మళ్ళీ అవే ఫేక్ సర్వేలు.. పాత జిత్తులతో వచ్చాడు...
జాతీయ మీడియాలో మేనేజ్ చేసిన సంస్థలతో చంద్రబాబు ఫేక్ సర్వేలు
జెండా సభకు జనం ముఖం చాటేయడం, కేసుల భయంతో బెంబేలు
మొన్న సీ–ఓటర్.. నేడు న్యూస్–18 పేరుతో నకిలీ సర్వేలు
మూడు పార్టీలూ పొత్తు పెట్టుకున్న మూడో రోజే ప్రజాభిప్రాయం మారుతుందా?
ఆదరాబాదరాగా విడుదలైన సర్వేలపై రాజకీయ విశ్లేషకుల విస్మయం
2019లోనూ అన్ని సర్వేలకు విరుద్ధంగా సీ–ఓటర్, న్యూస్–18 అంచనాలు
బాబు ఎన్ని నకిలీ వేషాలు వేసినా విజయం వైఎస్సార్‌సీపీదే
50 శాతానికిపైగా ఓట్లతో మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనం ఖాయం
తేల్చేసిన టౌమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మాట్రిజ్, చాణక్య, పొలిటికల్ క్రిటిక్ తదితర సర్వేలు
సాక్షి, అమరావతి: నక్క జిత్తులు, నకిలీ వేషాలకు ప్రతిరూపం తానేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! జనసేనతో జత కట్టి ఎన్ని మారీచ వేషాలు వేసినా గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని తాడేపల్లిగూడెం సభ సాక్షిగా గ్రహించిన చంద్రబాబు కనీసం అవినీతి కేసుల నుంచైనా బయటపడాలనే వ్యూహంతో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తు కుదుర్చుకున్నారు. జాతీయ పార్టీతో పొత్తు కుదిరిన వెంటనే వ్యవస్థలను జయప్రదంగా మేనేజ్ చేయడంలో తనకున్న అద్వితీయమైన ప్రతిభను జాతీయ మీడియాలో కొన్ని సంస్థల ముందు ప్రదర్శించారు.
టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయంటూ మొన్న సీ–ఓటర్ సంస్థ ఓ నకిలీ సర్వేను వెల్లడించగా న్యూస్–18 నిన్న మరో ఫేక్ సర్వేను వదిలింది. రానున్న రోజుల్లో మరిన్ని నకిలీ సర్వేలు ఇదే రీతిలో వెల్లడి కానున్నాయి. నకిలీ సర్వేల ద్వారా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పుంజుకున్నట్లు కృత్రిమ బలాన్ని చూపించి పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. అయితే వైఎస్సార్‌సీపీ 50 శాతానికిపైగా ఓట్లతో 24–25 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన కూటమి 0–1 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానుందని టౌమ్స్ నౌ, చాణక్య లాంటి ప్రముఖ సంస్థల సర్వేల్లో వెల్లడైంది.
డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని తేలింది. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరిన రెండు మూడు రోజుల్లోనే ఆ కూటమి గెలుస్తుందంటూ సీ–ఓటర్, న్యూస్–18 ఒపీనియన్ సర్వేలు ఆదరాబాదరాగా ప్రకటించడంపై రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. రెండు మూడు రోజుల్లోనే ప్రజాభిప్రాయం ఎలా తారుమారు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి అవి నకిలీ సర్వేలన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నారు.
2019లోనే అన్ని సర్వేలకు విరుద్ధంగా సీ–ఓటర్, న్యూస్–18 అంచనాలు ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. సర్వేల పేరుతో చంద్రబాబు ఎన్ని మాయ వేషాలు వేసినా సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి చరిత్రాత్మక విజయం సాధించడం ఖాయమని, వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని పేర్కొంటున్నారు.
సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు..
2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం చెప్పారు. గత 58 నెలల్లో 99 శాతం హామీలను నెరవేర్చి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.65 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశారు.
డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.44 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా కొనసాగించారు. ప్రభుత్వ ఆర్థిక చేయూతను వినియోగించుకున్న పేదలు పేదరికాన్ని అధిగమించడమే ఇందుకు నిదర్శనం. 2015–16లో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు తార్కాణం.
గ్రామ వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో గత 58 నెలల్లో 2.13 లక్షల నియామకాలు చేపట్టడం
గమనార్హం.
రోజురోజుకు పెరుగుతున్న వైఎస్సార్‌సీపీ గ్రాఫ్..
సంక్షేమ పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది నిరూపితమైంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు వైఎస్సార్‌సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని చాటి చెప్పాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ 50 శాతం ఓట్లతో 24–25 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధించడం తథ్యమని, టీడీపీ 0–1 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఉనికి చాటుకునే అవకాశం ఉందని, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌లు ఉనికి కూడా చాటుకోలేవని మూడు నెలల క్రితం టౌమ్స్‌నౌ సర్వే వెల్లడించింది. జీన్యూస్ మారిటైజ్, జీవనాధర్ ఇండియా, జన్‌మత్ పోల్స్, పీపుల్స్ పల్స్, చాణక్య లాంటి డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్సార్‌సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడైంది.
కేసుల భయంతో కాళ్ల బేరం..
ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్‌సీపీని, సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని గ్రహించిన చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో జత కలిశారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేశారు.
జెండా సభ అట్టర్ ప్లాప్ కావడంతో మళ్లీ ఘెర పరాజయం తప్పదని ఆందోళన చెందిన చంద్రబాబు స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి భూకుంభకోణం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పాల్పడిన ఐఎంజీ భారత్ కుంభకోణం వరకూ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీ పొత్తు కోసం పాకులాడారు. ఢిల్లీ వెళ్లి మూడు రోజులు పడిగాపులు కాసి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి పొత్తుకు ఒప్పించుకున్నారు.
బీజేపీతో జతకట్టినా డజను సర్వేలది ఒకే మాట
♦ బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ౖటౌమ్స్ నౌ–ఈటీజీ సంస్థ భారీ సర్వే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించింది. 49 శాతం ఓట్లతో 21–22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని, 45 శాతం ఓట్లతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 3–4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని తేల్చింది.
♦ 48 శాతం ఓట్లతో 19 లోక్‌సభ, 133 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 44 శాతం ఓట్లతో 6 లోక్‌సభ, 42 శాసనసభ స్థానాలకు పరిమితం అవుతుందని జీన్యూస్–మారిటైజ్ సర్వే వెల్లడించింది.
♦ 49.5 శాతం ఓట్లతో 121 శాసనసభ (ఐదు అటూఇటుగా) స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 43 శాతం ఓట్లతో 54 (ఐదు అటూఇటుగా) శాసనసభ స్థానాలతో సరి పెట్టుకుంటుందని పొలిటికల్ క్రిటిక్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
♦ రాష్ట్రంలో 49 శాతం ఓట్లతో 17 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుకుంటుందని, 44 శాతం ఓట్లతో 8 లోక్‌సభ స్థానాలకు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పరిమితం అవుతుందని చాణక్య సర్వే తేల్చింది. జనాధార్ ఇండియా, జన్‌మత్ పోల్స్, పీపుల్స్ పల్స్ తదితర డజనుకుపైగా ప్రతిష్టాత్మక సంస్థల సర్వేలదీ అదే మాట.
Comments
Please login to add a commentAdd a comment