దద్దరిల్లిన సచివాలయం
విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన
అడ్డుపడుతున్నారంటూ తెలంగాణ ఉద్యోగుల నిరసన
సాక్షి,హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి రావడంతో రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలతో బుధవారం సచివాలయం దద్దరిల్లింది. సీమాంధ్ర ప్రజల ఆందోళనను పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో దూకుడుగా వెళుతోందని సీమాంధ్ర ఉద్యోగులు ఆరోపించగా.. చివరి దశలో ఉన్న తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా 140 రోజులుగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోందని సీమాంధ్ర సచివాల ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 159 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేల నుంచి విభజనకు వ్యతిరేకంగా ‘అఫిడవిట్లు’ తీసుకోవాలని నిర్ణయించామన్నారు. విభజనపై నిరసన తెలిపేందుకు వచ్చిన సీమాంధ్ర విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని.. వారిని పరామర్శించడానికి వెళ్లిన సంఘం కోశాధికారి వరలక్ష్మిని కూడా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ తథ్యం: తెలంగాణ ఏర్పాటు తుది అంకానికి చేరుకున్న దశలో అడ్డుకోవడం ద్వారా విద్వేషాలు పెరగడమే తప్ప వేరే ప్రయోజనం ఉండదని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత శ్రావణ్‌కుమార్ రెడ్డి అన్నారు. బిల్లులో తెలంగాణ ప్రాంత వాసులకూ అభ్యంతరాలు ఉన్నాయన్నారు. అక్రమంగా వచ్చిన 70 వేల మంది సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను ఇక్కడే కొనసాగించేటట్లయితే ‘తెలంగాణ’కు అర్థమే లేదన్నారు. ‘371 డి’ని తెలంగాణకు వర్తింపచేయకపోతే స్థానికులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.