
వ్యంగ్య ప్రహారం ‘చో’
హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ మేళవించి రాజకీయ నేతలపై అక్షరాస్త్రాలు సంధించిన జర్నలిస్టు ప్రముఖులలో ‘తుగ్లక్’ వారపత్రిక సంపాద కుడు చోరామస్వామి అగ్రగణ్యుడు. బుధవారం తెల్లవారుజామున కన్నుమూసిన చో బడుగువర్గాలకు అండగా నిలిచి అక్రమార్కుల గుండెల్లో నిద్రించిన అక్షరయోధుడు.
కొంతకాలం కింద చెన్నైలో జరిగిన ఒక సభలో ప్రధాని నరేంద్రమోదీని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ, ‘నేను ఇప్పుడు మృత్యుబేహారి (మర్చంట్ ఆఫ్ డెత్)ని మాట్లాడవలసిం దిగా కోరుతున్నాను’ అని చో అన్నప్పుడు మోదీ సహా సభికులం దరూ ఫక్కున నవ్వారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఎన్నికల ప్రచారంలో మోదీనీ ‘మౌత్ కీ సౌదాగర్’ అనడం విన్నాం. గుజ రాత్ అల్లర్లలో ముస్లింలపై జరిగిన హత్యాకాండని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాంశం చేసింది. సోనియా ప్రచారాన్ని పరోక్షంగా తిప్పికొట్టడానికి చో వ్యంగ్యాన్ని వినియోగించారు. ‘ఉగ్రవాదం పట్ల మృత్యుబేహారినీ, అవినీతి పట్ల మృత్యుబేహారినీ, బంధుప్రీతి పట్ల మృత్యుబేహారినీ...’ అంటూ, ‘సకల అరిష్టాలపట్ల మృత్యు బేహారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను’ అన్నారు. ఆత్యయిక పరిస్థితిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చో ధీరో దాత్తంగా పోరాడారనీ, తాము కూడా ఆ పోరాటంలో పాలు పంచుకున్నామనీ, అప్పుడే చో పేరు విన్నాననీ ప్రధాని చెప్పారు. చో నూటికి నూరుపాళ్ళు ప్రజాతంత్రవాది అనీ, ఎవరైనా తప్పు చేస్తే నిర్భయంగా విమర్శించగలరనీ; నీతీ, నిజాయితీ కలిగిన జర్నలిస్టు అనీ అన్నారు. తాను ‘రాజగురు’ అని అంటూ తనకు పరిచయం చేసుకున్నారని మోదీ గుర్తు చేశారు. గుజరాత్ ముఖ్య మంత్రిగా రెండోసారి గెలిచిన తర్వాత మోదీని జయలలిత పోయెజ్‌గార్డెన్‌కు ఆహ్వానించడం వెనుక ఈ ‘రాజగురు’ ప్రేరణ ఉంది. చో మరణవార్త తెలిసిన వెంటనే మోదీ ఇచ్చిన ట్వీట్‌లో ‘చో బహుముఖ ప్రజ్ఞాశాలి. శిఖరసమానుడైన మేధావి. గొప్ప జాతీయ వాది. అందరూ గౌరవించి, అభిమానించే సాహసోపేతమైన వాణి,’ అంటూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
ఎంజీఆర్ మరణించిన తర్వాత శవపేటిక ఉన్న వాహనం నుంచి ఎంజీఆర్ భార్య జానకి వర్గంవారు కిందికి తోసివేయగా నేలమీద పడి అవమానభారంతో మెరీనాబీచ్‌కి వెళ్ళకుండా ఇంటికి తిరిగి వెళ్ళిన జయలలితను ఏఐఏడిఎంకె అధినేత (జనరల్ సెక్రటరీ)గా ప్రతిష్ఠించడంలో చో పాత్ర నిర్ణాయకమైనది. అంతకు ముందు సినిమారంగంలో సైతం జయలలితకు హితైషిగా ఉండే వారు. ఎంజీఆర్‌కు రాజకీయ వారసురాలు జయలలిత మాత్రమే నని విశ్వసించి ఆమెకు తోడూనీడగా నిలిచి, రాజకీయ వ్యూహాలు రచించి, మార్గనిర్దేశనం చేసిన వ్యక్తి చో. ఆ దక్షత కారణంగానే ఏఐఏడిఎంకె 29 సంవత్సరాలు నిలబడటమే కాకుండా నాలుగు విడతల అధికారంలోకి వచ్చింది. లేకపోతే కుక్కలు చింపిన విస్తరి అయ్యేది. వైద్యం చేయించుకుంటున్నవారిని ఆస్పత్రికి వెళ్ళి పరా మర్శించే ఆనవాయితీ జయలలితకు లేదు. కొన్ని మాసాల కిందట ఊపిరితిత్తుల వ్యాధి ప్రబలి ఆస్పత్రిలో చేరిన చోను పరామర్శిం చేందుకు జయ వెళ్ళారు. స్నేహభావాన్ని చాటుకునే పద్ధతి అది. మోదీ కూడా చెన్నై వచ్చినప్పుడు చోని ఆస్పత్రిలో పరామ ర్శించారు. జయ మరణించిన రెండు రోజులకే చో కూడా ఈ లోకం వీడి వెళ్ళిపోయారు. సాధారణంగా గురువును శిష్యులు అనుసరి స్తారు. చో విషయంలో శిష్యురాలు ముందు వెళ్ళిపోతే ఆమె వెంటే గురువు వెళ్ళాడు.
చో అసాధారణ రచయిత. మైసూరులో న్యాయవాదుల వంశంలో 1934 అక్టోబర్ 5న పుట్టిన శ్రీనివాస్ అయ్యర్ రామ స్వామి మద్రాసులో లా చదివి కొంతకాలం ప్రాక్టీసు చేశారు. టీటీకే సంస్థల గ్రూప్ న్యాయసలహాదారుగా పనిచేశారు. కానీ చదువు కునే రోజుల్లోనే రంగస్థలంపైన మోజు మొదలై అది వ్యామో హంగా ముదిరింది. నాటకాలు రాయడం, నటించడం, దర్శకత్వం వహించడంలో తలమునకలైనారు. అనంతరం సినిమా రంగంలో హాస్యపాత్రలలోనూ, తండ్రి పాత్రలలోనూ జీవించారు. సుమారు రెండు వందల సినిమాలలో నటించారు. నాలుగు సిని మాలకు దర్శకత్వం వహించారు. 14 సినిమాలకు మాటలు రాశారు. 23 నాటకాలు రాశారు. టీవీ సీరియళ్ళకు లెక్కలేదు. తన జీవిత చరిత్రను ‘ఎక్స్‌ప్రెషన్స్ గివెన్ బై ఫార్ట్యూన్’ (అదృష్టం అందించిన అనుభవాలు) పేరుతో వెలువరించారు. తనకు ప్రతిభ కంటే అదృష్టం అధికమంటూ చమత్కరించేవారు. 1970లో ‘తుగ్లక్’ పత్రికను స్థాపించారు. తన పత్రిక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. ఇందిరాగాంధీ, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత లపైన కూడా నిశితమైన విమర్శలు ప్రచురించే వారు. అందరినీ సమభావంతో ఉతికి ఆరవేయడమే విధానం. రాజకీయ వ్యాఖ్యాత గానే కాకుండా రాజకీయ సూత్రధారిగా కూడా చో పని చేసిన సందర్భాలు ఉన్నాయి. తనకు ఇష్టుడైన కామరాజ్ నాడార్ నాయ కత్వంలోని పాత కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్‌లో విలీనం చేసే సంకల్పంతో ఇందిర, కామరాజ్‌లతో మాట్లాడి మధ్య వర్తిత్వం నెరపారు.
‘దెన్‌మొళియల్’పేరుతో ఒక నాటకం రచించి, అందులో చో పాత్ర పోషించి, రక్తికట్టించి ప్రేక్షకులను మెప్పించడంతో ఆయన పేరులో శ్రీనివాస్ అయ్యర్ ఎగిరిపోయి ‘చో’ వచ్చి చేరింది (జానకి ఇంటిపేరు షావుకారు అయినట్టు). చో రచించిన నాటకాలలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అత్యంత జయప్రదమైనది. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తుగ్లక్ గోరీ నుంచి లేచి వచ్చి దేశానికి ప్రధాని కావడం నాటక ఇతివృత్తం. ఫిరాయింపు రాజకీయాలపైన కొరడా. ఈ నాటకంలో వ్యంగ్యం అద్భుతంగా పండింది. దీన్ని సినిమా తీయడానికి ప్రయత్నించినప్పుడు డిఎంకె ప్రభుత్వం గట్టిగా అడ్డుకున్నది. కానీ చో వెనకడుగు వేయలేదు. ఆ తుగ్లక్ పేరుతోనే పత్రిక వచ్చింది. ఇప్పుడు ఆ పత్రిక సుమారు 60 వేల కాపీలు అమ్ముతోంది.
వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చోని రాజ్య సభకు నామినేట్ చేసింది. జర్నలిజంలో శిఖర స్థాయికి ఎదిగి నందుకు భగవాన్‌దాస్ గోయెంకా అవార్డు ప్రదానం చేశారు. ‘శంకర్స్ వీక్లీ’లో వ్యంగ్య చిత్రాలూ, శీర్షికలూ ఉండేవి. అవి చురకలు అంటించేవి. జయప్రకాశ్ నారాయణ్, ఆరెస్సెస్ అధినేత బాలాసాహెబ్ దేవరస్, ఆడ్వాణీ, చంద్రశేఖర్ వంటి జాతీయ నాయకులతో సాన్నిహిత్యం ఉండేది. దేశవ్యాప్తంగా వెతికినా అటు వంటి మేధావి మరొకరు కనిపించరు. సాటిలేని వ్యక్తిత్వం ఆయ నది. ఆయనకిదే అక్షరాంజలి.
- కె. రామచంద్రమూర్తి