![Sajjala Ramakrishna Reddy comments on ys jagan incident - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/15/sajjala.jpg.webp?itok=pChi8mi5)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అంతమొందించడమే ఆగంతకుల లక్ష్యం
అదృష్టం బాగుండి సీఎం జగన్ బయటపడ్డారు
క్యాటర్ బాల్ కంటే శక్తివంతమైన ఆయుధాన్ని వాడి ఉండొచ్చు
గురి తప్పకుండా కాల్చగల షార్ప్ షూటర్లే ఇలాంటివి చేస్తారు
శక్తివంతమైనవారి మద్దతు లేకుండా వీరు ఆ పనిచేసి ఉండరు
అనుకున్నది జరగలేదు కాబట్టే టీడీపీ తప్పించుకుంటోంది
ఇంతటి దుర్ఘటనను కూడా డ్రామాగా కొట్టేపారేయడం దారుణం
ఎవరైనా తన సునిశిత శరీర భాగంలో దాడి చేయించుకుంటారా?
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అంతమొందించడమే లక్ష్యంగా పక్కా పథకం ప్రకారం హత్యాయత్నం చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో క్యాటర్ బాల్ కంటే శక్తివంతమైన ఆయుధాన్ని వాడి ఉండొచ్చన్నారు. గురి తప్పకుండా కాల్చగల షార్ప్ షూటర్లే ఇలాంటి పనులు చేస్తారని చెప్పారు. ఎవరో శక్తివంతమైన వ్యక్తుల మద్దతు లేకుండా ఆగంతకులు ఈ పనిచేయరన్నారు.
ఈ దారుణ ఘటనలో అదృష్టం బాగుండి సీఎం జగన్ బయటపడ్డారని తెలిపారు. తాము అనుకున్నది జరగలేదు కాబట్టే టీడీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంతటి దుర్ఘటనను కూడా ఆ పార్టీ డ్రామాగా కొట్టిపారేయడం దారుణమన్నారు. ఎవరైనా తమ సునిశిత శరీర భాగంలో దాడి చేయించుకుంటారా అని నిలదీశారు. చంద్రబాబును చేయించుకోమనండి చూద్దామన్నారు.
ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌పై దాడి చేయాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ చంద్రబాబు చేసిన పలు ప్రసంగాల వీడియో క్లిప్పులను మీడియాకు ప్రదర్శించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే..
సీఎం జగన్‌పై దాడిని దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఇక్కడ చంద్రబాబు ఖండించినా.. ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ నేతలు డ్రామా అంటూ హేళన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వీళ్లు మనుషులేనా అని అనిపిస్తోంది.. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం ప్రభంజనంలా తరలివస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.
రెండు రోజుల క్రితం కూడా ‘రాళ్లతో కొట్టి, ఫ్యాన్ గుర్తు లేకుండా చేయండి.. జగన్‌ను మసి చేయండి.. టీడీపీ మీతో ఉంటుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి సీఎం జగన్‌పై ఆయన హత్యాయత్నానికి పురిగొలిపినట్టనిపిస్తోంది. ఇవన్నీ ఎన్నికల సంఘానికి నివేదించి.. దాడులకు పురిగొలిపేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని తక్షణం అడ్డుకోవాలని కోరాం. గతంలో చంద్రబాబు అలిపిరి ఘటనను తానే చేసుకుని, సానుభూతి పొంది ఎన్నికలకు వెళ్లాలని చూశారా?.. నాడు చంద్రబాబు విషయంలో ఇలాంటి చిల్లర మాటలు ఎవరూ మాట్లాడలేదు.
ఇప్పుడు సీఎం జగన్‌ను అనడానికి నోరెలా వస్తుంది? గతకొద్ది రోజులుగా చంద్రబాబు నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్‌పై విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. దీనివల్లే విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం జగన్‌పై ‘ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్’ జరిగింది. ఇది రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. అంతా షాక్‌కు గురయ్యారు. ఆగంతకుడు విసిరిన పదునైన వస్తువు తగిలి సీఎం జగన్‌కు ఎడమ కనుబొమ పైభాగాన తీవ్ర గాయమైంది. అదే కొంచెం కింద తగిలి ఉంటే కంటి చూపే పోయేది. కణతకు తగిలితే ప్రాణానికే ప్రమాదం జరిగేది. అదృష్టం బాగుండి సీఎం జగన్ బయటపడ్డారు.
బురదజల్లడమే టీడీపీ, జనసేన పని..
ప్రభుత్వంపై టీడీపీ, జనసేన బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయి. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే దానికి కూడా వక్రభాష్యం చెబుతున్నాయి. ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజువారీ కార్యకలాపాల నుంచి ప్రభుత్వం దూరం జరిగింది. చంద్రబాబులా మేమెప్పుడూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించి, దబాయించ లేదు. ఇలాంటప్పుడు ఎవరినీ ప్రభావితం చేసి, ప్రలోభపెట్టే అవకాశమే లేదు. రాత్రి 8 గంటల సమయంలో సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగితే.. గంటన్నర తర్వాత ఫొటోలు బయటకు ఇచ్చాం. ఇది ఆకతాయిల పనికాదని గాయం తీవ్రత చూశాకే తెలిసింది.
షార్ప్ షూటర్లతోనే ఇలాంటివి సాధ్యం..
సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి పదునైన వస్తువును చేతితో విసరడం, క్యాటర్ బాల్ వాడటం కంటే మరేదో శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించి ఉండొచ్చు. సీఎంను అంతమొందించే కుట్రతోనే కణతను లక్ష్యంగా చేసుకుని పదునైన వస్తువుతో హత్యాయత్నం చేశారు. గురి తప్పకుండా కొట్టగలిగే షార్ప్ షూటర్లు మాత్రమే ఇలాంటివి చేయగలరు. దీనికి శక్తివంతమైనవారి మద్దతు ఇవ్వకుండా ఇదంతా సాధ్యపడదు.
సింగ్‌నగర్ ప్రాంతంలో సీఎం జగన్ యాత్ర వెళ్తుందని తెలుసుకుని.. పక్కా ప్రణాళిక ప్రకారం ఓ ప్రైవేటు పాఠశాల వెనుక నక్కిన ఆగంతకులు సీఎం కణతపై గురిపెట్టి పదునైన వస్తువుతో హత్యాయత్నం చేశారు. సీఎం జగన్ టక్కున తల తిప్పడంతో ప్రాణాపాయం తప్పింది.
పదునైన వస్తువు చాలా వేగంగా రావడంతోనే సీఎం ఎడమ కనుబొమ పైభాగాన బలంగా తగిలి.. పక్కనే ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికీ తీవ్ర గాయమైంది. వెలంపల్లి కంటి కార్నియాకు బలంగా తాకడంతో 48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఒక వస్తువు ఇద్దరు వ్యక్తులను బలంగా గాయపరిచిందంటే.. ఎంతటి శక్తివంతమైన ఆయు«దాన్ని ఉపయోగించారో తెలుస్తోంది. ఇవన్నీ దర్యాప్తులో బయటపడతాయి.
నిందితులను పట్టుకోవాలని ప్రతిపక్ష నేతలెవరూ కోరలేదు
సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని ప్రతిపక్ష నాయకులు ఎవరూ కోరట్లేదు. చంద్రబాబు సైతం సీఎం త్వరగా కోలుకోవాలని కాకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. సీఎం తన రోడ్‌షోలో కరెంటు తీయించుకుని ఆయనే చేతులారా ఈ ఘటనకు కారణమయ్యారని టీడీపీ నేతలు అనడం దారుణం. రోడ్‌షోల్లో చంద్రబాబు బస్సు ఎక్కినా కరెంట్ తీస్తారు.. లేదంటే ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.
సీఎం జగన్‌పై హత్యాయత్నాన్ని భద్రతా వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆ విషయాన్ని పోలీసు శాఖ, ప్రభుత్వం చూసుకుంటుంది. చంద్రబాబుపై అలిపిరి ఘటన సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సంఘీభావంగా వెళ్లి మౌన దీక్ష చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా విభేదించాలి తప్ప ఇలాంటి ఘటనలను ప్రోత్సహించకూడదు.
కానీ, టీడీపీ వ్యవహారశైలి పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి దుశ్చర్యలను సీఎం జగన్ ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటారు. సోమవారం నుంచి యధావిధిగా బస్సుయాత్ర ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి అఖండ విజయం సాధిస్తుంది.
ఎన్నికల సంఘానికి, డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దాడి ఘటనలో టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం సచివాలయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ సోషల్ మీడియా, ఐటీడీపీ.. వివేకం సినిమా సీన్లను పోస్టు చేసి దుష్ప్రచారం చేస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనకు సంబంధించి దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ కోరింది. ఈ మేరకు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో డీజీపీని వైఎస్సార్‌సీపీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం, గొడ్డలితో పోస్టులు పెట్టడం, టీడీపీ పాటలు సహా పలు అంశాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
అలాగే రాష్ట్ర ప్రజలకు టీడీపీ చేస్తున్న ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు, బల్క్ మెసేజ్‌ల గురించి డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సీఎం, వైఎస్సార్‌సీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కట్టడి చేయాలని కోరామని తెలిపారు. సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక టీడీపీ గూండాల హస్తం ఉందని ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు.
రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా చంద్రబాబు పదేపదే చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు హత్యాయత్నానికి మూలకారణమన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు నందిగం సురేష్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, రావెల కిశోర్‌బాబు, మనోహర్‌రెడ్డి ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment