
సాక్షి, అమరావతి : అమెరికా అధ్యక్ష తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను ఆంధ్రప్రదేశ్(ఏపీ)కు రప్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ (జీఈఎస్)కు హాజరవుతున్న ఇవాంకాను ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేలా చేసేందుకు ప్రభుత్వం యత్నించినట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.
ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ డెవలప్‌మెంట్ బోర్డు(ఈడీబీ) ముఖ్య కార్యదర్శి జే కృష్ణ కిషోర్ అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇవాంకా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తే అమరావతి లేదా విశాఖపట్నంలో ప్రత్యేక ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తామని అమెరికా కాన్సులేట్‌కు చెప్పారు. అయితే, ఇందుకు అమెరికా ప్రభుత్వం ససేమీరా అంది. జీఈఎస్ మినహా ఇవాంకా మరెక్కడా పర్యటించబోరని తేల్చి చెప్పింది.
దీంతో 'బ్రాండ్' బిల్డింగ్ చేసుకోవాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భంగపాటు ఎదురైంది. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఏపీలో పర్యటిస్తే అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కాగా, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ సమ్మిట్ - 2017 మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.