
'నేతల నిజస్వరూపాలను బయటపెట్టారు'
సుప్రసిద్ధ పాత్రికేయుడు, 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి రచించిన అన్ విలీంగ్ తెలంగాణ స్టేట్(UNVEILING TELANGANA STATE) పుస్తకాన్ని జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు.
హైదరాబాద్: రాజకీయ పార్టీలు, నాయకుల నిజస్వరూపాలను కె.రామచంద్రమూర్తి మనముందు సాక్షాత్కరింపజేశారని జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి రచించిన అన్ విలీంగ్ తెలంగాణ స్టేట్(UNVEILING TELANGANA STATE) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో తాను రాసిన వ్యాసాలను రామచంద్రమూర్తి ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఎమ్మెస్కో ఈ పుస్తకాన్ని ప్రచురించింది. జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ పుస్తకం వ్యాసాల సంకలం మాత్రమే కాదని, సమకాలిన రాజకీయ వ్యవస్థపై గొప్ప సమకాలిన వ్యాఖ్యాత వ్యాఖ్యానాలు ఇందులో ఉన్నాయని అన్నారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా వ్యవహరించారు. చుక్కా రామయ్య, ఎం.కోదండరామ్, ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, కె.నాగేశ్వర్, కె.శ్రీనివాస్, కట్టా శేఖర్ రెడ్డి, ఎ.కృష్ణారావు, ఎమ్మెస్కో ప్రతినిధులు ఎస్.డి.సుబ్బారెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.