దేశంలోని అన్ని ప్రాంతాల వార్తల ప్రసారంలో నేషనల్ మీడియా పారదర్శకంగా వ్యవహరించాలని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు.
తిరుపతి: దేశంలోని అన్ని ప్రాంతాల వార్తల ప్రసారంలో నేషనల్ మీడియా పారదర్శకంగా వ్యవహరించాలని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. ఇండియన్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ శాఖ తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన వర్కింగ్ కమిటీ మీట్‌కు రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లోని సంఘటనలు, పరిస్థితులపై నేషనల్ మీడియా సరైన స్థాయిలో ఫోకస్ చేయలేకపోతోందని అన్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్ కేసులోనూ, తెలంగాణలో మొన్నటి ఓటుకు కోట్లు కేసులోనూ సరిగా స్పందించకపోవడం బాధాకరమన్నారు.
అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపం కుంభకోణం అంశంలో నేషనల్ మీడియా బాగా శ్రద్ధ కనబరుస్తోందన్నారు. దీన్నిబట్టి నేషనల్ మీడియా ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తున్నంత ప్రాధాన్యతను దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తేటతెల్లమవుతోందని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా విధి నిర్వహించినపుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఆ దిశగా కృషి చేయాలని యువ జర్నలిస్టులకు సూచించారు.
అనంతరం యూనియన్ జాతీయ అధ్యక్షుడు బాలభాస్కర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున జర్నలిస్టులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పెన్షన్లు తెలుగు రాష్ట్రాల్లోనూ కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు చెందిన యూనియన్ సభ్యులను సమావేశపరిచి చర్చించడ మే ఈ సమావేశం ముఖ్య ఉద్ధేశమన్నారు.
సాక్షి ఈడీకి ఘన సన్మానం
సమావేశం చివరలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తిని యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ శర్మ, అజయ్‌రావత్, సుభాష్‌గౌడ్, స్థానిక జర్నలిస్టు నాయకుడు రమణమూర్తితో పాటు తమిళ, తెలుగు మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.