సాక్షి, అమరావతి: మీరు ఓ ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి.. నిర్మాణవ్యయం ఎంత ఉంటుంది? చదరపు అడుగుకి రూ.1,500 నుంచి రూ. 2,000 లోపు ఉండవచ్చు. ఎంత విలాసవంతమైన నిర్మాణానికైనా చదరపు అడుగుకి రూ.3వేలకు మించదని నిపుణులంటున్నారు. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు అమరావతిలో భూమి ఉచితంగా ఇచ్చి మౌలికవసతులు కల్పించి నిర్మాణం కోసం భారీగా డబ్బు వెదజల్లబోతోంది. తాజాగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు చదరపు అడుగుకు రూ. 7,179 వెచ్చించబోతోంది. కనీవిని ఎరుగని రీతిలో రెట్టింపునకు మించి ఎందుకు ఖర్చుచేయబోతోంది? ఇందులో ఇమిడి ఉన్న రహస్యమేమిటి? ఎంతోకాలంగా నిర్మాణ రంగంలో ఉన్న నిపుణులను సైతం అమరావతి భవనాల నిర్మాణ అంచనాలు విస్మయం గొలుపుతున్నాయి. అనుకూల కాంట్రాక్టర్లకు అదనంగా దోచిపెట్టడానికే ఈ స్థాయిలో భారీ అంచనాలు రూపొందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్లపాటు డిజైన్లనే ఖరారు చేయని రాష్ట్రప్రభుత్వం ఇపుడు హడావిడిగా భారీ అంచనాలు రూపొందించడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
భారీ స్థాయిలో అంచనాలు..
రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలను కూడా ఎక్కడా లేని స్థాయిలో భారీ వ్యయాలతో చేపడుతున్న ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలకు మరింత దిమ్మతిరిగే అంచనాలు రూపొందించింది. సచివాలయ నిర్మాణానికే రూ.2,728 కోట్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు రూ.2,229 కోట్లు అవసరమవుతాయని రాష్ట్రప్రభుత్వం అంచనా వేసింది. అంటే ఈ మూడు భవనాలకే దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చవుతాయని లెక్కగట్టారన్నమాట. వీటికి సంబంధించి సీఆర్‌డీఏ త్వరలో టెండర్లు పిలవనుంది. రెండేళ్ల క్రితం పరిపాలనా నగర నిర్మాణానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం మూడు భవనాలకే ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనావేయడం గమనార్హం.
(ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నమూనా చిత్రం)
చదరపు అడుగుకు రూ. 7,179
మూడు భవనాల నిర్మాణానికి గాను రాష్ట్రప్రభుత్వం వేసిన అంచనాల ప్రకారం సచివాలయ నిర్మాణానికి చదరపు అడుక్కి రూ.7,179, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు చదరపు అడుక్కి రూ.6,192 ఖర్చవుతుంది. సాధారణ భవనాల నిర్మాణానికి చదరపు అడుక్కి రూ.1,500 ఖర్చవుతుండగా విలాసవంతంగా నిర్మించినా మూడు వేలు మించదని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటిది ఈ మూడు భవనాలకు చదరపు అడుగుకు ఏకంగా ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తూ త్వరలో టెండర్లు పిలవడానికి రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
తాత్కాలిక భవనాలకూ ఇదే తీరు..
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ప్రభుత్వం ఇలాగే భారీగా ఖర్చు పెట్టింది. చదరపు అడుగుకు రూ.3,150 చొప్పున టెండర్లను ఖరారు చేసినా చివరికి దాన్ని ఆరు వేల రూపాయల వరకూ తీసుకెళ్లింది. అందుకే రూ.180 కోట్ల నుంచి మొదలైన ఈ నిర్మాణాల వ్యయం ప్రభుత్వం లెక్కల ప్రకారమే రూ.660 కోట్లయింది. మౌలిక వసతులు, గ్రీనరీ, ఇతర ఖర్చులతో కలిపి ఈ తాత్కాలిక భవనాలకు సుమారు వెయ్యి కోట్లు అయినట్లు అనధికారిక సమాచారం. ఈ నేపథ్యంలో ప్రాథమిక అంచనాలే రూ.ఐదు వేల కోట్లుగా ఉన్న ఈ ఐకానిక్ భవన నిర్మాణాల ఖర్చు చివరికి వచ్చేసరికి అంతకంతకు రెట్టింపు కావచ్చనే∙అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మౌలికవసతులు, గ్రీనరీకి రెట్టింపు ఖర్చు..
సచివాలయాన్ని నాలుగు టవర్లుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 శాఖలకు చెందిన విభాగాధిపతులు ఉండేలా 38 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మించేందుకు రూ.2,728 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ లెక్కన చదరపు అడుగుకు రూ.7,179 ఖర్చవుతుంది. ఇటీవలే నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన టవర్ డిజైన్‌తో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ భవనం, స్థూపం డిజైన్‌తో 25 లక్షల చదరపు అడుగుల్లో హైకోర్టు భవనం నిర్మాణానికి రూ.2,229 కోట్లవుతుందని అంచనా వేసింది. చదరపు అడుక్కి రూ.6,192 ఖర్చవుతుంది. నిర్మానుష్య ప్రాంతంలో చేపట్టే ఈ భవనాల ప్రాంగణంలో మౌలిక వసతులు, గ్రీనరీ, ఇతర హంగుల ఖర్చులు వీటికి అదనం. తాత్కాలిక సచివాలయం మాదిరిగా ఈ అంచనాలు భవనాల నిర్మాణం వరకే తీసుకుంటే ఇంటీరియర్, విద్యుత్ వ్యవస్థ, డ్రెయినేజీ తదితర వాటికి రెట్టింపు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు, ఉద్యోగులకు నివాసం కోసం నిర్మించే అపార్టుమెంట్లకు చదరపు అడుగుకు రూ.2,510 ఖర్చు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మంత్రుల బంగ్లాలకు మాత్రం చదరపు అడుగుకు రూ.7,916 ఖర్చవుతుందని అంచనా వేయడం విశేషం.
( ఆంధ్రప్రదేశ్ సచివాలయం నమూనా చిత్రం )
ఇంతకీ డిజైన్లు ఖరారయ్యాయా?
‘‘నార్మన్ ఫోస్టర్ సంస్థ రెండు డిజైన్లు ఇచ్చిందంటారు.. రాజమౌళి డిజైన్ తిరస్కరించారంటారు. ఓ డిజైన్‌ను ప్రజల అభిప్రాయం కోసం సోషల్ మీడియాలో విడుదల చేశామంటారు.. టవర్ డిజైన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటారు.. ఆ డిజైన్ అంత ఆకర్షణీయంగా లేదని, పెద్ద చిత్రాలు చూపించాలని మంత్రులు కోరితే స్ట్రక్చరల్ డిజైన్లు రావడానికి ఆరునుంచి ఎనిమిదివారాలు పడుతుందని మంత్రి నారాయణ చెబుతారు.. ఇడ్లీపాత్ర ఆకారంలో నిర్మాణమేమిటని నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారంటారు..’’ ఇంతకీ అమరావతిలో నిర్మించబోయే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు డిజైన్లు ఖరారయ్యాయా.. ఖరారైతే అవి ఏమిటి? రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు ఏదీ స్పష్టంగా చెప్పకపోవడంపై సోషల్‌మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి.
చాలా ఎక్కువ.. ఏదో మతలబు ఉంది..
చదరపు అడుగుకు రూ. 6– 7 వేలు చాలా ఎక్కువ. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో చదరపు అడుగుకు నాలుగు వేలతో విశాలమైన భవనాలు నిర్మించవచ్చు. దీంట్లో భూమి ధర కూడ కలుపుకొని ఉంటుంది. కానీ, రాజధానిలో భూమి కూడ ప్రభుత్వానిదే. ఇంకా అనేక సౌకర్యాలు కూడా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం కల్పిస్తోంది. అయినా అంత భారీ రేటు ఇవ్వాలని నిర్ణయించారంటే ఏదో మతలబు ఉందని అర్ధమవుతుంది. – పాండు రంగారావు, బిల్డర్
వాస్తవానికి ఖర్చు తగ్గాలి..
రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిర్మాణ సంస్థలకు రేటు పెంచి ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. అంతర్జాతీయ నిర్మాణాల పేరుతో పెద్ద పెద్ద కంపెనీలకు ఈ పనులు అప్పగిస్తున్నారు. ఆ కంపెనీలు మ్యాన్ పవర్‌ను తగ్గించి, సాంకేతికతను ఉపయోగించుకొని పనులు చేస్తున్నాయి. సాంకేతికత పెరిగినప్పుడు ఖర్చు తగ్గాలి కానీ అమరావతిలో విచిత్రంగా పెంచుతున్నారు. ఇది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే. – ఎం.వి. దాస్, ఇంజనీరింగ్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment