ఏ ఊళ్లో ఏ నోట విన్నా ఈ మాటే
జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలదీ అదే మాట
రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులదీ ఆ మాటే
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ
బస్సు యాత్రలో జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతుండటమే తార్కాణం
జనసేన, బీజేపీతో జత కలిసిన టీడీపీకి మరోసారి ఘోర పరాభవం ఖాయం
సీఎం జగన్‌పై నమ్మకమే వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయానికి బాట
చంద్రబాబు మోసకారి కావడం వల్లే ఘోర ఓటమి బాటలో కూటమి
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్.. వేదికగా ఒకటే చర్చ.. ‘ఈసారీ వైఎస్సార్‌సీపీనే వస్తుంది.. జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేలన్నీ పక్కాగా లెక్కలేసి చెబుతున్నాయి. సైంటిఫిక్ పారామీటర్స్‌తో సర్వే చేసి మరీ నొక్కి వక్కాణిస్తున్నాయి. పత్రికలకు సంపాదకులుగా పని చేసిన వాళ్లు, సీనియర్ పాత్రికేయులు కూడా అదే చెబుతున్నారు. కచ్చితంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే జగన్ చేసిన మంచి పనులు అలాగున్నాయి కాబట్టి’ అంటూ ఊరూరా జనం చెబుతున్నారు.
‘మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయితేనే మా బతుకులు మారతాయని మా నమ్మకం. మేమంతా జగన్ బాటలోనే నడుస్తాం. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావడం తథ్యం. జగన్ అంటే విశ్వాసం.. చంద్రబాబు అంటే మోసం..’ అని నిన్న సిద్ధం సభల్లో.. ఇప్పుడు బస్సు యాత్రలో అశేష ప్రజానీకం తేల్చి చెబుతున్నారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్‌లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగించింది.
దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత భారీ విజయం సాధించిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చాక ప్రజా సంకల్ప పాదయాత్రలో.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొలి ఏడాదే 95 శాతం.. మొత్తమ్మీద 99 శాతం సీఎం జగన్ అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. లంచాలకు తావు లేకుండా.. వివక్షకు చోటు లేకుండా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో 87 శాతం కుటంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌డీబీటీ ద్వారా పేదలకు రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి కలిగింది.
దేశ చరిత్రలో ఈ స్థాయిలో పేదలకు మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దనే ప్రజలకు అందిస్తున్నారు. వైద్య, విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. వీటన్నింటి వల్ల సుపరిపాలనతో నవచరిత్ర లిఖించిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకూ పెరుగుతోంది.
58% మహిళల ఓట్లు జగన్‌కే
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాం. 50% కంటే ఎక్కువ ఓట్లతో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58% మంది మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఏ నాయకుడికీ మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేస్తూ సాధికారతకు జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండటానికి కారణం. - పార్థ దాస్ సెఫాలజిస్ట్, చాణక్య కన్సల్టెన్సీ
జగన్‌పై విశ్వసనీయతే విజయానికి సోపానం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాం. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఏ నాయకుడికీ మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతకు సీఎం జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండటానికి కారణం. - పద్మజా జోషి, సీనియర్ న్యూస్ ఎడిటర్, టైమ్స్‌నౌ
అప్రతిహతంగా బస్సు యాత్ర
వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం కడలిలా తరలివచ్చారు. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.
సీఎం జగన్‌ను చూసేందుకు యువతీ యువకులతో కలిసి చంటి బిడ్డలను చంకనేసుకుని మహిళలు పోటీపడుతూ బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. మండుటెండైనా.. అర్ధ రాత్రయినా సీఎం వైఎస్ జగన్‌ను దగ్గరి నుంచి చూసేందుకు.. కరచాలనం చేసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. మేలు చేశాం.. ఓటేయండి అనేది మామూలుగా నేతల మాట. కానీ.. బస్సు యాత్రలో తద్భిన్నంగా ‘మీ పాలన వల్ల మాకు మంచి జరిగింది.. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అంటూ ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు భరోసా ఇస్తున్నారు.
రాజకీయాలలో ఇలాంటి అరుదైన ఘట్టాలను తానెన్నడూ చూడలేదని సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ జత కలిశాక, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు జనం ముఖం చాటేస్తుండటం.. నాడు సిద్ధం సభలు.. నేడు బస్సు యాత్రకు వస్తున్న స్పందనను చూస్తుంటే.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
మరో చారిత్రక విజయం ఖాయం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు, చాణక్య, బీపీఎస్, జన్‌మత్ పోల్స్, లోక్ పోల్స్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, మ్యాట్రిజ్ వంటి పొలిటికల్ కన్సల్టెన్సీలు అటు దేశ వ్యాప్తంగా.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయి. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మ్యాట్రిజ్, డెక్కన్ 24/7 వంటి జాతీయ మీడియా సంస్థలు.. చాణక్య, మ్యాట్రిజ్ నుంచి జన్‌మత్ పోల్స్ వరకూ పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన డజనుకు పైగా సర్వేల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడించాయి.
దాంతో జనసేన–బీజేపీతో చంద్రబాబు జట్టుకట్టారు. మూడు పార్టీల జెండాలు జత కలిసినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు కూటమి నిలబడలేదన్నది సర్వేల్లో వెల్లడైంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతూ వస్తోందని సర్వేలు వెల్లడించాయి. సుమారు 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు నిర్వహించిన సర్వేలు తేల్చి చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment