parilament sessions
-
21వ శతాబ్దంలో 19వ శతాబ్దం రూల్సా?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అతి పెద్దది. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా పార్లమెంట్ సమావేశాలు మాత్రం ఎన్నడూ సవ్యంగా నడవవు. నిన్నటి వర్షాకాల సమావేశాలు కళంకిత మంత్రులను ఉపేక్షించడంపై తుడిచిపెట్టుకుపోగా, నేటి శీతాకాల సమావేశాలు దేశంలో పెరుగుతున్న అసహనం, రగులుతున్న నేషనల్ హెరాల్డ్ వ్యవహారంతో తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఫలితంగా వస్తుసేవల పన్ను లాంటి ముఖ్యమైన పలు బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఎందుకు పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా కొనసాగడం లేదు? దీనికి పరిష్కారం లేదా? అన్న అనుమానాలు వస్తాయి. అమెరికా, బ్రిటన్ దేశాల పార్లమెంటరీ వ్యవస్థలను అనుసరించి 19వ శతాబ్దంలో మనం ఏర్పాటు చేసుకున్న పార్లమెంటరీ ద్విసభ విధానం, అనుసరిస్తున్న నియమ నిబంధనలే ప్రస్తుత పరిస్థితికి కారణం. అమెరికా, బ్రిటన్ దేశాలే ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంటరీ వ్యవస్థలో మార్పులు తెచ్చినప్పుడు మన వ్యవస్థలో కూడా మార్పుల కోసం ఎందుకు ప్రయత్నించకూడదు? దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్నే ఏర్పాటు చేసుకున్నప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రం ఎందుకు మార్పులు తీసుకురాకూడదు! నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్ల మెజారిటీతో అధికారంలోకి రావడం దాదాపు గత మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారని చెప్పవచ్చు. అయినా మోదీ ప్రభుత్వంలో విధానపర నిర్ణయాలు సక్రమంగా జరగడం లేదు. మోదీ గొప్పగా చెప్పుకుంటూ వస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు. కారణం, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అవడం, పాలకపక్ష పార్టీ మైనారిటీలో కొనసాగడం. రాజ్యసభలో ఆర్థిక బిల్లులను తప్పించి ఇతర విధానపరమైన బిల్లులను ప్రస్తుతం ప్రతిపక్షమే శాశిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో ప్రజా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఎక్కడ? పార్టీలకు అతీతంగా సభ్యులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా 1985లో తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా అడ్డు పడుతోంది. విప్ల పేరిట పార్టీ నాయకత్వం తమ సభ్యులను నియంత్రిస్తుంది. ఇలాంటి సమయాల్లో పార్టీ నాయకత్వం మాటే చెల్లుతుంది తప్ప ప్రజాప్రతినిధుల మాట చెల్లదు. అణ్వస్త్రాల ప్రయోగం, ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టడం లాంటి అంశాలకు మాత్రమే పార్లమెంట్ నిబంధనలు కచ్చితంగా ఉన్నాయి గానీ చర్చనీయాంశాల ఎజెండా, తీసుకరావాల్సిన తీర్మానాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేకపోవడం శోచనీయం. పార్లమెంట్ సభ్యుల అవగాహనతో వీటిని నిర్ణయించాల్సి ఉంటుందని పార్లమెంట్ నిబంధనలు తెలియజేస్తున్నాయి. ప్రజా ప్రయోజనం కాకుండా పార్టీల స్వప్రయోజనాలే ముఖ్యమైన నేటి వ్యవస్థలో రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదరడం అసాధ్యమే! అమెరికా సెనేట్ వ్యవస్థను పాక్షికంగా అనుసరించి రాజ్యసభ స్వరూపాన్ని ఏర్పాటు చేసుకున్న మనం సంస్కరణల దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? అమెరికా సెనేట్ వ్యవస్థలో 1913లోనే సంస్కరణలు తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేశారు. 1911, 1949లలోబ్రిటన్ ప్రభువుల సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ సభకు ఎలాంటి బిల్లునైనా ఏడాది పాటు ఆపవచ్చు గానీ తిరస్కరించే అధికారం లేదు. ఆ తరహా మార్పులతో మన రాజ్యసభను ఎందుకు తీర్చిదిద్దకూడదు! నేటి 21వ శతాబ్దంలో కూడా 19వ శతాబ్దం నాటి నియమ నిబంధనలనే పాటించడం ఏ మేరకు సబబు! -
అసలు తలలే లెక్కపెట్టలేదు!
(పార్లమెంటులో ఏం జరిగింది-40) ధర్మ సంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. ఇదే నేను చేసింది. శ్రీరాముడు వాలిని చంపినప్పుడు, రావణాసురుణ్ణి చంపినప్పుడు ఏ ధర్మం పాటించాడో మనమూ అదే చేశాం. జైపాల్‌రెడ్డి: రైటయినా, తప్పయినా, ఈ క్షణానికి ఇది తప్ప మనం ఇంకేమీ చెయ్యలేం! కేసీఆర్ నిరాహార దీక్ష విరమించేసినా... లేదు లేదు చచ్చిపోతున్నాడంటూ డిసెంబర్ 2009 మొదటి వారాంతంలో, మనం ఢిల్లీలో చేసిన ప్రచారం, ఆ ప్రచారం నిజం కాదని అందరికీ తెల్సినా... నిజమేనన్నట్లు చిదంబరం తెలంగాణ ప్రకటన చేయటం... ఆ రోజుతో ప్రారంభమయ్యింది, కేసీఆర్ నాయకత్వం బలపడటం...! అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి అనే చిదంబరం ప్రకటనలో ‘మెలిక’ అర్థం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాల ప్రహసనంతో మరింత బలపడింది కేసీఆర్ నాయకత్వం!! తెలంగాణ ఇవ్వవలసింది పార్లమెంట్ అని తెలిసీ.. 2009 తర్వాత కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంట్‌కు వచ్చాడు!? మీరిన్ని రోజులు లోక్‌సభను స్తంభింపచేశారు. ఒక్కరోజైనా మీతో కేసీఆర్ వచ్చాడా..! కేసీఆర్ కాంగ్రెస్‌లో చేరిపోతే మంచిదే. అతనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతాడు... ఈ రోజు నన్నెలా స్పీకర్ దగ్గరకి తోడ్కొని పోయారో, అలాగే కేసీఆర్‌ని కాంగ్రెస్‌లోకి తోడ్కొనిరండి! ఈ రోజు స్పీకర్ బిల్లు పాసయ్యిందని ప్రకటించి తీరాలి. కమల్‌నాథ్, సుష్మాస్వరాజ్ అవునవునంటూ బల్లలు చరుస్తారు. గత్యంతరం లేదు వాళ్లలాగ చేయక తప్పదు...!! ధర్మసంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. ఇదే నేను చేసింది. శ్రీరాముడు వాలిని చంపినప్పుడు, రావణాసురుణ్ణి చంపినప్పుడు ఏ ధర్మం పాటించాడో మనమూ అదే చేశాం. మహా భారతయుద్ధంలో భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణీ ఆఖరికి దుర్యోధనుణ్ణి ఎవర్నీ రూల్ ప్రకారం పోరాడి చంపలేదు. మనమూ అంతే చేశాం! ఆఖరి నిమిషంలో మనం చేసిన ప్రయత్నం వల్లనే ఈ బిల్లు పాసయ్యిందంటూ మనం ప్రజల ముందు చెప్పుకుంటానికి మాత్రం అవకాశం లేదు. అలా చెప్పుకున్న మరుక్షణం, మనం అధర్మపరులం అయిపోతాం. దయచేసి ఎవ్వరూ ఆ ఆలోచన చెయ్యకండి! రాజ్యాంగ మర్యాదల్ని కొంతవరకూ పాటించకతప్పదు. తెలంగాణా ఏర్పడటం తక్షణ అవసరంగా భావించే నేనీవిధంగా ప్రవర్తించాను. నౌ ఆర్ నెవ్వర్!! ఇప్పుడైతే అయినటు..్ల లేకపోతే ఎప్పటికీ తెలంగాణా ఏర్పడదు. ఏర్పడినా, ఇంతే అనుకూలమైన బిల్లు ఎప్పటికీ రాదు. నా బాధ్యత నేను నిర్వర్తించాను. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. కేసీఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించటమే మీ బాధ్యత. మాటిచ్చాడు గదా అని మాత్రం ధీమాగా ఉండకండి. తెలంగాణ కోసం నేనేమైనా మాట్లాడతాను, సమయానికి ఎవరి కాళ్లైనా పట్టుకుంటాను అని చెప్పాడు. కేసీఆర్! మెంటల్‌గా ప్రజల్ని ప్రిపేర్ చేసి వుంచాడు. రేపు కాంగ్రెస్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసినా, ప్రజలు అతనినే నమ్ముతారు కానీ మనల్ని నమ్మరు. రెండ్రోజుల్లో రాజ్యసభలో పాసయి పోతుంది... మరో పది రోజుల్లో ప్రెసిడెంట్ సంతకం కూడా అయిపోతుంది. ఈ లోగా కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కల్సిపోవాలి! మీరు ఆ పనిలో ఉండండి.'' గత నాలుగు ఆర్టికల్స్, నేను రాసినవి. ఊహించి రాసినవి. ఆ విషయం ముందే చెప్పాను. ఇది నా విశ్లేషణ మాత్రమే! ‘‘18 ఫిబ్రవరి 2014న స్పీకర్ ఛాంబర్లో నేనూ, కమల్‌నాథ్, సుష్మాస్వరాజ్‌ల మధ్య రాజీ కుదిర్చాను’’ అని చేసిన జైపాల్‌రెడ్డిగారి ప్రకటన ఆధారంగా, జైపాల్‌రెడ్డిగారి ఉపన్యాస శైలితో పరిచయం వున్న వ్యక్తిగా ఆ కీలకమైన గంటలో, ఏం జరిగి వుండవచ్చునో, ఊహించి రాశాను. జైపాల్‌రెడ్డి గారు రూల్ ప్రకారం తలలు లెక్కపెట్టినట్లు నటించమని చెప్పారు. కానీ స్పీకర్ గారు ఒకటి రెండు సవరణలకి లెక్క పెట్టినట్లు ‘‘అనుకూలం 169 వ్యతిరేకం 6 అంటూ ప్రకటించారు గానీ ఆ తర్వాత అసలు లెక్కించలేదు. కనీసం తలలైనా లెక్క పెట్టి ఎంత మంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరేకమో చెప్పండంటూ అసదుద్దీన్ ఒవైసీ పదే పదే స్పీకర్‌ని అడగటం జరిగింది గానీ, స్పీకర్ మాత్రం లెక్కించనే లేదు! సవరణ చదవటం, వీగిపోయిందంటూ ప్రకటించటం.. జరిగిపోయింది!! ఈ ప్రక్రియ రూల్ వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం కూడా!! జైపాల్‌రెడ్డి గారు నేను అభిమానించే రాజనీతిజ్ఞుడు. తెలంగాణా విషయంలో మాత్రం ఆయన సగటు రాజకీయ నాయకుడి గానే ప్రవర్తించారని నేననుకుంటు న్నాను. అలా ఎందుకనుకుంటున్నానో కూడా వివరిస్తాను. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: - ఉండవల్లి అరుణ్‌కుమార్ a_vundavalli@yahoo.com -
విభజన బిల్లుపై ‘డిబేట్’ లేదు
ఏ సభ్యుడైనా ‘డివిజన్’ కోరితే, స్పీకర్ గానీ అధ్యక్ష స్థానంలో ఉన్న మరెవ్వరైనా గానీ, ఓటింగ్ నిర్వహించి ‘అనుకూలం’ ఎందరో, ‘వ్యతిరేకం’ ఎందరో ‘తటస్థం’ ఎందరో సంఖ్యాపరంగా వెల్లడించి; ‘ప్రతిపాదన’ ఆమోదించారో, తిరస్కరించారో ప్రకటించాలి. ‘డివిజన్’ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. పార్లమెంట్ ఉభయసభ లలో జరిగినటువంటి ఉదం తం పరిశీలించబోయే ముందు పార్లమెంట్ ఎలా నడవాలని రాజ్యాంగం కోరుకుందో, ఆ రాజ్యాంగానికి లోబడి ఏర్ప డిన రూల్స్ ఏం చెప్పాయో పరిశీలిద్దాం! భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 (1) ఉభయసభలలోగాని, ఉభయసభల ఉమ్మడి సమా వేశంలోగాని, ఏ ‘ప్రశ్న’ లేవనెత్తబడినా, ఆ ప్రశ్నకు సమాధానం ఆ సమయానికి సభలో హాజరై ఉన్న సభ్యు లతో ఓటింగ్ జరిపి, మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయించాలి. స్పీకర్ గాని, చైర్మన్ గాని; ఆ సమ యానికి ఆ బాధ్యత నిర్వహిస్తున్న వారుగాని ‘మొదట’ ఓటింగ్‌లో పాల్గొనకూడదు. ఒకవేళ ఇరుపక్షాల వారికి సమానమైన ఓట్లు వస్తే అప్పుడు స్పీకర్ / చైర్మన్ కూడా తమ ఓటింగ్ హక్కు వినియోగించవచ్చును. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 118 (1) పార్లమెంట్‌లోని ఉభయసభలూ, ఈ రాజ్యాంగం లోని అంశాలకు లోబడి, తమ తమ సభలు నడుపుకో వాల్సిన నియమాలూ, నిబంధనలూ (రూల్స్-రెగ్యులే షన్స్) రూపొందించుకోవచ్చును. ఆర్టికల్ 118కి లోబడి, లోక్‌సభ ఏ విధంగా నడు చుకోవాలో ‘రూల్-బుక్’ తయారు చేయబడింది. ఆ రూల్-బుక్‌లో ‘డివిజన్’ ఎలా జరపాలో, మెజారిటీ అభిప్రాయం ఎలా రికార్డు చెయ్యాలో, ఆ అభిప్రాయా నికి కట్టుబడి స్పీకర్ సభా నిర్ణయాన్ని ఎలా ప్రకటిం చాలో స్పష్టంగా నిర్దేశించబడింది. రూల్ 367 రూల్స్ బుక్ లోక్‌సభ ‘డివిజన్’ చేసే విధానం 1. ఇరుపక్షాల వాదనలూ (డిబేట్) పూర్తయిన తర్వాత, స్పీకర్ ‘ప్రశ్న’ను సభ ముందుంచి, ఎంత మంది అనుకూలమో వారు ‘ఆయ్’ అనమని, ఎంత మంది వ్యతిరేకమో వారిని ‘నో’ అనమని ఆహ్వానిస్తారు. (‘డిబేట్ అంటే, ఇరుపక్షాల వాదనలూ! ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం డిబేట్ నిర్వచనం: సభలో కానీ, చట్ట సభల్లో కానీ, పరస్పర విరుద్ధ వాదనలు సభముందు ఉంచబడతాయి. సాధారణంగా ఈ వాదనలు ‘ఓటింగ్’ తో ముగుస్తాయి! డిబేట్ పూర్తయిన తర్వాత మాత్రమే స్పీకర్ ప్రశ్నను సభ ముందుంచాలి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు విషయమై మాత్రం డిబేట్ జరగలేదు. హోంమంత్రి షిండే, ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, మరో మంత్రి జైపాల్‌రెడ్డి గార్లు మాత్రమే మాట్లాడారు. ముగ్గురూ విభజనను సమర్థిస్తున్న వారే! వ్యతిరేకిస్తున్న వారికెవ్వరికీ మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. యూపీఏని సమర్థిస్తున్న డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ వారికి గాని, సీపీఎం వారికి గాని, ఎన్డీఏలోని శివసేన, బీజేపీ, జేడీ(యూ) తదితరులెవ్వ రికీ విభజన బిల్లుని వ్యతిరేకిస్తూ మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.) 367 (2) ‘ఆయ్’ అన్న వారి నుండి వెలువడిన శబ్దాన్నీ, ‘నో’ అన్న వారి నుండి వెలువడిన శబ్దాన్నీ బట్టి స్పీకర్ అంచనా వేసుకుని, ‘ఆయ్’ ఎక్కువ మంది అనో, ‘నో’ అన్నవారు ఎక్కువ మంది అనో ప్రకటిస్తారు. ఆ ప్రకటనకు సభ నుంచి ఏ రకమైన వ్యతిరేక స్పందనా లేకపోతే రెండుసార్లు ‘ఆయ్’లు అధికం అనో, స్పీకర్ సభ నిర్ణయం ‘ఆమోదించబడింది’ అనో, ‘వ్యతిరేకించబడింది’ అనో సభా నిర్ణయం ప్రకటించాలి. 367 (3)(ఎ) ‘ఆయ్’లు ఎక్కువో ‘నో’ ఎక్కువో స్పీకర్ ప్రకటించినప్పుడు, స్పీకర్ అభిప్రాయాన్ని సవాల్ చేస్తే, స్పీకర్ ‘లాబీ’ ఖాళీ చెయ్యమని ఆదేశిం చాలి. (‘లాబీ’ అంటే లోక్‌సభ వరండా... అక్కడిదాకా మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇతర స్టాఫ్ వెళ్లడా నికి అనుమతి ఉంది. స్పీకర్ ఆదేశాల మేరకు, ఓటింగ్ జరపడానికి వీలుగా ‘లాబీ’ ఖాళీ చేయిస్తారు.) (బి) ఆ తర్వాత, మూడు నిమిషాల ముప్పై సెకన్లు సమయం గడిచిన తర్వాత, మరోసారి ‘స్పీకర్’ ప్రశ్నను మళ్లీ సభముందు చదవాలి. మళ్లీ అనుకూలురు ‘ఆయ్’ అనమని, వ్యతిరేకులు ‘నో’ అనమని కోరాలి. (సి) స్పీకర్ మళ్లీ ప్రకటించిన తర్వాత కూడా ఆ నిర్ణయాన్ని సభ్యులెవరైనా సవాల్ చేస్తే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా సభ్యుల అభిప్రాయాన్ని తెలియజేయ మని గానీ, లేదా ‘ఆయ్’-‘నో’ ముద్రించబడిన స్లిప్పులు సభ్యులకందించి అభిప్రాయం తెలియజేయ మని గానీ, లేదా ‘ఆయ్’ సభ్యులు లాబీ (వరండా)లో ఒకవైపునకు ‘నో’ సభ్యులు మరొకవైపునకు వెళ్లమని ఆదేశించాలి. ఒకవేళ అనవసరంగా ‘డివిజన్’ (ఓటింగ్) అడుగు తున్నారు అని స్పీకర్ భావించినట్లయితే , ‘ఆయ్’ (అను కూలురు) అందరూ నిలబడండి అని వారిని లెక్కపెట్టి ‘నో’ (వ్యతిరేకులు) అందరూ నిలబడండి అని వారిని లెక్కపెట్టి - సభా నిర్ణయం ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు విషయమై ‘డివిజన్’ (ఓటింగ్) అనవసరంగా అడుగుతున్నారని స్పీకర్ భావించారు. 367(3)సికి అనుబంధంగా రాయబడిన ‘తలలు లెక్కపెట్టే’ పద్ధతిని ఎంచుకున్నారు. (ఈ విధంగా ‘డివిజన్’ నిరాకరించటం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని ‘కౌల్ అండ్ షక్దర్’ ప్రాక్టీసు అండ్ ప్రొసీ జర్ ఆఫ్ పార్లమెంట్ బుక్‌లో చూశాను. 1955లోనూ 1956లో ఒకసారి మాత్రమే ‘డివిజన్’ నిరాకరించటం జరిగింది.) మొట్టమొదటి లోక్‌సభ జరుగుతున్నప్పుడు, 1955 లోనూ 1956లోనూ, స్పీకర్ ‘డివిజన్’ నిరాకరించి అధికార పక్షానికి అనుకూలంగా ‘ఆమోదం’ ప్రకటించ టం జరిగింది. ఆ రోజుల్లో, కాంగ్రెస్ సభ్యులు 364 మంది, కమ్యూనిస్టు 16, సోషలిస్టు 12, కిసాన్ మజ్దూర్ పార్టీ 9, పీడీఎఫ్ 7... మొత్తం 409 మంది సభ్యులలో 364. అంటే మూడింట రెండొంతుల మెజారిటీతో, అవసరమనుకుంటే ‘రాజ్యాంగ సవరణ’ కూడా ఒక్క కాంగ్రెస్ వారే చేసేయగలిగిన స్థాయిలో సంఖ్యాబలం కలిగి ఉన్నారు. 28.7.55న ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ (ఎమెండ్మెంట్) బిల్లుకు ప్రతిపాదించబడిన సవరణ విషయమై ‘డివిజన్’ నిరాకరించబడింది. సవరణకు అనుకూలంగా కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఉన్నారని, వ్యతిరేకంగా చాలా ఎక్కువ మెజారిటీ ఉందని ప్రకటిస్తూ డిప్యూటీ స్పీకర్ సవరణ వీగిపోయి నట్లు ప్రకటించారు. 19.4.1956న అప్పటి హోంమంత్రి గోవింద వల్లభ్ పంత్, గతంలో ప్రవేశపెట్టిన 6వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించుకోవటానికి సభ అనుమతి కోరారు. కొన్ని మార్పులు చేసి మళ్లీ బిల్లు ప్రవేశపెడతా మని కూడా చెప్పారు. ‘నో’ డివిజన్ కావాల్సిందే... మాకు సరైన నోటీసివ్వలేదన్నారు, ప్రతిపక్ష సభ్యులు. ‘ఆయ్’ ఎక్కువ మంది ఉన్నారు. అయినా ఇంత చిన్న విషయాలలో ‘డివిజన్’ కోరి సభాసమయాన్ని వృథా చేయటం కరెక్ట్ కాదు అన్నారు స్పీకర్. 1. ‘మూజువాణి’ అనే పదం ఉర్దూ భాషకు చెంది నది. మూహ్జుబానీ అంటే నోటితో వ్యక్తపరిచేది. ‘ఆయ్’ అనో ‘నో’ అనో నోటితో చేసే ధ్వని ద్వారా ఫలితం నిర్ణయించబడితే, దానిని మూజువాణి ఓటుతో ప్రతిపాదన ఆమోదించబడిందనో, వీగి పోయిందనో ప్రకటిస్తారు. 2. డివిజన్ - అంటే విభజించమని కోరటం. సభా ధ్యక్షులు మూజువాణి ఓటుతో ప్రతిపాదన వీగిం దనో, గెలిచిందనో ప్రకటించినప్పుడు సభ్యు లెవ్వరూ ఆ ప్రకటనతో విభేదించకపోతే, వాయిస్ ఓటు (మూజువాణి ఓటు)తో అధ్యక్షుని ప్రకటన ఆమోదించబడినట్లే... ఏ సభ్యుడైనా ‘డివిజన్’ కోరితే, స్పీకర్‌గాని అధ్యక్ష స్థానంలో ఉన్న మరెవ్వరైనా గానీ, ఓటింగ్ నిర్వహించి ‘అనుకూలం’ ఎందరో ‘వ్యతిరేకం’ ఎందరో ‘తటస్థం’ ఎందరో సంఖ్యాపరంగా ప్రకటించి ‘ప్రతిపాదన’ ఆమో దించారో, తిరస్కరించారో ప్రకటించాలి. ‘డివిజన్’ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకూ ఏ సభలోనైనా, ఏ అంశంలోనైనా సభాభిప్రాయం తేలవల్సింది ‘డివిజన్’ ద్వారానే! వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com - ఉండవల్లి అరుణ్‌కుమార్ -
ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళన
కరీంనగర్(కలెక్టరేట్): ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎంఎస్ఎఫ్ నాయకులు సోమవారం మోకాళ్లపై నించోని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఈ విషయంపై ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రంతో చర్చించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.