2 రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు | mahanthi special interview with sakshi | Sakshi
Sakshi News home page

2 రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు

Published Sat, Mar 1 2014 1:57 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

2 రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు - Sakshi

2 రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు

 ‘సాక్షి’కి సీఎస్ మహంతి ప్రత్యేక ఇంటర్వ్యూ
 రాష్ట్ర విభజనలో, ఇరు రాష్ట్రాల సుపరిపాలనలో కీలక పాత్ర పోషిస్తా
 అవసరం లేని సంస్థలు, శాఖల మూత... మరికొన్ని విలీనం
 ఫైళ్లు ఇంటికి తీసుకెళ్లడంపై నిషేధం... ఉద్యోగులు ఇక రాజకీయాలు వదిలేయాలి

 
 సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి తెలిపారు. విభజన నేపథ్యంలో సీఎస్‌గా మరో 4 నెలల పొడిగింపుతో మహంతి ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీలు, కేటాయింపులో కీలక పాత్ర పోషించనున్నారు. ఇరు రాష్ట్రాల్లో సుపరిపాలన తీసుకురావడానికి అవసరమైన సంస్కరణలు చేపట్టడానికి కృషి చేయనున్నారు. నిజానికి శుక్రవారం పదవీకాలం పూర్తి కావాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో కంటిన్యుటీ ఉండాలనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి మహంతి పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించింది.

ఈ సందర్భంగా మహంతి సాక్షితో  ప్రత్యేకంగా వూట్లాడారు. వివరాలు ఆయున మాటల్లోనే...
  కేంద్ర సర్వీసులో కార్యదర్శి హోదా పదోన్నతి వచ్చినప్పటికీ సీఎం కోరిక మేరకు రాష్ట్ర సర్వీసుకు వచ్చాను. వచ్చాక మూడు నెలలు మాత్రమే ప్రశాంతంగా ఉంది. తరవాత తుపాన్లు, వరదలు, ఉత్తరాఖండ్ దుర్ఘటన, తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెలకు తోడు రాజకీయ అనిశ్చితి కూడా నెలకొంది. వీటన్నింటినీ అధికార యంత్రాంగం బాగానే అధిగమించింది. అధికారులకు ఎప్పుడూ అజెండా ఉండకూడదు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాలి.
 
  విభజన అంత సులభతరం కాదు. సుదీర్ఘ కాలం పడుతుంది. ఇరు రాష్ట్రాలు అవసరమైన సంస్కరణల తో ముందే గట్టి పునాది నిర్మించుకోవాలి. అందుకోసం సుదీర్ఘకాలం పని చేస్తాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయంతో సంస్కరణలు, సుపరిపాలనకు మార్గదర్శకాల రూపకల్పన చేస్తా. ఇందుకు 30 మంది యువకులతో పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తాను.
 
  ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం లేదు. వాటిని ఇరు రాష్ట్రాలు మూసేసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక శాఖలో ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన విభాగాలున్నాయి. పరిశ్రమల శాఖలో నలుగురు ఐఏఎస్ అధికారులతో విభాగాలున్నాయి. విభజన తర్వాత అంతమంది అవసరం లేదు. అలాగే కొన్ని శాఖలను విలీనం చేయాలి. కొన్ని కార్పొరేషన్లలో, శాఖల్లో అవసరానికి మించి ఉద్యోగులున్నారు. మరికొన్నింట్లో ఉద్యోగుల కొరత ఉంది. వీటిని సంస్కరణల ద్వారా సరిచేయూలి.
 
  విభజన సమయంలో అధికారులెవరూ ఇళ్లకు ఫెళ్లు తీసుకువెళ్లరాదు. దీనిపై నిషేధం విధించాం. ఫైళ్లు తీసుకువెళ్లడంపై నిఘా కోసం జీఏడీ, ప్రత్యేక భద్రత, విజిలెన్స్‌తో కమిటీ ఏర్పాటు.
 
  రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల మంజూరు సంఖ్య 376. ప్రస్తుతం 299 మందే ఉన్నారు. దీంతో 77 మంది ఐఏఎస్‌ల కొరత ఉంది. విభాగాలు విలీనం, సంస్కరణల ద్వారా కొరతను అధిగమిస్తాం. ఐఏఎస్‌లకు ఆప్షన్స్ అడుగుతారు. అయితే కొంతమంది ఐఏఎస్‌ల్లో ఆందోళన ఉంది. తమిళనాడుకు చెందినవారు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందినవారు తెలంగాణలో పనిచేయడానికి సుముఖత చూపుతున్నారు.
 
  ఉద్యోగుల విభజన, ఆస్తులు, ఆప్పుల పంపిణీ, ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాల పాలన చాలా క్లిష్టతరం. ఇందుకు చాలా పని చేయాల్సి ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోను, మరి కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేయాలి.
 
  సచివాలయంతో పాటు కొన్ని రంగాల్లో అధికారులు విభజన చేసినట్టు వస్తున్న వార్తలు నిజం కాదు. అధికారులు ప్రతిపాదనలను తయారు మాత్రమే చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు.
 
  విభజనోద్యమం సందర్భంగా ప్రభుత్వోద్యోగులు క్రమశిక్షణారహితంగా వ్యవహరించారు. వారిక రాజకీయాలు వదిలి నియమావళి ప్రకారం, బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి.
 
 ‘మీ సేవ’లో వక్ఫ్‌బోర్డు సేవలు
 రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సంబంధించిన నాలుగు సేవలను ఇకపై మీ సేవ ద్వారా కూడా పొందవచ్చు. మీ సేవలో వక్ఫ్ బోర్డు సేవలను శుక్రవారం సీఎస్ మహంతి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఒమర్ జలీల్ లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై వక్ఫ్ బోర్డు ఆస్తుల ధ్రువీకరణ, వక్ఫ్ బోర్డు సంస్థల మేనేజింగ్ కమిటీల ధ్రువీకరణ, ముతవల్లీల నియామక ధ్రువీకరణ, వక్ఫ్ పరిధిలోని సంస్థల పర్యవేక్షకులకు అందించే ఆర్థిక సహాయ ధ్రువీకరణ పత్రాలను మీ సేవలో నిర్ణీత రుసుము చెల్లించి పొందవచ్చని జలీల్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement