మూడు చారిత్రక సందర్భాలు | K.Ramachandra Murthy writes on three historical scenarios | Sakshi
Sakshi News home page

మూడు చారిత్రక సందర్భాలు

Published Sun, Nov 26 2017 2:28 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

K.Ramachandra Murthy writes on three historical scenarios - Sakshi - Sakshi

మూడు వారాల్లో మూడు ఘనకార్యాలు. ఏ ప్రభుత్వానికైనా గర్వకారణమే. ఏ పని చేసినా పతాక స్థాయిలో ‘బ్రహ్మాండంగా’ చేయాలనే మనస్తత్వం కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) శైలికి తగిన విధంగానే మూడు అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ నెల 28వ తేదీ గురువారం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో నమోదు చేయదగిన రోజు. అదేరోజు హైదరాబాద్‌ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రోరైలుకు ప్రధాని నరేంద్రమోదీ పచ్చజెండా ఊపుతారు. ఆ రోజే ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజుల సదస్సు పూర్తయిన రెండు వారాల తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల అయిదు రోజుల మహోత్సవం. ఈ మూడు కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం, మెట్రోరైలు నిర్మిస్తున్న ఎల్‌ అండ్‌ టీకి చెందిన సిబ్బందీ, సాహిత్య అకాడెమీ నేతృత్వంలో పని చేస్తున్న తెలుగు భాషాభిమానులూ, మేధావులూ ఊపిరి సలపని పనితో సతమతం అవుతారు.

మెట్రోరైలు తెలుగు ప్రజలకు కొత్తగా అందివస్తున్న ఆధునిక వసతి. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి మహానగరాల సరసన నిలబెట్టే నిర్మాణం. తెలుగు మహాసభలు తెలంగాణలో తెలుగు భాషావాఙ్మయాలు వందల సంవత్సరాలుగా అభివృద్ధి చెందాయంటూ హృదయం ఉప్పొంగేలా చాటుకునే శుభ సందర్భం. హైదరాబాద్‌ బ్రాండ్‌ని ప్రపంచపటంలో మరోసారి నిలబెట్టడానికీ, ఇక్కడ పరిశ్రమలు పెంపొందించేందుకు అవసరమైన వాతావరణం ఉన్నదని నమ్మించడానికీ ఈ సదస్సు అవకాశం కల్పించింది. భవిష్యత్తులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వెంచర్‌ కేపిటలిస్టులు ప్రోత్సాహం అందించి పారిశ్రామిక ప్రగతికీ, ఉపాధి కల్పనకూ దారి తీస్తారని ఆశించవచ్చు. ఒక రైలు మార్గం నిర్మించడం, పరిశ్రమలను విస్తరించడం ఒక్క సంవత్సరంలోనో, ఐదు సంవత్సరాలలోనే అయ్యే పని కాదు. ఇటుకపైన ఇటుక పేర్చుకుంటూ వెళ్ళవలసిందే. ఒక ప్రభుత్వం సంకల్పిస్తే, మరో ప్రభుత్వం ప్రారంభిస్తే, మరికొన్ని సర్కార్‌లు కొనసాగిస్తే కానీ ఒక కొలిక్కి రాదు. ఇది నిరంతరాయంగా జరగవలసిన ప్రక్రియ.

నిజమైన కల మెట్రోరైలు
ట్రాఫిక్‌ జామ్‌లతో, గంటల తరబడి ప్రయాణాలతో విసిగి వేసారిన హైదరాబాద్‌ ప్రజలకు మెట్రోరైలు కొంత ఊరట కలిగిస్తుంది. వాహనరద్దీ, వాయు, శబ్ద కాలుష్యాలూ ఎంతో కొంత తగ్గుతాయనే ఆశ. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మెట్రో ఆలోచన రూపుదిద్దుకుంది. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిం చాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ ఫ్లయ్‌వోవర్ల నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డిని మెట్రోరైల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, రాష్ట్ర విభజన జరిగినా మెట్రోరైల్‌ ప్రాజెక్టు సారథిగా ఎన్‌విఎస్‌ రెడ్డి కొనసాగడం విశేషం. సత్యం కంప్యూటర్స్‌ అధినేత రామలింగరాజుకు చెందిన మైటాస్‌ సంస్థకు ప్రాజెక్టు నిర్మాణం పనులు అప్పగించారు. కానీ సత్యం సంస్థ ఆర్థికంగా దెబ్బతినడంతో మెట్రోరైలు ప్రాజెక్టుకు పెద్ద అవాంతరం ఏర్పడింది. రోశయ్య హయాంలో ఎల్‌ అండ్‌ టీ రంగంలోకి దిగింది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలనలో పనులు కొనసాగాయి.

రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ప్రభుత్వానికీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థకూ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినప్పటికీ ఉభయ పక్షాలూ విజ్ఞత ప్రదర్శించడంతో అవి సర్దుకున్నాయి. కేసీఆర్‌ ఆధ్వర్యంలో 30 కిలోమీటర్ల మెట్రోలైనుకు ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇది ఒక రికార్డు. ఢిల్లీ మెట్రోరైలు నిర్మాత శ్రీధరన్‌ ఎన్‌వీఎస్‌ రెడ్డికి గురువు. ఆయన హైదరాబాద్‌ మెట్రోరైల్‌ చూసి అత్యద్భుతం అంటూ ప్రశంసించారని సాక్షి టీవీ ఇంటర్వ్యూలో రెడ్డి చెప్పారు. తాను జీవితంలో సాధించిన ఘనవిజయంగా, పదేళ్ళ శ్రమ ఫలించినట్టుగా ఆయన భావిస్తున్నారు. ప్రారంభంలో అంచనా వ్యయం రూ. 12,132 కోట్లు. 2010లో రెండోసారి టెండర్లు ఖరారు చేసినప్పుడు సవరించిన అంచనావ్యయం రూ. 14,132 కోట్లు. అనంతరం ప్రాజెక్టులో మార్పులూ చేర్పులూ జరిగాయి కనుక అంచనా వ్యయం సైతం పెరిగింది. మెట్రో హైదరాబాద్‌ ప్రజలకు గొప్ప వరం. అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రోరైలు వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రినీ, ఎన్‌విఎస్‌ రెడ్డినీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థ బాధ్యులనూ అభినందించాలి.

శిఖరాగ్ర సదస్సు
ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు 170 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ నాయకత్వంలో 350 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఆమె ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణ. వ్యాపారరంగంలో విజయాలు సాధించడమే కాకుండా తండ్రికి సలహాదారుగా కొండంత అండ. ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ సదస్సులో పెద్దపీట వేస్తున్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే ఆమె కుటుంబం అంతా బాగుపడుతుందనే ఆదర్శం ఈ సదస్సుకు ప్రాతిపదిక. మహిళలు ఏ పనైనా సమర్థంగా చేయగలరనే విశ్వాసం పాదుకొల్పే ప్రయత్నం ఇది. అమెరికా నుంచి ఇవాంకాతో వచ్చే పారిశ్రామికవేత్తలలో అత్యధికులు ఇండియన్‌ అమెరికన్స్‌ ఉంటారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి గణనీయమైన సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రానున్నారు.

సమాచార సాంకేతిక (ఐటీ) విప్లవంలో తెలుగు యువతీయువకులూ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి ప్రపంచ స్థాయి పరిగణన పొందారు. ఐటీ రంగం తెలుగు యువతకు కొత్త ఊపునిచ్చింది. ఇది కూడా కొనసాగింపు ఫలితంగా అభివృద్ధి చెందిందే. ఐటీ రంగం 1991లో ఆర్థిక సంస్కరణల ఫలి తంగా విస్తరించిందనే అభిప్రాయం బలంగా ఉంది. హైదరాబాద్‌ను తనే నిర్మిం చినట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచుగా చెప్పుకుం టారు. వాస్తవానికి ఐటీ రంగానికి బీజం వేసింది 1971 ఫిబ్రవరిలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ. రక్షణ నుంచి ఆరోగ్యం వరకూ పదహారు మంత్రిత్వ శాఖలను అనుసంధానం చేస్తూ ఎలక్ట్రానిక్స్‌ కమిషన్‌ను నెలకొల్పి, దానికి అధ్యక్షుడుగా ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త ఎంజీకే మీనన్‌ను నియమించిన దార్శనికత ఆమెది. అప్పటి వరకూ మీనన్‌ టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీరా) సంచాలకుడుగా ఉండేవారు. మూడు వందల మంది కంప్యూటర్‌ శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ, సాంకేతిక సిబ్బందినీ తయారు చేసేందుకు రూ. 10 కోట్లు కేటాయించారు. అనంతరం టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (టీడీసీ) స్థాపించారు.

కంప్యూటర్‌రంగంలో శిఖర సమానుడైన ఆర్‌. నరసింహం నేతృత్వంలో ఇసీఐఎల్‌ (ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) తయారు చేసిన రెండో తరం కంప్యూటర్లకు టీడీపీ బ్రాండ్‌ వేసేవారు. వీటిని నిర్వహించేందుకు పీపీ గుప్తా ఆధ్వర్యంలో కంప్యూటర్‌ మెయిన్‌టెనెన్స్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)ని నెలకొల్పారు. ఏఎస్‌ రావు నేతృత్వంలో ఇసిఐఎల్‌ ఘనవిజయాలు సాధించింది. ఆయన పేరుతోనే ఏఎస్‌ రావు నగర్‌ ఏర్పడింది. ఆ రోజుల్లో విదేశీమారక ద్రవ్యం కొరత ఉండేది. ఐబీఎం కంప్యూటర్లకు తగిన రియాద్‌ శ్రేణి కంప్యూటర్లను రూపాయలు చెల్లించి సోవియట్‌ యూనియన్‌ నుంచి కొనుగోలు చేసేవారు. వీడీయూ (విజు వల్‌ డిస్‌ప్లే యూనిట్‌), హైస్పీడ్‌ లైన్‌ప్రింటర్‌ వంటి సాధనాలు రియాద్‌ కంప్యూటర్లలో నాసిరకమైనవి ఉండేవి. అందుకని పాశ్చాత్య యూరప్‌ నుంచి నాణ్యమైన విభాగాలను కొనుగోలు చేసి ఈ కంప్యూటర్లకు అమర్చేవారు. ఆ విధంగా అమర్చినవాటిని ‘ఇంటెగ్రా’ కంప్యూటర్లు అని పిలిచేవారు.

ఇసీఐఎల్‌ ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మిషన్‌ (ఈవీఎం) తయారు చేసింది. వీటినే ప్రయోగాత్మకంగా 1983 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఉపయోగించారు. ఎన్‌టీ రామారావు ప్రభంజనం ఎదుర్కొని కాంగ్రెస్‌ అభ్యర్థి శంకరరావు గెలుపొందారు. ప్రపంచంలోకెల్లా నాలుగో పెద్ద వ్యవస్థ భారతీయ రైల్వే. రైలు ప్రయాణికుల రిజర్వేషన్లకోసం ఒక వ్యవస్థను ఇసీఐఎల్, బీఇఎల్‌ (భారత్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌) కలసి రూపొందించాయి. సరుకు రవాణా కోసం సూపర్‌ కంప్యూటర్‌ను తయారు చేశాయి. సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఐఎస్‌)ను 1984లో ఒక స్థాయికి తీసుకొని వచ్చాయి. ఎన్‌ శేషగిరి ఆధ్వర్యంలో ఏర్పడిన నేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ప్రపంచస్థాయి సంస్థ. అప్పటికే దేశంలో చిన్న, మధ్యతరగతి, పెద్ద కంప్యూటర్‌ కంపెనీలు వెయ్యికి పైగా ఉండేవి. అప్పటి దాకా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ రంగాన్ని పెంచిపోషించిన వ్యక్తి ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె హత్యానంతరం రాజీవ్‌గాంధీ ఈ పని కొనసాగించారు. 1994 నవంబర్‌ 19న నాటి ప్రధాని పీవీ నరసింహారావు రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ను జాతికి అంకితం చేశారు. దేశం నుంచి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు సైతం ఇందిరాగాంధీ హయాంలోనే మొదలైనాయి. ఇన్‌ఫోసిస్, విప్రో, సత్యం, టీసీఎస్‌ వంటి సంస్థలు నెలకొల్పడానికి దశాబ్దం ముందే కెల్ట్రాన్‌ (కేరళ ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌), అప్ట్రాన్‌ (ఉత్తరప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌) వెలిశాయి. ఈ రంగంలో స్వావలంబన సాధించాలన్నది ఎలక్ట్రానిక్స్‌ కమిషన్‌ను నెలకొల్పినప్పుడే చెప్పుకున్న సంకల్పం. రైల్వేల తర్వాత కంప్యూటర్‌ వ్యవస్థను విద్యుచ్ఛక్తి రంగానికి అనుసంధానం చేశారు.

ఆర్థిక సంస్కరణలతో కంప్యూటర్‌ రంగంలో నారాయణమూర్తి వంటి ఔత్సాహికులు అనేకమంది ఘనవిజయాలు సాధించేందుకు అవసరమైన పునాది అంతకు ముందే పడింది. హైదరాబాద్‌లో ఐటీ విస్తరణలో చంద్రబాబునాయుడు పాత్ర ఉంది. సైబరాబాద్‌ విస్తరణలో, ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ నిర్మాణంలో వైఎస్‌ కృషి ఉంది. ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా, మునిసిపల్‌ వ్యవహారాల మంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు హైదరాబాద్‌ను ఐటీ నెలవుగా అభివృద్ధి చేసేందుకు గణనీయమైన కృషి చేస్తున్నారు. ప్రభుత్వాధికారి జయేష్‌ రంజన్‌ శక్తివంచన లేకుండా పాటుపడుతున్నారు. ఎనిమిది రాష్ట్రాలు పోటీ పడితే ఇంత పెద్ద సదస్సు నిర్వహించే అవకాశం తెలంగాణకు దక్కడం వెనుక అవిశ్రాంత శ్రమ ఉంది. ఇవాంకా, ఇతర అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినప్పుడు నగరాన్ని అందంగా అలంకరించడం ఆహ్వానించదగినదే. కానీ నగర డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా పునర్నిర్మించి వానలు కురిసినప్పుడు రోడ్టు ముని గిపోకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించగలిగితే అది గొప్ప విజయం అవుతుంది. ఇదంతా కొనసాగింపే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే వెలుగు వచ్చిందనీ, అంతకు ముందు అంతా అంధకారమనీ చెప్పే రాజకీయ నాయకులు దాపురించారు కనుక ఇదంతా చెప్పవలసింది వచ్చింది.

తెలుగు వెలుగు
ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న ఆలోచన ముమ్మాటికీ కేసీఆర్‌దే. తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ డిసెంబర్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రముఖులను హైదరాబాద్‌కి పిలిపించుకొని వేడుక జరుపుకోవాలన్నది ఆయన పట్టుదల. అంతకు ముందు తెలుగుభాషను ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ ఒక సబ్జెక్టుగా అన్ని రకాల పాఠశాలలూ, కళాశాలలూ బోధించాలంటూ ఆదేశిం చారు. తెలుగు బోధనాభాష కావాలని కోరుకునేవారి ఆకాంక్ష నెరవేరకపోయినప్పటికీ తెలుగు అంతరించిపోతుందని బాధపడేవారికి ఊరట కలుగుతుంది. కేసీఆర్‌ తెలుగును అభిమానించే వ్యక్తి. తెలుగులో అనర్గళంగా ఉపన్యసించే వక్త. కనుక ఆయన తెలుగు మహాసభలు నిర్వహించడంలో ఆశ్చర్యం లేదు. లోగడ సురవరం ప్రతాపరెడ్డి చేసిన కృషికి ఇది కొనసాగింపు. తెలంగాణలో కవులే లేరంటూ కోస్తాంధ్ర కవిపండితులు వ్యాఖ్యానిస్తే కినిసి తెలంగాణ అంతటా పర్యటించి 354 మంది రచనలు, వివరాలు సేకరించి ‘గోలకొండ కవులు’ అనే ప్రామాణిక గ్రంథం ప్రచురించి సురవరం చరితార్థులైనారు. పాల్కురుకి సోమనాథుడు. బమ్మెర పోతన, సూరన, మారన, వేములవాడ భీమకవి నుంచి దాశరథి, కాళోజీ, గద్దర్, గోరటి ఎంకన్న, అందెశ్రీ వంటి వర్తమాన వాగ్గేయకారుల వరకూ తెలంగాణ సాహిత్యక్షేత్రంలో నడయాడిన కవుల ప్రశస్తిపై కొత్త వెలుగు ప్రసరింపజేయడమే ప్రపంచ తెలుగు మహాసభల లక్ష్యం కనుక అవశ్యం అభినందనీయం.


- కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement