సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విగ్రహ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఇక, డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది.
👉ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా వరకు మళ్లీ మంచి రోజులు లేనందున ఈరోజే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు. కరీంనగర్‌లో ఇచ్చిన హామీని సోనియా సఫలం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను జేఎన్‌టీయూ ఫైనాన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చేత నిర్మిస్తున్నాం. తెలంగాణ కోరుకుంటున్న విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం స్థాపన ఉంటుంది.
గత పాలకులే తెలంగాణ ఇచ్చినట్టు పాలించారు. పాత విధానాలకు మా ప్రభుత్వం విరుద్ధం. పదేళ్లుగా సీఎంగా ఉన్న వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు. మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమం జరుగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్న వారు తెలంగాణ తల్లిని మరుగున పడేశారు. విగ్రహానికి అయ్యే కోటి రూపాయలను కూడా కేటాయించలేదు. ఇక్కడ ఎందరివో విగ్రహాలు ఉన్నాయి. దేశం కోసం ప్రాణం అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం లోటే. రాజీవ్ విగ్రహ ఏర్పాటును కూడా వివాదం చేశారు. మేధావుల సూచన మేరకు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు.
👉మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచి పరిణామం. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచి విషయం. సోనియా గాంధీ లేకపోతే ఇంకో 50 ఏళ్లు అయినా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీతో సీఎం రేవంత్ దూకుడుగా వెళ్తున్నారు. గత పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు అని ఘాటు విమర్శలు చేశారు.
👉ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..‘పదేళ్ల నుంచి తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ప్రజలు కోరుకున్నారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఎన్నో విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ లోపల పెడుతున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment