అడ్డుగోలుగా పోలీసు యాక్సిలరీస్ !
అనర్హులకు పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు
సైటేషన్ల పరిశీలన లేకుండా తయారవుతున్న జాబితాలు
నేడు భేటీ కానున్న శాఖాపరమైన పదోన్నతుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: యాక్సిలరీల పేరుతో మరోసారి ‘ప్రతిభావంతులైన’ పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. సైటేషన్లను పూర్తిగా పరిశీలించకుండా తయారైన తుదిజాబితాల ఆధారంగానే ఈ తతంగాన్ని పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన శాఖాపరమైన పదోన్నతల కమిటీ(డీపీసీ) శనివారం భేటీ కానుంది. కాగా, రాష్ట్ర విభజన ప్రక్రియ కూడా పూర్తికావడంతో ఆఖరి చాన్స్‌గా భావించిన కొందరు అధికారులు తమ విధేయులకు పట్టం కట్టించేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ధైర్య సాహసాలకు గుర్తింపుగా..
దేశంలో ఎక్కడా లేని విధంగా యాక్సిలరీ(మధ్యంతర) పదోన్నతుల విధానం రాష్ట్రంలో అమల్లో ఉంది. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన వారితో పాటు ముష్కర మూకలతో ఎదురు కాల్పులకు దిగి సంఘ విద్రోహశక్తుల్ని మట్టుబెట్టిన వారికి గుర్తింపుగా, ప్రోత్సాహకంగా ఉండేందుకు యాక్సిలరీ పదోన్నతులను ప్రవేశ పెట్టారు.
నిరోధించలేని నిఘా వ్యవస్థలో..
గడిచిన దశాబ్ద కాలంలో జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో జరిగే ఏఒక్క ఉగ్రవాద దుశ్చర్యనూ ముందుగా ఊహించి, నిరోధించిన దాఖలాలు కనిపించవు. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లకు కొన్ని నెలల ముందే కేంద్ర నిఘా సంస్థ నిర్దిష్టంగా అప్రమత్తం చేసినా దాన్ని ఆపలేకపోయారు. 2007 నాటి జంట పేలుళ్లలోనూ అదే జరిగింది. అలాంటి వ్యవస్థలో పని చేస్తున్న వారికీ యాక్సిలరీ పదోన్నతులకు రంగం సిద్ధమైంది.
‘మావోయిస్టుల’ విభాగంలో గంపగుత్తగా...
మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేస్తున్న విభాగంలో పరిస్థితి మరోలా ఉంటోంది. అక్కడ నెలలు, ఏళ్ల తరబడి ఫీల్డ్ వర్క్ చేస్తూ మోస్ట్ వాంటెడ్, అనుమానితుల వివరాలను ఒకరో ఇద్దరో అధికారులు సేకరిస్తుంటారు. వాస్తవంగా వీరందించే సమాచారం ఆధారంగానే భారీ ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటి ఆధారంగా అధికారులు ఓ వ్యక్తి చేసిన పనిని పూర్తి బృందానికి, మరికొందరికి ఆపాదిస్తూ అనర్హులకు పదోన్నతులు కల్పిస్తున్నారనే విమర్శ ఉంది. కష్టనష్టాలకోర్చి విధులు నిర్వర్తిస్తున్న జిల్లాల్లోని అధికారులకు ఈ పదోన్నతుల విషయంలో మరింత అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. ఇదిలావుంటే, ఓ ఆపరేషన్‌కు సంబంధించి వాంటెడ్ వ్యక్తుల్ని పట్టుకున్నప్పుడు వారి తలపై ఉన్న రివార్డు మొత్తాల్ని క్యాష్ రివార్డులుగా తీసుకుంటున్నారు. అదేపని చూపిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పతకాలనూ పొందుతున్నారు. మళ్లీ యాక్సిలరీ పదోన్నతల కోసమూ సైటేషన్లు రూపొందించుకుంటున్నారు.
ఇదే ఆఖరి తరుణమని..
యాక్సిలరీ పదోన్నతుల్లో అనర్హులకు అందలం దక్కడమనేది ఏళ్లుగా ఉన్నా ఈసారి జోరెక్కువైంది. పదోన్నతి ఇచ్చే ముందు సైటేషన్లను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన ఉన్నతాధికారులు ఆ పని చేయట్లేదని సిబ్బంది వాపోతున్నారు. కేవలం సైటేషన్లకు కవరింగ్ లెటర్స్‌గా ఉంటున్న లేఖల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేదా గవర్నర్ ద్వారా పదోన్నతులు పూర్తి చేసుకోవాలని ఆశావహులు భావిస్తున్నారు.