రాజ్యాంగమే సర్వోన్నతం
త్రికాలమ్
అంబేడ్కర్‌ని దార్శనికుడని ఎందుకు అభివర్ణిస్తున్నాం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న రభసని ఆయన 1949లోనే ఊహించాడు. చట్ట సభలూ, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య అధికారాలు విభజించి మూడింటి మధ్యా సమతౌల్యం ఉండాలని నిర్దేశించాడు. చట్టసభలూ, ప్రభు త్వాలూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నదీ, లేనిదీ సమీక్షించే హక్కు న్యాయ వ్యవస్థకే ఇచ్చాడు. రాజ్యాంగ నిర్మాతల ప్రధాన లక్ష్యం సాధారణ పౌరుల హక్కు లను కాపాడడమే. నియోజవర్గం ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించే అవకాశం ప్రజాప్రతినిధులకు ఉండాలన్నదే ఆర్‌కె రోజా కేసులో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులోని ఆంతర్యం.
నిజానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు రోజా వ్యవహారంలో మొదటి నుంచీ పాలకపక్షం పట్టుదలగానే ఉంది. ఆమె అసెంబ్లీలో ప్రయోగిం చిన భాష, శరీరభాష అభ్యంతరకరంగా ఉన్నాయన్న కారణంగా సంవత్సరం పాటు సస్పెండు చేయాలని సభ తీర్మానించింది. సమావేశం (సెషన్) చివరి వరకూ సస్పెండు చేయవచ్చును కానీ ఏడాది పాటు సస్పెండు చేసే హక్కు శాసనసభకు లేదని తెలిసినా సంఖ్యాబలం ఉన్నది కనుక అడ్డంగా తీర్మానం చేశారు. రోజా మాటలూ, దృశ్యాల టేపులు మాత్రమే మీడియాకు విడుదల చేశారు కానీ ఆమెను రెచ్చగొట్టిన అధికార పక్ష సభ్యుల భాషనూ, శరీర భాషనూ పట్టిచ్చే టేపులను విడుదల చేయలేదు. కెమేరాలూ, టేపులూ అధికార పక్షం చేతుల్లోనే ఉన్నాయి మరి.
రోజా సస్పెన్షన్‌ను రద్దు చేసి సభ లోకి అనుమతించాలని హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వును లక్ష్యపెట్ట కుండా, ఆమెను సభలోకి అనుమతించరాదని స్పీకర్ నిర్ణయించుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుపైన అప్పీలు చేయాలని అధికార పార్టీ నిర్ణయిస్తే, హైకోర్టు ఉత్తర్వును ఖాతరు చేయనందుకు కంటెంప్ట్ పిటిషన్ వేయాలని ప్రతిపక్షం నిర్ణ యించింది. సభాపతిపైన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల గడువు విధిగా ఇవ్వాలన్న 71వ నిబంధనను తోసి రాజనడం కూడా ఏకపక్ష రాజకీయాలలో భాగమే. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపైన గెలిచిన ఎనిమిది మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహించి వారిని అనర్హత వేటు నుంచి కాపాడడానికి శాసనసభ నిబంధన లనూ, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.
మితిమీరిన మంత్రుల మాటలు
ఈ అక్రమాలను క్రమబద్ధీకరించేందుకు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు. బుద్ధప్రసాద్ కమిటీ నివేదికను సభా హక్కుల సంఘం పరిశీలించింది. సభలో ఎవరు అసభ్యంగా, అభ్యంతరక రంగా వ్యవహరించినా చర్య తీసుకునే అధికారం సభకూ, సభాపతికీ ఉంది. మరి ప్రతిపక్ష నాయకుడిని ‘ఖబడ్దార్... కోరలు తీస్తా’ అంటూ గర్జించిన ముఖ్య మంత్రిపైనా, ‘ఇడుపులపాయ బంకర్లలో అవినీతి డబ్బు దాచావ్’ అంటూ అర్థం లేని ఆరోపణ చేసిన సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడిపైనా, ‘నీకు కొవ్వెక్కింది, నువ్వు మగాడివైతే, రాయలసీమ పౌరుషం నీలో ఉంటే...’ అంటూ వెకిలిగా మాట్లాడిన అచ్చెన్నాయుడిపైనా, ‘మిస్టర్ జగన్మోహన్‌రెడ్డీ ఖబడ్దార్’ అంటూ తర్జని చూపిస్తూ బెదిరించిన దేవినేని ఉమపైనా, ఆర్థిక ఉగ్రవాదిగా ప్రతిపక్ష నాయకుడిని అభివర్ణించిన బోండా ఉమపైనా, అదే ధోరణిలో మాట్లాడిన కిమిడి కళా వెంకటరావు, త్రిమూర్తులుపైన కూడా సభా హక్కుల సంఘం విచారణ జరిపి ఉంటే ధర్మంగా, న్యాయంగా ఉండేది. చంద్రబాబు నాయుడూ, ఆయన సహచరులూ ప్రతిపక్ష నాయకుడిని సూటిపోటి మాటలతో రెచ్చగొట్టడానికి అనరాని మాటలు అంటున్నారు.
ఎట్టి పరిస్థితులలోనూ నిగ్రహం కోల్పోరాదనీ, ఆగ్రహం ప్రదర్శించరాదనీ ప్రతిపక్ష నాయకుడు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. తమ ఎత్తుగడ ఫలించకపోవడంతో ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉత్కంఠ భరితమైన ఈ క్రీడలో ఎవరు నిగ్రహం పాటిస్తే వారిదే విజయం. ముఖ్యమంత్రి, మంత్రులూ సభామర్యాదలను ఉల్లంఘించి ప్రతిపక్ష నాయకుడిని దుర్భాషలాడటాన్ని ఆమోదించి, ప్రతి పక్ష సభ్యులపైన మాత్రమే సస్పెన్షన్ వేటు వేయాలని బుద్ధప్రసాద్ కమిటీ నివే దించినా, సభా హక్కుల సంఘం తీర్మానించినా, అసెంబ్లీ నిర్ణయించినా అది పక్షపాత వైఖరే అవుతుంది. దానికి జనామోదం ఉండదు. మర్యాదను తుంగలో తొక్కిన అందరిపైనా చర్య తీసుకుంటే సభ స్థాయీ, సభాపతి గౌరవం పెరిగేవి. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సమయంలో కోడెల శివప్రసాద్ ఊహించి ఉండరు తాను చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నానని. ఆంధ్రప్రదేశ్ శాసనసభా పతిగా ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడానికి అధికార పార్టీ దుందుడుకు వైఖరి ప్రధానంగా కారణం. ఒక సంజీవరెడ్డిలాగానో, ఒక సోమ నాథ్ ఛటర్జీలాగానో నిష్పాక్షికంగా, నిర్భయంగా వ్యవహరించే తెగువ చూపక పోవడం. అధికార పార్టీకీ, ప్రతిపక్షానికీ నచ్చజెప్పి ఘర్షణాత్మకమైన వాతావర ణాన్ని నివారించడానికి తగిన వయస్సూ, అనుభవం ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేకపోతున్నారు.
అప్పటికీ, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, శాసనసభా వ్యవహారాల మంత్రి యన మల రామకృష్ణుడూ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు 1995 ఆగస్టు సంక్షోభంలో ఎన్‌టి రామారావును గద్దె దించడానికి ఒక పథకం ప్రకారం వ్యవహరించిన పద్ధతిని జ్ఞప్తికి తెస్తున్నది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవడంలో అప్పటి శాసనసభాపతిగా రామకృష్ణుడి సహకారం మరువలే నిది. అదే వ్యూహంతో ఇప్పుడు ముందుకు పోదామని ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులలో చాలా వ్యత్యాసం ఉన్నది. అప్పుడు అది అధికార పార్టీలో ఆధిక్యంకోసం జరిగిన పెనుగులాట. ప్రతిపక్షం ప్రమేయం లేదు, బలమైన ప్రతిపక్షం లేదు. దాదాపు అన్ని పత్రికలూ చంద్రబాబునాయుడి పక్షానే నిలిచాయి. ఆయన కోరిన విధంగా వార్తలు మలిచాయి.
ఇప్పుడు బల మైన ప్రతిపక్షం ఉంది. దానికి బలమైన యువనాయకుడు ఉన్నాడు. పత్రికలన్నీ ఒకే పక్షాన లేవు. టెలివిజన్ ఛానళ్ళు అనేకం వచ్చాయి. శాసనసభా కార్యకలా పాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. దాపరికానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎవరు గుడ్లురుముతూ రంకెలు వేస్తున్నారో, ఎవరు సహనం కోల్పోయి ప్రేలా పనలు చేస్తున్నారో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. రాజ్యాంగంలో సైతం అనేక సవరణలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం కంటే, చట్టసభల కంటే న్యాయవ్యవస్థదే పైచేయి అనడానికి అవసరమైన దన్ను రాజ్యాంగానికి లభిం చింది. ఈ పరిణామ క్రమం తెలుసుకుంటే చంద్రబాబునాయుడూ, యనమల రామకృష్ణుడూ దూకుడు తగ్గించుకొని ఆలోచించగలుగుతారు. న్యాయవ్యవస్థతో ఘర్షణకు శాసనసభాపతిని ప్రోత్సహించడమా లేక రాజ్యాంగ స్ఫూర్తినీ, సహజ న్యాయ పాలన ఆవశ్యకతనూ అర్థం చేసుకొని హుందాగా వ్యవహరించడమా తేల్చుకుంటారు.
ఈ పెనుగులాట ఇప్పటిది కాదు
చట్టసభలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య ఆధిక్యం కోసం పెనుగులాట ఎంతో కాలంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడు కేశవ్‌సింగ్‌కూ, శాసనసభకూ మధ్య రగిలిన ఘర్షణతో ఇది మొదలైంది. ఏడు రోజుల శిక్ష పడిన కేశవ్‌సింగ్ ఉత్తర ప్రదేశ్ హైకోర్టు లక్నో బెంచిని ఆశ్రయించాడు. లక్నోబెంచ్ అసెంబ్లీ నిర్ణ యం చెల్లనేరదని తీర్పు చెప్పింది. తీర్పు చెప్పిన ముగ్గురు న్యాయమూర్తులనూ, కేశవ్‌సింగ్ తరఫున వాదించిన న్యాయవాదిని శాసనసభ హక్కులను ఉల్లంఘిం చిన నేరానికి శిక్షించాలంటూ ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానించింది.
ఇది క్రమంగా రెండు వ్యవస్థల మధ్య ఘర్షణగా మారిన సందర్భం (1964)లో ఈ వ్యవహారంపైన అభిప్రాయం చెప్పవలసిందిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ గజేంద్రగడ్కర్ నాయకత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల పీఠం ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఉత్తర్వును కొట్టివేసింది. శాసనసభలో అక్రమాలు జరిగితే వాటిని పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉన్నదని స్పష్టం చేసింది. చట్టసభల నిర్ణయాలపైన విచారణ జరిపే అధికారం న్యాయసమీక్ష జరపవలసిన హైకోర్టులకూ, సుప్రీంకోర్టుకూ ఉన్నదని నిగ్గు తేల్చింది. ఆదేశిక సూత్రాలను అమలు చేసే క్రమంలో ప్రాథమిక హక్కులను హరించరాదంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 1967 నాటి గోలక్‌నాథ్ కేసు తీర్పులో స్పష్టం చేసింది.
ఈ పరిమితిని అధిగమించేందుకు 1972లో పార్లమెంటు 24వ రాజ్యాంగ సవ రణ చట్టం చేసింది. ఈ చట్టాన్ని పూర్వపక్షం చేసేందుకు సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పును వినియోగించుకున్నది. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉన్నదనీ, ఆ క్రమంలో రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ధ్వంసం చేసే హక్కు మాత్రం పార్లమెంటుకు లేదనీ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. 1975లో దేశంలో ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించిన ఇందిరా గాంధీ రెండేళ్ళపాటు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేశారు. మూడు వ్యవస్థల మధ్యా సమతౌల్యం దారుణంగా దెబ్బతిన్నది. పార్లమెంటూ, న్యాయవ్యవస్థ కంటే ప్రభుత్వమే శక్తిమంతమైన వ్యవస్థగా పెత్తనం కొనసాగించింది. అత్యా చారాలు చేసింది.
1977లో ఎన్నికలు జరిగిన అనంతరం జనతా ప్రభుత్వం చొరవతో 43వ, 44వ రాజ్యాంగ సవరణల ద్వారా సమతౌల్యాన్ని పునరుద్ధ రించారు. ఈ సవరణలతో ఆత్మవిశ్వాసం పెరిగిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులను నియమించే అధికారాన్ని ప్రభుత్వం నుంచి లాగివేసుకు న్నది. ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయమూర్తుల కొలీజియంను ఏర్పాటు చేసి దానికి సుప్రీంకోర్టుకూ, హైకోర్టులకూ న్యాయమూర్తులను నియమించే అధికారం అప్పగించింది. దీంతో న్యాయవ్యవస్థ పార్లమెంటుతో, ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా సంపూర్ణ స్వేచ్ఛను వ్యవస్థీకృతం చేసుకు న్నది. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం సాధించిన తర్వాత యూపీఏ-2 ప్రభుత్వం న్యాయమూర్తులను నియమించే అధికారాన్ని న్యాయ వ్యవస్థ నుంచి తీసివేసుకునే లక్ష్యంతో 99వ రాజ్యాంగ సవరణ బిల్లును రూపొం దించింది.
2014 సార్వత్రిక ఎన్నికలలో అద్భుత విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ-2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేషనల్ జుడీషియల్ అపాయెంట్‌మెంట్స్ యాక్ట్ (2014)ను చేసి యూపీఏ ప్రారంభించిన ప్రక్రియను పూర్తి చేసింది. ఈ చట్టం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. న్యాయ మూర్తులను నియమించే అధికారం ప్రభుత్వానికి దఖలు పరిచినట్లయితే న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం కోల్పోతుందనీ, సుప్రీం ధర్మాసనం ఆ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించిందనీ న్యాయకోవిదులు శ్లాఘించారు. ఇదీ తాజా పరిస్థితి.
రాజ్యాంగానికి లోబడకతప్పదు
చట్టపాలనలో ఇంతవరకూ సంభవించిన పరిణామాలను అర్థం చేసుకున్నవారు ఎవ్వరైనా న్యాయవ్యవస్థ అధికారాలను ప్రశ్నించరు. నిబంధనలను ఉల్లంఘిం చినా, చట్టాలను అతిక్రమించినా చట్టసభలను ప్రశ్నించే అధికారం, చట్టసభల నిర్ణయాలను తిరగదోడే అధికారం న్యాయవ్యవస్థకు ఉన్నది. బ్రిటన్‌లో అన్ని వ్యవస్థల కంటే పార్లమెంటు మిన్న. అక్కడ లిఖిత రాజ్యాంగం లేదు. మనది పకడ్బందీగా రాసుకున్న సంవిధానం. చట్టసభలూ, ప్రభుత్వాలూ, న్యాయ వ్యవస్థా రాజ్యాంగానికి లోబడే పని చేయాలి. ఈ మూడు వ్యవస్థలూ పరస్పరం గౌరవించుకోవాలి. ఎప్పుడైనా స్పర్థ వచ్చినప్పుడు ఏది రాజ్యాంగబద్ధమో, ఏది కాదో చెప్పే అర్హత సుప్రీంకోర్టుకే ఉన్నదని రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించిన ఫలితంగా న్యాయవ్యవస్థకు ఇతర రెండు వ్యవస్థల కంటే పిసరంత అధికారం అధికం.
చట్టసభల సభ్యులలోనూ, ప్రభుత్వాధికారులలోనూ ప్రమాణాలు పడిపోతాయనీ, మందబలంతో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చట్టసభల సభ్యులు వ్యవహరించే రోజులు మున్ముందు రాగలవనీ అంబేడ్కర్, ఆయన సహచరులు అరవై ఆరేళ్ళ కిందటే ఊహించారు. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘిస్తారనీ, సంఖ్యాబలంతో ఏ అఘాయిత్యానికైనా ఒడిగ తారనీ, అందుకే చట్టసభల నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉండాలనీ నాడే స్పష్టం చేశారు. అందుకే వారు దార్శనికులు.
- కె.రామచంద్రమూర్తి