పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు వారు ప్రస్తుతం పింఛను పొందుతున్న ట్రెజరీ కార్యాలయాల నుంచే రాష్ట్ర విభజన తర్వాత కూడా పింఛను అందనుంది.
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు వారు ప్రస్తుతం పింఛను పొందుతున్న ట్రెజరీ కార్యాలయాల నుంచే రాష్ట్ర విభజన తర్వాత కూడా పింఛను అందనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పెన్షన్ భారాన్ని జనాభా నిష్పత్తి (58.32 శాతం సీమాంధ్ర, 41.62 శాతం తెలంగాణ)లో భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల పెన్షన్ భారాన్ని వారి సర్వీసు (ఏ ప్రాంతంలో ఎంతకాలం పనిచేశారు) ఆధారంగా రెండు రాష్ట్రాలు పంచుకోనున్నాయి. ఉద్యోగి సర్వీసు వివరాలతో కూడిన పార్ట్-2(సి) ఫారాన్ని రెండు రాష్ట్రాలకు పంపించే అధికారాన్ని ఆర్థిక శాఖ ప్రధాన అకౌంటెంట్ జనరల్‌కు ఇచ్చింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్లు చెల్లించడానికి, విభజన తర్వాత పదవీ విరమణ చేసి పెన్షన్ పొందనున్న వారికి రెండు రాష్ట్రాలు కలిసి పెన్షన్ చెల్లించడానికి వేర్వేరుగా ఖాతాలు తెరవాలని ట్రెజరీ శాఖను ఆదేశించింది.
ఈ నెలఖారుకే పెన్షన్ ఖరారు
విభజన నేపథ్యంలో మే నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల పెన్షన్‌ను కూడా 24నే సెటిల్ చేయాలని, నెలాఖరులోగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లించడానికి ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.