
సాక్షి, అమరావతి : అవకాశం దొరికినప్పుడల్లా హైటెక్ సిటీ నుంచి... అన్నీ నేనే కట్టించాననే చెప్పుకునే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మెట్రో రైలు ఘనత కూడా తనదేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు కోసం తన హయంలో పోరాటం చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ‘మెట్రోను బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకే పరిమితం చేస్తే... నేను పోరాడి హైదరాబాద్‌ను ఆ జాబితాలో చేర్పించా. దానివల్లే మెట్రో రైలు హైదరాబాద్ రాగలిగింది.
కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు మెట్రోను వేగంగా పూర్తి చేశాయి. నా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెట్రోను ఆలస్యం చేశారు. అందుకే ఇంతకాలం పట్టింది. అప్పట్లోనే నేను ఉన్నప్పుడే ఢిల్లీ మెట్రో శ్రీధరన్‌తో హైదరాబాద్ మెట్రోపై అధ్యయనం చేయించాం. హైదరాబాద్ అభివృద్ధిలో మా ముద్ర పోయేది కాదు. మెట్రోతో పాటు జీఈఎస్ జరుగుతున్న హెచ్‌ఐసీసీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు... ఇవన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. నేను ప్రారంభించినా...ప్రారంభించకున్నా...హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్న సంతృప్తి నాకుంది. విద్యార్థుల ఆత్మహత్యలపై గట్టిగా ఉన్నాం. కళాశాలలు తప్పు చేస్తే సహించేది లేదు. ఈ విషయం చెప్పడానికే సభలోకి వెళ్లి మాట్లాడా.’ అని అన్నారు.