
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాలికొదిలేసింది. సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలపై జాతీయ జెండాను కూడా కనీసం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ఉండే ఎల్ బ్లాక్‌పై చిరిగిన జెండా రెపరెపలాడింది. నిబంధనల ప్రకారం రోజూ ఉదయం జాతీయ జెండాను ఎగరేసి.. సాయంత్రం ఆరు గంటల తర్వాత తొలగిస్తారు. కానీ కొంతకాలంగా ఈ బ్లాక్‌పై జెండాను ఎవరూ పట్టించుకున్నట్లుగా లేదు. దీంతో జాతీయ పతాకం చిరిగిపోయింది. ఈ నేపథ్యంలో జాతీయ జెండాకు అవమానం జరిగిందంటూ మంగళవారం ఉదయం సచివాలయంలో అధికారులు, ఉద్యోగులందరి మధ్య చర్చ జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు పలువురు ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీయటంతో అప్రమత్తమైన సిబ్బంది అప్పటికప్పుడు జాతీయ జెండాను తొలిగించి కొత్త జెండాను అమర్చారు.
పాడుబడ్డ బంగ్లాలు..
సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలు ఇప్పటికే దాదాపుగా ఖాళీ అయ్యాయి. ఇక్కడున్న కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేసిన సచివాలయానికి తరలిపోయాయి. దాదాపు ఏడాది కిందటే ఇక్కడున్న ఉద్యోగులు, అధికారులు సహా వెళ్లిపోవటంతో ఈ భవనాలు బోసిపోయాయి. వీటిని పట్టించుకున్న నాథులు లేరు. అన్ని భవనాలు పాడుబడ్డ బంగ్లాలుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బ్లాకుల్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. అన్ని బ్లాకులు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఏపీ సచివాలయ ప్రాంగణానికి వెళ్లే దారిలో సీసీ కెమెరాలన్నీ ఎక్కడపడితే అక్కడే నేలపై పడిపోయాయి. అన్ని బ్లాకుల్లో విద్యుత్తు వైర్లు వేలాడుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మరోవైపు ఈ భవనాలను ఖాళీ చేసి తమకు అప్పగించాలని గతేడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే ఏపీ భవనాలకు సంబంధించిన కరెంటు, నీటి బిల్లుల బకాయిలన్నీ పేరుకుపోయాయి. గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల మంత్రుల త్రిసభ్య కమిటీలు పలుమార్లు చర్చలు జరిపినా ఈ భవనాల అప్పగింతపై ఏపీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ భవనాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.