
పాలడుగు వెంకట్రావు
నూజివీడు: జనసేన పార్టీ స్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మండిపడ్డారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏదో ఒక సినిమా హిట్టు అయ్యిందని ఏదేదో మాట్లాడేస్తే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని ధ్వజమెత్తారు. ‘‘పవన్ కళ్యాణ్ హద్దులు దాటవద్దు.రాజకీయాలలో అఆ లు నేర్చుకునే దశ నీది.నువ్వెంత?, నీ సర్వీసు ఎంత?, నీ శక్తి ఎంత? వెయ్యి జన్మలెత్తినా కాంగ్రెస్‌ను ఏమీ చేయలేవు'' అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దులు మీరి ప్రవర్తిస్తే ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.
బీజేపీ తరుపున ప్రచారం చేసుకో. అంతేగాని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. నువ్వు సినిమాల్లో విశ్వరూపం చూపిస్తావేమో, అంతకంటే వంద రెట్లు ఎక్కువగా విశ్వరూపాన్ని రియల్‌గా తాను చూపించగలని హెచ్చరించారు. ఏ విషయంపైనైనా బహిరంగ సమావేశంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీజెపీ అనే దీపం అనేక సార్లు వెలిగి ఆరిపోయిందని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిదన్నారు.
తనది, పవన్‌ది గమ్యం ఒకటేనని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొనడం విచారకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలలోకి తప్పుడు సంకేతాలను పంపుతాయన్నారు. పవన్‌కళ్యాణ్ కాంగ్రెస్ హఠావో అంటుంటే, ఇద్దరి గమ్యాలు ఒక్కటేనని ఎలా చెపుతారని ఆయన చిరంజీవిని ప్రశ్నించారు. చిరంజీవి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమేయండి అని పవన్ కళ్యాణ్ అంటుంటే ఏమని అర్థం చేసుకోవాలని విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన బెట్టి కాంగ్రెస్‌ను బతికిస్తాడని చిరంజీవికి ప్రచార బాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు తెలిసి చేశాడో, తెలియక చేశాడో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్‌ను అయోమయానికి గురిచేసేలా మాట్లాడిన చిరంజీవి తమ గమ్యం ఒక్కటి కాదని రాష్ట్ర ప్రజలకు స్పష్టంచేయాలన్నారు.