విభజన బిల్లుపై ‘డిబేట్’ లేదు
ఏ సభ్యుడైనా ‘డివిజన్’ కోరితే, స్పీకర్ గానీ అధ్యక్ష స్థానంలో ఉన్న మరెవ్వరైనా గానీ, ఓటింగ్ నిర్వహించి ‘అనుకూలం’ ఎందరో, ‘వ్యతిరేకం’ ఎందరో ‘తటస్థం’ ఎందరో సంఖ్యాపరంగా వెల్లడించి; ‘ప్రతిపాదన’ ఆమోదించారో, తిరస్కరించారో ప్రకటించాలి. ‘డివిజన్’ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. పార్లమెంట్ ఉభయసభ లలో జరిగినటువంటి ఉదం తం పరిశీలించబోయే ముందు పార్లమెంట్ ఎలా నడవాలని రాజ్యాంగం కోరుకుందో, ఆ రాజ్యాంగానికి లోబడి ఏర్ప డిన రూల్స్ ఏం చెప్పాయో పరిశీలిద్దాం!
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 (1)
ఉభయసభలలోగాని, ఉభయసభల ఉమ్మడి సమా వేశంలోగాని, ఏ ‘ప్రశ్న’ లేవనెత్తబడినా, ఆ ప్రశ్నకు సమాధానం ఆ సమయానికి సభలో హాజరై ఉన్న సభ్యు లతో ఓటింగ్ జరిపి, మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయించాలి. స్పీకర్ గాని, చైర్మన్ గాని; ఆ సమ యానికి ఆ బాధ్యత నిర్వహిస్తున్న వారుగాని ‘మొదట’ ఓటింగ్‌లో పాల్గొనకూడదు. ఒకవేళ ఇరుపక్షాల వారికి సమానమైన ఓట్లు వస్తే అప్పుడు స్పీకర్ / చైర్మన్ కూడా తమ ఓటింగ్ హక్కు వినియోగించవచ్చును.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 118 (1)
పార్లమెంట్‌లోని ఉభయసభలూ, ఈ రాజ్యాంగం లోని అంశాలకు లోబడి, తమ తమ సభలు నడుపుకో వాల్సిన నియమాలూ, నిబంధనలూ (రూల్స్-రెగ్యులే షన్స్) రూపొందించుకోవచ్చును.
ఆర్టికల్ 118కి లోబడి, లోక్‌సభ ఏ విధంగా నడు చుకోవాలో ‘రూల్-బుక్’ తయారు చేయబడింది. ఆ రూల్-బుక్‌లో ‘డివిజన్’ ఎలా జరపాలో, మెజారిటీ అభిప్రాయం ఎలా రికార్డు చెయ్యాలో, ఆ అభిప్రాయా నికి కట్టుబడి స్పీకర్ సభా నిర్ణయాన్ని ఎలా ప్రకటిం చాలో స్పష్టంగా నిర్దేశించబడింది.
రూల్ 367 రూల్స్ బుక్ లోక్‌సభ ‘డివిజన్’ చేసే విధానం
1. ఇరుపక్షాల వాదనలూ (డిబేట్) పూర్తయిన తర్వాత, స్పీకర్ ‘ప్రశ్న’ను సభ ముందుంచి, ఎంత మంది అనుకూలమో వారు ‘ఆయ్’ అనమని, ఎంత మంది వ్యతిరేకమో వారిని ‘నో’ అనమని ఆహ్వానిస్తారు.
(‘డిబేట్ అంటే, ఇరుపక్షాల వాదనలూ! ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారం డిబేట్ నిర్వచనం: సభలో కానీ, చట్ట సభల్లో కానీ, పరస్పర విరుద్ధ వాదనలు సభముందు ఉంచబడతాయి. సాధారణంగా ఈ వాదనలు ‘ఓటింగ్’ తో ముగుస్తాయి!
డిబేట్ పూర్తయిన తర్వాత మాత్రమే స్పీకర్ ప్రశ్నను సభ ముందుంచాలి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు విషయమై మాత్రం డిబేట్ జరగలేదు. హోంమంత్రి షిండే, ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, మరో మంత్రి జైపాల్‌రెడ్డి గార్లు మాత్రమే మాట్లాడారు. ముగ్గురూ విభజనను సమర్థిస్తున్న వారే! వ్యతిరేకిస్తున్న వారికెవ్వరికీ మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. యూపీఏని సమర్థిస్తున్న డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ వారికి గాని, సీపీఎం వారికి గాని, ఎన్‌డీఏలోని శివసేన, బీజేపీ, జేడీ(యూ) తదితరులెవ్వ రికీ విభజన బిల్లుని వ్యతిరేకిస్తూ మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.)
367 (2) ‘ఆయ్’ అన్న వారి నుండి వెలువడిన శబ్దాన్నీ, ‘నో’ అన్న వారి నుండి వెలువడిన శబ్దాన్నీ బట్టి స్పీకర్ అంచనా వేసుకుని, ‘ఆయ్’ ఎక్కువ మంది అనో, ‘నో’ అన్నవారు ఎక్కువ మంది అనో ప్రకటిస్తారు.
ఆ ప్రకటనకు సభ నుంచి ఏ రకమైన వ్యతిరేక స్పందనా లేకపోతే రెండుసార్లు ‘ఆయ్’లు అధికం అనో, స్పీకర్ సభ నిర్ణయం ‘ఆమోదించబడింది’ అనో, ‘వ్యతిరేకించబడింది’ అనో సభా నిర్ణయం ప్రకటించాలి.
367 (3)(ఎ) ‘ఆయ్’లు ఎక్కువో ‘నో’ ఎక్కువో స్పీకర్ ప్రకటించినప్పుడు, స్పీకర్ అభిప్రాయాన్ని సవాల్ చేస్తే, స్పీకర్ ‘లాబీ’ ఖాళీ చెయ్యమని ఆదేశిం చాలి.
(‘లాబీ’ అంటే లోక్‌సభ వరండా... అక్కడిదాకా మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇతర స్టాఫ్ వెళ్లడా నికి అనుమతి ఉంది. స్పీకర్ ఆదేశాల మేరకు, ఓటింగ్ జరపడానికి వీలుగా ‘లాబీ’ ఖాళీ చేయిస్తారు.)
(బి) ఆ తర్వాత, మూడు నిమిషాల ముప్పై సెకన్లు సమయం గడిచిన తర్వాత, మరోసారి ‘స్పీకర్’ ప్రశ్నను మళ్లీ సభముందు చదవాలి. మళ్లీ అనుకూలురు ‘ఆయ్’ అనమని, వ్యతిరేకులు ‘నో’ అనమని కోరాలి.
(సి) స్పీకర్ మళ్లీ ప్రకటించిన తర్వాత కూడా ఆ నిర్ణయాన్ని సభ్యులెవరైనా సవాల్ చేస్తే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా సభ్యుల అభిప్రాయాన్ని తెలియజేయ మని గానీ, లేదా ‘ఆయ్’-‘నో’ ముద్రించబడిన స్లిప్పులు సభ్యులకందించి అభిప్రాయం తెలియజేయ మని గానీ, లేదా ‘ఆయ్’ సభ్యులు లాబీ (వరండా)లో ఒకవైపునకు ‘నో’ సభ్యులు మరొకవైపునకు వెళ్లమని ఆదేశించాలి.
ఒకవేళ అనవసరంగా ‘డివిజన్’ (ఓటింగ్) అడుగు తున్నారు అని స్పీకర్ భావించినట్లయితే , ‘ఆయ్’ (అను కూలురు) అందరూ నిలబడండి అని వారిని లెక్కపెట్టి ‘నో’ (వ్యతిరేకులు) అందరూ నిలబడండి అని వారిని లెక్కపెట్టి - సభా నిర్ణయం ప్రకటించాలి.
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు విషయమై ‘డివిజన్’ (ఓటింగ్) అనవసరంగా అడుగుతున్నారని స్పీకర్ భావించారు. 367(3)సికి అనుబంధంగా రాయబడిన ‘తలలు లెక్కపెట్టే’ పద్ధతిని ఎంచుకున్నారు. (ఈ విధంగా ‘డివిజన్’ నిరాకరించటం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ‘కౌల్ అండ్ షక్దర్’ ప్రాక్టీసు అండ్ ప్రొసీ జర్ ఆఫ్ పార్లమెంట్ బుక్‌లో చూశాను. 1955లోనూ 1956లో ఒకసారి మాత్రమే ‘డివిజన్’ నిరాకరించటం జరిగింది.)
మొట్టమొదటి లోక్‌సభ జరుగుతున్నప్పుడు, 1955 లోనూ 1956లోనూ, స్పీకర్ ‘డివిజన్’ నిరాకరించి అధికార పక్షానికి అనుకూలంగా ‘ఆమోదం’ ప్రకటించ టం జరిగింది. ఆ రోజుల్లో, కాంగ్రెస్ సభ్యులు 364 మంది, కమ్యూనిస్టు 16, సోషలిస్టు 12, కిసాన్ మజ్దూర్ పార్టీ 9, పీడీఎఫ్ 7... మొత్తం 409 మంది సభ్యులలో 364. అంటే మూడింట రెండొంతుల మెజారిటీతో, అవసరమనుకుంటే ‘రాజ్యాంగ సవరణ’ కూడా ఒక్క కాంగ్రెస్ వారే చేసేయగలిగిన స్థాయిలో సంఖ్యాబలం కలిగి ఉన్నారు. 28.7.55న ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ (ఎమెండ్‌మెంట్) బిల్లుకు ప్రతిపాదించబడిన సవరణ విషయమై ‘డివిజన్’ నిరాకరించబడింది. సవరణకు అనుకూలంగా కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఉన్నారని, వ్యతిరేకంగా చాలా ఎక్కువ మెజారిటీ ఉందని ప్రకటిస్తూ డిప్యూటీ స్పీకర్ సవరణ వీగిపోయి నట్లు ప్రకటించారు.
19.4.1956న అప్పటి హోంమంత్రి గోవింద వల్లభ్ పంత్, గతంలో ప్రవేశపెట్టిన 6వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించుకోవటానికి సభ అనుమతి కోరారు. కొన్ని మార్పులు చేసి మళ్లీ బిల్లు ప్రవేశపెడతా మని కూడా చెప్పారు. ‘నో’ డివిజన్ కావాల్సిందే... మాకు సరైన నోటీసివ్వలేదన్నారు, ప్రతిపక్ష సభ్యులు. ‘ఆయ్’ ఎక్కువ మంది ఉన్నారు. అయినా ఇంత చిన్న విషయాలలో ‘డివిజన్’ కోరి సభాసమయాన్ని వృథా చేయటం కరెక్ట్ కాదు అన్నారు స్పీకర్.
1. ‘మూజువాణి’ అనే పదం ఉర్దూ భాషకు చెంది నది. మూహ్‌జుబానీ అంటే నోటితో వ్యక్తపరిచేది. ‘ఆయ్’ అనో ‘నో’ అనో నోటితో చేసే ధ్వని ద్వారా ఫలితం నిర్ణయించబడితే, దానిని మూజువాణి ఓటుతో ప్రతిపాదన ఆమోదించబడిందనో, వీగి పోయిందనో ప్రకటిస్తారు.
2. డివిజన్ - అంటే విభజించమని కోరటం. సభా ధ్యక్షులు మూజువాణి ఓటుతో ప్రతిపాదన వీగిం దనో, గెలిచిందనో ప్రకటించినప్పుడు సభ్యు లెవ్వరూ ఆ ప్రకటనతో విభేదించకపోతే, వాయిస్ ఓటు (మూజువాణి ఓటు)తో అధ్యక్షుని ప్రకటన ఆమోదించబడినట్లే...
ఏ సభ్యుడైనా ‘డివిజన్’ కోరితే, స్పీకర్‌గాని అధ్యక్ష స్థానంలో ఉన్న మరెవ్వరైనా గానీ, ఓటింగ్ నిర్వహించి ‘అనుకూలం’ ఎందరో ‘వ్యతిరేకం’ ఎందరో ‘తటస్థం’ ఎందరో సంఖ్యాపరంగా ప్రకటించి ‘ప్రతిపాదన’ ఆమో దించారో, తిరస్కరించారో ప్రకటించాలి. ‘డివిజన్’ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ ఏ సభలోనైనా, ఏ అంశంలోనైనా సభాభిప్రాయం తేలవల్సింది ‘డివిజన్’ ద్వారానే!
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
a_vundavalli@yahoo.com
- ఉండవల్లి అరుణ్‌కుమార్