పవన్.. విద్వేషాలు రెచ్చగొడతావా?
►ఇదేనా పవనిజం.. తమ్మారెడ్డి సూటి ప్రశ్న
►ప్రశ్నిస్తానంటూ వచ్చి ద్వేషాలు ఉసిగొల్పుతావా
►తెలుగు ఆత్మగౌరవాన్ని బాబు మోడీకి తాకట్టు పెట్టారు
►సీమాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గరికిపాటి ఉమాకాంత్: ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను.. జనసేన పార్టీ పెట్టానంటూ సరిగ్గా ఎన్నికల సమయంలో హడావుడి చేస్తున్న సినీనటుడు పవన్‌కల్యాణ్, తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేసి రాజకీయాల్లో విద్వేషాలను ఉసిగొల్పారని.. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పవన్ తీరు బాధ్యతారహితమని ఆయన విమర్శించారు. ఇటీవల ఆయన వర్తమాన రాజకీయాలపై యూట్యూబ్‌లో తన అభిప్రాయాన్ని వినిపించారు. దీనిపై టీడీపీ, పవన్ అభిమానుల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధితో తమ్మారెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు.
వివరాలు ఆయన మాటల్లోనే..
పవన్ ఈ ఎన్నికల ప్రచారంలో కేవలం ఇద్దర్నే టార్గెట్ చేసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒకరు కేసీఆర్.. మరొకరు జగన్... ఇప్పుడు రాష్ట్రం ముక్కలైంది.. కొత్త రాష్ట్రాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాట్లాడాలి కానీ ఇక్కడ కేసీఆర్‌ను.. అక్కడ జగన్‌ను విమర్శిస్తే ఏమొస్తుంది? తెలంగాణ అభివృద్ధికి నీ వద్ద ఉన్న ఆలోచనలేంటి.. నువ్విచ్చే సలహాలేంటి.. ఇవేమీ చెప్పకుండా ఊరికే కేసీఆర్‌ను తిడితే ఏం ప్రయోజనం? విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప! అక్కడ జగన్‌మోహన్‌రెడ్డిని.. ఆయన వాళ్ల నాన్న తరహా మంచి పాలన అందిస్తామని చెబుతుంటే నీకు నచ్చకుంటే సద్వివిమర్శలు చేయాలి గానీ అదేపనిగా తిట్టడమేంటి? నువ్వు ఏం చెప్పి రాజకీయాల్లోకి వచ్చావు? ఏనాడైనా ప్రజల సమస్యలపై మాట్లాడావా? సమాజానికి మేలు చేసే విషయాలు ప్రజలతో చర్చించావా? పోనీ నీవు సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీతో ఎప్పుడైనా ప్రజల ఇబ్బందులు గురించి మాట్లాడావా... వేటి గురించి చర్చించకుండా తిట్టు.. తిట్టు.. తిట్టు... ఇదే నా నీ రాజకీయం?
సింగపూర్‌లో నీళ్లు కొనుక్కుంటున్నారు..
ఎన్టీఆర్ తెలుగోడి సత్తాను విశ్వవ్యాప్తం చేస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నరేంద్రమోడీ కాళ్ల వద్ద తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇది నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం. మాట్లాడితే బాబు కొత్త రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తానని అంటున్నారు. అసలు సింగపూర్‌లో తాగేందుకు మంచినీళ్లు దొరక్క ప్రతి ఒక్కరూ కొనుక్కోవాల్సిన పరిస్థితులున్నాయి. అలాంటి పరిస్థితులనే ఇక్కడ తీసుకొస్తారా? ఇక మోడీతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతలు పొత్తు పెట్టుకున్నారు.. కానీ ఎవ్వరూ బాబులా ఆయన ముందు సాగిలపడలేదు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ మద్దతు కోసం జాతీయస్థాయి నేతలు తహతహలాడేవారు. అంతెందుకు బీజేపీ నేత అద్వానీ కూడా ఎన్టీఆర్ వద్దకు వచ్చే వారు... అలాంటి టీడీపీని బాబు ఇలా దిగజార్చారు. బాబు, పవన్‌ల వ్యవహార శైలిపై ప్రజలు సరిగ్గా ఆలోచించి స్పందించాలి.