ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సామాన్యుల జీవితాల్లో ఇప్పటివరకు మార్పేమీ కానరాలేదు. కానీ రైల్వే శాఖ మాత్రం ఓ నిజాన్ని వెల్లడించింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సామాన్యుల జీవితాల్లో ఇప్పటివరకు మార్పేమీ కానరాలేదు. కానీ రైల్వే శాఖ మాత్రం ఓ నిజాన్ని వెల్లడించింది. అదేంటంటే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు రాకపోకలు తగ్గాయట. అది కూడా మామూలు సంఖ్యలో కాదు. జూన్ 2014 నుంచి అక్టోబర్ 2014 మధ్య ఏకంగా 60 లక్షల మంది ప్రయాణికులు తగ్గారట. ఆసక్తికరంగా ఉంది కదూ. మరో విషయమేంటంటే.. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో బస్సుల బంద్ కారణంగా.. బస్సుల్లో ప్రయాణించాల్సిన వారంతా రైల్వేను ఆశ్రయించారట. 70 లక్షల మంది ప్రయాణికులు రైళ్లల్లో తమ గమ్యాలు చేరుకున్నారట. అయితే బందులన్నీ ముగిసిన తరువాత 2014లో మళ్లీ ఈ 70 లక్షల మంది ప్రయాణికులు రోడ్డు రవాణాను ఎంచుకున్నారట. ఈ గణాంకాలన్నీ ఇటీవల రైల్వే శాఖకు సంబంధించిన స్థాయీ సంఘం లోక్‌సభకు సమర్పించిన నివేదికలో కనిపించాయి.