రాష్ట్రం విడిపోయి పక్షం రోజులైనా పాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో ఆంధ్రా సర్కారు పరిస్థితి ఇంకా అస్థవ్యస్థంగానే ఉంది.
* అస్తవ్యస్తంగా ఆంధ్రా సర్కారు పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయి పక్షం రోజులైనా పాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో ఆంధ్రా సర్కారు పరిస్థితి ఇంకా అస్థవ్యస్థంగానే ఉంది. ఏ శాఖ అధికారులకు, ఉద్యోగులకు కూడా విధులు నిర్వహించడానికి సరైన వసతి లేదు. విభజనకు ముందే వసతుల కల్పన గురించి ఆలోచించాల్సిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఈ దుస్థితి నెలకొందని అధికార యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
కీలకమైన ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులు ఇంకా విధులు నిర్వహించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం వసతి కల్పించిన చోట పనిచేయడానికి వీలుగా సెక్షన్లు లే వు. ప్రధానంగా కంప్యూటర్ల ద్వారా పనిచేయడానికి వీలుగా విద్యుత్ కనెక్షన్లు లేవు. ఫోను, ఫ్యాక్స్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ డి బ్లాకులోని రెండు, మూడో అంతస్తుల్లో ఉండేది. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖకు నార్త్ హెచ్ బ్లాకులో రెండో అంతస్థును కేటాయించారు.
ఆ శాఖ ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లినప్పటికీ అక్కడ ఇప్పటికీ ఫ్యాక్స్ సౌకర్యం లేదు. పెపైచ్చు ఇంటర్నెట్ నెమ్మదిగా పనిచేస్తుండటంతో ఆర్థిక శాఖ ఆన్‌లైన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఉద్యోగులు డి బ్లాకు నుంచి బస్తాల్లో ఫైళ్లు పెట్టుకుని నార్త్ హెచ్ బ్లాకు చేరి పది రోజులవుతోంది. అయితే అక్కడ పనిచేయడానికి అనుగుణంగా వసతి లేకపోవడంతో బస్తాల్లోంచి ఇప్పటివరకు ఫైళ్లు బయటకు తీయలేదు. సెక్షన్లకు అనువుగా లేకపోవడంతో ఉద్యోగులు కారిడార్‌లో తిరుగుతూ కాలం గడుపుతున్నారు.