సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణపై కాంగ్రెస్ సర్కార్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఐదు సెక్టార్లలో మెట్రో అభివృద్ధికి ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో మెట్రో రైలు పొడిగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై త్వరగా డీపీఆర్, ట్రాఫిక్ స్టడీస్ పూర్తి చేయాలని ఆదేశించారు. మియాపూర్ నుంచి పటాన్ చెరు(14 కి.మీ), రాయదుర్గం స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (12 కి. మీ), ఎంజీబీఎస్ నుంచి ఎయిర్‌పోర్టు (23 కి.మీ), ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్( 8 కి.మీ) మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని స్పష్టం చేశారు.
చదవండి: HYD Traffic Jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న హైదరాబాద్ నగరం
పాతబస్తీలోని దారుషిఫా జంక్షన్ నుంచి శాలిబండ వరకు, దారుషిఫా నుంచి ఫలక్‌నుమ వరకు 100 ఫీట్ల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు వైండింగ్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, అభ్యంతరాలు తీసుకోవాలని తెలిపారు. ఈ మార్గంలో 103 మతపరమైన ప్రార్థనా మందిరాలు, హెరిటేజ్ భవనాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
మెట్రో ఫేజ్-IIIలో భాగంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్‌పేట వరకు విస్తరించాలని సీఎం తెలిపారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్ట్ ప్రాంతం నుంచికందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాలన్నారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తారామతిపేట నుంచి నాగోల్, ఎంజీబీఎస్(40 కి.మీ) మీదుగా నార్సింగి వరకు మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో మెట్రో రైలు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రణాళికలను సమగ్ర పద్ధతిలో త్వరగా సిద్ధం చేసి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాసేందుకు రూపొందించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment