సీఎం జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన 99% హామీలను అమలు చేశారు
తాజా మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ
సీఎంను చంపేయాలని చంద్రబాబు రంకెలేస్తున్నారు
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి
ఎగ్గొట్టేందుకే రోజుకో హామీ: వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ధ్వజం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమీ లేకపోతే చంద్రబాబుకు అంత భయమెందుకని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. సీఎం జగన్‌ను దూషించడమెందుకని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి మేనిఫెస్టోకు ప్రాముఖ్యత తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎంను ఉద్దేశించి నిన్ను చంపేస్తే ఏమవుతుందని బాబు తాజాగా ఒక బహిరంగసభలో రంకెలేశారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఆయన సభ్య సమాజంలో ఉండటానికి పనికిరాని వ్యక్తని ధ్వజమెత్తారు.
బాబుకు అంతర్జాతీయంగా కిల్లర్ లైసెన్స్ ఇచ్చారేమోనని విరుచుకుపడ్డారు. మొన్న రాళ్లతో కొట్టండని ఆయన అనగానే విజయవాడలో సీఎం జగన్‌పై హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. రోజురోజుకూ దిగజారిపోతున్న ఆయనకు ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇవ్వడం ఖాయమన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల ఆదివారం మీడియాతో మాట్లాడారు.
చిన్న మెదడు చితికిందా బాబూ?
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ అమలు చేయడంతో 2024 ఎన్నికల మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరిగింది. ఇచ్చిన మాటపై నిలబడకపోతే రాజకీయాల్లోనే ఉండకూడదన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతం. ప్రజల్లో విశ్వసనీయతను నిలబెట్టుకోవడానికే మేనిఫెస్టోను అత్యంత బాధ్యతాయుతంగా రూపొందించి, విడుదల చేశారు. బాబులా రోజూ ఆడిన అబద్ధమే మార్చి మార్చి చెబుతుంటే విశ్వసనీయత ఎలా వస్తుంది? వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని, అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం.
అలా కాకుండా తాయిలాలతో అరచేతిలో వైకుంఠం చూపించేది మేనిఫెస్టో కాదు. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోకి ఒక కొత్త అర్థం వచ్చింది. మేనిఫెస్టో అంటే ఇది అని ప్రజలు చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్‌ను.. పాత హామీలు ఏమయ్యాయంటూ 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బాబు ప్రశ్నించడం విడ్డూరం.
గత ఎన్నికల్లో సీఎం జగన్ 750 హామీలు ఇచ్చారని బాబు చెబుతుండటం చూస్తుంటే ఆయన చిన్న మెదడు చితికిపోయిందేమోనని అనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో 600కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లోనే మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్ నుంచి మాయం చేశారు. ఆ హామీల మాట దేవుడెరుగు.. ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ లేఖలు పంపిన వాటిలోనూ ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మద్యనిషేధానికి తూట్లు పొడిచిన బాబు ఇప్పుడు మద్యనిõÙధం గురించి మాట్లాడటం విడ్డూరం. మద్య నియంత్రణలో ప్రభుత్వం విజయం సాధించింది. సీపీఎస్ రద్దు చేయలేని పరిస్థితుల్లోనే ఉద్యోగుల సంక్షేమం కోసం జీపీఎస్ తెచ్చాం.
మేనిఫెస్టోను చెత్తలో వేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య
మేనిఫెస్టో అంటే ప్రజలకు, నాయకుడికి, పార్టీకి మధ్య బంధం లాంటిది. నేను ఇది చేస్తాను అంటే చేసి చూపిస్తారనేలా ఉండాలి. ఎన్నికలు రాగానే అరచేతిలో వైకుంఠం చూపించి.. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి..ఎన్నికలు అయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. 2019లో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలుపుకున్నాక ప్రజలకు కూడా మేనిఫెస్టో సీరియస్‌నెస్ ఏంటో తెలుస్తోంది. మేనిఫెస్టోకు అర్థం వచ్చింది. ఇదే భావనపైనే మా ధీమా, మా నమ్మకం.
అప్పుడు శ్రీలంకని.. ఇప్పుడు హామీలు ఇవ్వడం మోసం కాదా? సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కరోనాతో రెండేళ్లు ఆర్థిక కష్టాలతోపాటు అదనపు ఖర్చుల రూపంలో రూ.60 వేల కోట్ల భారం పడింది. అయినా సరే అన్ని సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేశారు. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా పథకాలను అమలు చేస్తేనే ఏడాదికి రూ.70 వేల కోట్లు వ్యయమవుతోంది. ఇప్పుడు బాబు ఇస్తున్న హామీల అమలుకు ఏడాదికి రూ.1.50 లక్షల కోట్లు అవసరం.
సీఎం బటన్ నొక్కుతూ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చుతున్నారని ఆరోపించిన బాబే ఇప్పుడు ఏటా అదనంగా రూ.80 వేల కోట్లు వ్యయమయ్యే హామీలు ఇవ్వడం మోసం కాదా? ఎలాగూ అమలు చేసేది లేదు కదా అనే రోజుకో వాగ్ధానాన్ని బాబు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఎన్నికల తేదీ నాటికి ఇంకెన్ని హామీలు ఇస్తారో.. వాటి అమలుకు ఏ రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయో కూడా తెలియడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment