూ అవగాహన చేసుకున్నారు. ప్రతి సామాజికవర్గం ప్రతినిధులనూ కలుసుకొని వారు చేసిన అభ్యర్థనలను ఆలకించి వారి సమస్యలు పరిష్కరిస్తామంటూ వాగ్దానం చేశారు. పాదయాత్ర అనంతరం ఎన్నికల ప్రచారం ఆరంభించిన జగన్‌ ఎన్నికల సభలలో హుందాగా, సకారాత్మకంగా, ప్రభావవంతంగా ప్రసంగాలు చేస్తున్నారు. కడచిన నాలుగేళ్ళ పది మాసాలలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వం పని చేసిన తీరును నిశితంగా విమర్శించారు.

సహజంగానే ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడు కనుక ఆయనపైనే ప్రధానంగా ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సీపీని ప్రజలు ఎన్ను కుంటే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలూ, అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టేది సవివరంగా చెప్పారు. రెండు వారాలుగా ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతి కూడా శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు. పాద యాత్రలో భాగంగానూ, ఎన్నికల ప్రచారంలో భాగంగానూ జరిగిన జగన్‌ సభలకు పోటెత్తిన జనం అధికారపక్ష నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. విజయమ్మ, షర్మిల సభలకు సైతం ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం విశేషం. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ప్రచారానికి పూర్తి భిన్నంగా అధికార టీడీపీ ప్రచారం జరిగింది. టీడీపీ అధినాయకుడిది ఆద్యంతం నకారాత్మక శైలి. అధి కారంలో దాదాపు అయిదేళ్ళు ఉన్నప్పటికీ ప్రజలకు చూపించేందుకు సాధించిన విజయం ఒక్కటీ లేదు. అమరావతి డిజైన్ల స్థాయిలోనే ఆగిపోయింది. ఖరీదైన తాత్కాలిక భవనాలు మినహా శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక పేర్చింది లేదు. ఏటా మూడు పంటలు పండే భూములు నాలుగేళ్ళుగా నిష్ఫలంగా పడి ఉన్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరంభించి, అరవై శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు పనులు 2018 వరకూ అంగుళం కదలలేదు.

ఇప్పటికీ డ్యామ్‌ నిర్మాణం జరగలేదు. ఏదీ పూర్తి కాకముందే సంబరాలూ, సందర్శనలూ పేరిట నాలుగైదు వందల కోట్ల వృధావ్యయం. పోలవరం పూర్తి చేస్తే నిరర్థకంగా మిగిలే పట్టిసీమ నిర్మాణం కేవలం ముడుపుల కోసమే అని విషయపరిజ్ఞానం ఉన్నవారు వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులంటే చంద్రబాబుకి పెద్దగా శ్రద్ధ లేదని అందరికీ తెలుసు. వ్యవసాయం దండుగ అంటూ మాట్లాడిన వ్యక్తి ఆయన. చేసింది రవ్వంత, ప్రచారం కొండంత. కొన్ని చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవడం, దానికి ప్రచారం చేయించుకోవడం ఆయన ప్రత్యేకత. చేతివాటం విచ్చలవిడిగా సాగింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వ్యయం పెంపుదల అడ్డగోలుగా జరిగింది.  

ప్రతిపక్షం అంటే శత్రుభావం
బీజేపీతో ఏకీభవించనివారిని ఎన్నడూ శత్రువులుగా, దేశద్రోహులుగా పరిగణిం చలేదని బీజేపీ వ్యవస్థాపకుడు లాల్‌కృష్ణ అడ్వాణీ తన బ్లాగ్‌లో రాసుకున్న వ్యాఖ్య నరేంద్రమోదీకీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకీ వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువగా చంద్రబాబుకి వర్తిస్తుంది. ప్రతిపక్షం అంటే శత్రుభావం, ఈసడింపు, ద్వేషం చంద్రబాబు ప్రతి మాటలో, ప్రతి కదలికలో స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అబద్ధపు అరోపణ చేసి, అదే ఆరోపణను పదేపదే తాను చేసి, తనవారిచేత చేయించి ప్రతిపక్ష నాయకుడినీ, ఇతర ప్రతిపక్ష సభ్యులనూ కించపరచడం, ఎద్దేవా చేయడం, అప్రతిష్టపాలు చేయడం ఆయనకు ఇష్టమైన క్రీడ. చీఫ్‌ సెక్రటరీలుగా పని చేసిన ఇద్దరు ఉన్నతాధికారులు పదవీ విరమణ తర్వాత ముఖ్యమంత్రినీ, ఆయన చుట్టూ ఉన్న అధికార, అనధికార ప్రముఖులను అవినీతి అనకొండలుగా అభివర్ణించిన సందర్భం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇంత వరకూ లేదు. పైగా ఒకే సామాజికవర్గానికి చెందినవారి నియంత్రణలో ప్రభుత్వం నడుస్తున్నదని ఐఏఎస్‌ అధికారులు ఆరోపించడం అసాధా రణం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన క్షణంలోనే ఆరంభించిన ఆత్మస్తుతీ, పరనిందా ఎన్నికల ప్రచారంలో పతాకస్థాయికి చేరుకున్నది.

నిర్హేతు కమైన విమర్శల శ్రుతి హెచ్చింది. వాగ్దాడుల తీవ్రత పెరిగింది.  ఈ క్రమంలో కనీస మర్యాదలనూ, సంప్రదాయాలనూ తుంగలో తొక్కారు. నోటికి వచ్చిన ఆరోపణలు సంధిప్రేలాపనల స్థాయికి దిగజారాయి. ప్రతిపక్ష నాయకుడిని అవినీతిపరుడనీ, రౌడీ అనీ, హంతకుడనీ, దొంగలముఠా నాయకుడనీ, నోటికి వచ్చిన మాటలన్నీ మొరటుగా మాట్లాడటం చంద్రబాబును ఇంతవరకూ గౌర వించినవారికి కూడా అసహ్యం కలిగిస్తున్నది. పులివెందుల, కడప జిల్లా ప్రజ లను పదేపదే రౌడీలంటూ ముద్రవేయడం ఒక ముఖ్యమంత్రి చేయకూడని మతిలేని పని. ఆయన దేహభాష సైతం అభ్యంతరకరంగా ఉంటున్నది. తనకు మరోసారి అధికారం ఎందుకు ఇవ్వాలో, అధికారంలో ఉన్న అయిదేళ్ళలో ఏమి చేశారో, భవిష్యత్తులో ఏమి చేయబోతారో ప్రజలకు వివరించాలి. జగన్‌నీ, తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావునీ, ప్రధాని మోదీనీ విలన్లుగా చిత్రించి, వారిపైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలలో ద్వేషభావం పెంచి ఓట్లు సంపాదించా లని చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురినీ దుర్భాషలాడుతు న్నారు. అబద్ధాలు అదే పనిగా చెబుతున్నారు. ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించిన వెంటనే నరేంద్రమోదీ, కేసీఆర్‌ కూడబలుక్కొని ‘ఓటుకు కోట్ల కేసు’ను తిరగ దోడినా, పోలవరం నిధుల గోల్‌మాల్‌ విషయంలో, అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కుంభకోణంలో, సింగపూర్‌తో అక్రమసంబంధాలపైన విచారణ జరిపించినా కథ మరో రకంగా ఉండేది.

రాష్ట్రంలో ఎవరిపైన ఐటీ దాడులు జరి గినా ముఖ్యమంత్రి ఉలిక్కి పడుతున్నారు. తన మీద ఈగ వాలకుండానే  మీడియా సహకారంతో తనకు ఘోరమైన అన్యాయం జరిగిపోయినట్టు  ప్రచారం చేస్తున్న చంద్రబాబును నిజంగా ముట్టుకుంటే మిన్ను విరిగి మీదపడినట్టు గగ్గోలు పెట్టి ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారని మోదీకి తెలుసు. సీమాంధ్ర సమావేశాలలో ప్రధాని మాట్లాడుతూ ‘యూ– టర్న్‌బాబూ’ అంటూ సెటైర్లు వేయడం తప్పించి ముఖ్యమంత్రికి నష్టం కలిగించే ఆరోపణలు ఏమీ చేయలేదు. చర్యలు అసలే లేవు. మోదీకి ఎన్నికలైన తర్వాత ఎవరికి ఎంపీ స్థానాలు ఎక్కువ ఉంటే వారితోనే పని. అన్ని సర్వేలూ వైఎస్‌ ఆర్‌సీపీకి 19 నుంచి 22 వరకూ ఎంపీ స్థానాలు వస్తాయని స్పష్టం చేస్తున్న ప్పటికీ, ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా చంద్రబాబును మోదీ ఎందుకు దూరం చేసుకుంటారు? అనరాని మాటలు అని రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్ళి శాలువా కప్పిన వ్యక్తి మోదీ పంచన మళ్ళీ చేరరని పూచీ ఏమున్నది?

ఎవరి సంస్కారం ఏపాటిది?
కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేతులు కలిపి తనపైన సీబీఐని ప్రయోగించి, బూటకపు కేసులు బనాయించి, జైలులో పెట్టించి, పదహారు మాసాలు బెయిల్‌ రాకుండా చేసినప్పటికీ ఆ నాయకుల గురించి జగన్‌ ఒక్కసారైనా పరుషంగా మాట్లాడలేదు. పైగా కాంగ్రెస్‌ నాయకులను మనస్పూర్తిగా క్షమించానని ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. యువ నాయకుడు అత్యంత సంయమనం, హుందాతనం, మర్యాద, సంస్కారం ప్రదర్శిస్తుంటే దేశంలోనే సీనియర్‌ నాయకుడినంటూ చెప్పుకునే ముఖ్యమంత్రి ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. అభి లషణీయం కాని ఒక విధానంపైన కానీ ఒక కార్యక్రమంపైన కానీ, ఒక ధోరణిపైన  కానీ ఎవరిని ఎంత కటువుగా విమర్శించినా అర్థం చేసుకోవచ్చు. ధర్మాగ్రహం ప్రదర్శించినా ఒప్పుకోవచ్చు. కేవలం రాజకీయ లబ్ధికోసం అడ్డదారులు తొక్కుతూ ఇంత నైచ్యానికి ఒడిగట్టడం అవసరమా? ప్రభుత్వ ఖజానా నుంచి రూ 8000 కోట్లు అన్నదాతా సుఖీభవ పథకం కింద పోలింగ్‌ వారంరోజుల వ్యవధి ఉన్నాయనగా రైతుల ఖాతాలలో జమచేసినట్టు బహి రంగసభలో ప్రకటించిన చంద్రబాబుకి చట్టాల పట్లా, రాజ్యాంగం పట్లా ఏ మాత్రం విశ్వాసం లేదు. వైఫల్యభీతి మాత్రం వెంటాడుతోంది. అడ్డగోలుగా మాట్లాడిస్తోంది.   

 2014 ఎన్నికలలో జగన్‌పైనా, పులివెందుల ప్రజలపైనా, కడప జిల్లాపైనా ఏ ఆరోపణలు చేశారో అవే ఆరోపణలు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. అటువంటి అర్థంపర్థం లేని ఆరోపణ లూ, కట్టుకథలూ, వదంతులూ మళ్ళీ విశ్వసించి మోసపోవడమా లేక జగన్‌కి ఒక అవకాశం ఇవ్వడమా? ఉగాదినాడు విడుదలైన వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ ఎన్నికల ప్రణాళికలు పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో సంక్షిప్తంగా, సమగ్రంగా ఉంది. విద్యకూ, ఆరోగ్యానికీ, వ్యవసాయానికీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీడీపీ మేనిఫెస్టో 32 పేజీలు ఉంది. అంతటా పునరుక్తి. అయిదేళ్ళ కింద విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోకీ, దీనికీ తేడా లేదు. తాజా మేనిఫెస్టోలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారికి కూడా నిరుద్యోగభృతి ఇస్తానన్న హామీ అధికం. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్ళు నిరుద్యోగుల గోడు పట్టించుకోకుండా, ఆ వైఫల్యానికి క్షమాపణ చెప్పకుండా, అంతకంటే ఖరీదైన హామీ ఇవ్వడం చంద్రబాబు వంటి తెంపరికే చెల్లింది.

తాను ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారని ఆయన భ్రమిస్తు న్నారు. మేనిఫెస్టోలు పోల్చి చూసుకున్న తర్వాత, వారి నడతను పరిశీలించిన అనంతరం ఈ ఇద్దరు నాయకులలో ఎవరి మాటను విశ్వసించాలో, చెప్పిన మాటకు ఎవరు కట్టుబడి ఉంటారో, ఇచ్చిన హామీని ఎవరు నెరవేరుస్తారో, ఎవరి వ్యక్తిత్వం ఏమిటో గ్రహించాలి. ఒక వైపు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో దేశంలోని అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకొని అవకాశవాద రాజకీయాలను అను సరిస్తూ వచ్చిన చంద్రబాబు ఒక వైపు. పదేళ్ళ రాజకీయ జీవితంలో అత్యధిక సమయం  మాట మార్చకుండా, మడమ తిప్పకుండా ప్రజల మధ్య గడిపిన యువనాయకుడు మరో వైపు. ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోవాలి.  ఈ కసరత్తు చేసిన తర్వాత ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement