అసలు తలలే లెక్కపెట్టలేదు!
(పార్లమెంటులో ఏం జరిగింది-40)
ధర్మ సంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. ఇదే నేను చేసింది. శ్రీరాముడు వాలిని చంపినప్పుడు, రావణాసురుణ్ణి చంపినప్పుడు ఏ ధర్మం పాటించాడో మనమూ అదే చేశాం.
జైపాల్‌రెడ్డి: రైటయినా, తప్పయినా, ఈ క్షణానికి ఇది తప్ప మనం ఇంకేమీ చెయ్యలేం! కేసీఆర్ నిరాహార దీక్ష విరమించేసినా... లేదు లేదు చచ్చిపోతున్నాడంటూ డిసెంబర్ 2009 మొదటి వారాంతంలో, మనం ఢిల్లీలో చేసిన ప్రచారం, ఆ ప్రచారం నిజం కాదని అందరికీ తెల్సినా... నిజమేనన్నట్లు చిదంబరం తెలంగాణ ప్రకటన చేయటం... ఆ రోజుతో ప్రారంభమయ్యింది, కేసీఆర్ నాయకత్వం బలపడటం...! అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి అనే చిదంబరం ప్రకటనలో ‘మెలిక’ అర్థం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాల ప్రహసనంతో మరింత బలపడింది కేసీఆర్ నాయకత్వం!! తెలంగాణ ఇవ్వవలసింది పార్లమెంట్ అని తెలిసీ.. 2009 తర్వాత కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంట్‌కు వచ్చాడు!? మీరిన్ని రోజులు లోక్‌సభను స్తంభింపచేశారు. ఒక్కరోజైనా మీతో కేసీఆర్ వచ్చాడా..! కేసీఆర్ కాంగ్రెస్‌లో చేరిపోతే మంచిదే. అతనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతాడు... ఈ రోజు నన్నెలా స్పీకర్ దగ్గరకి తోడ్కొని పోయారో, అలాగే కేసీఆర్‌ని కాంగ్రెస్‌లోకి తోడ్కొనిరండి! ఈ రోజు స్పీకర్ బిల్లు పాసయ్యిందని ప్రకటించి తీరాలి. కమల్‌నాథ్, సుష్మాస్వరాజ్ అవునవునంటూ బల్లలు చరుస్తారు. గత్యంతరం లేదు వాళ్లలాగ చేయక తప్పదు...!!
ధర్మసంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. ఇదే నేను చేసింది. శ్రీరాముడు వాలిని చంపినప్పుడు, రావణాసురుణ్ణి చంపినప్పుడు ఏ ధర్మం పాటించాడో మనమూ అదే చేశాం. మహా భారతయుద్ధంలో భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణీ ఆఖరికి దుర్యోధనుణ్ణి ఎవర్నీ రూల్ ప్రకారం పోరాడి చంపలేదు. మనమూ అంతే చేశాం! ఆఖరి నిమిషంలో మనం చేసిన ప్రయత్నం వల్లనే ఈ బిల్లు పాసయ్యిందంటూ మనం ప్రజల ముందు చెప్పుకుంటానికి మాత్రం అవకాశం లేదు. అలా చెప్పుకున్న మరుక్షణం, మనం అధర్మపరులం అయిపోతాం. దయచేసి ఎవ్వరూ ఆ ఆలోచన చెయ్యకండి! రాజ్యాంగ మర్యాదల్ని కొంతవరకూ పాటించకతప్పదు. తెలంగాణా ఏర్పడటం తక్షణ అవసరంగా భావించే నేనీవిధంగా ప్రవర్తించాను. నౌ ఆర్ నెవ్వర్!! ఇప్పుడైతే అయినటు..్ల లేకపోతే ఎప్పటికీ తెలంగాణా ఏర్పడదు. ఏర్పడినా, ఇంతే అనుకూలమైన బిల్లు ఎప్పటికీ రాదు. నా బాధ్యత నేను నిర్వర్తించాను. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి.
కేసీఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించటమే మీ బాధ్యత. మాటిచ్చాడు గదా అని మాత్రం ధీమాగా ఉండకండి. తెలంగాణ కోసం నేనేమైనా మాట్లాడతాను, సమయానికి ఎవరి కాళ్లైనా పట్టుకుంటాను అని చెప్పాడు. కేసీఆర్! మెంటల్‌గా ప్రజల్ని ప్రిపేర్ చేసి వుంచాడు. రేపు కాంగ్రెస్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసినా, ప్రజలు అతనినే నమ్ముతారు కానీ మనల్ని నమ్మరు. రెండ్రోజుల్లో రాజ్యసభలో పాసయి పోతుంది... మరో పది రోజుల్లో ప్రెసిడెంట్ సంతకం కూడా అయిపోతుంది. ఈ లోగా కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ కల్సిపోవాలి! మీరు ఆ పనిలో ఉండండి.''
గత నాలుగు ఆర్టికల్స్, నేను రాసినవి. ఊహించి రాసినవి. ఆ విషయం ముందే చెప్పాను. ఇది నా విశ్లేషణ మాత్రమే! ‘‘18 ఫిబ్రవరి 2014న స్పీకర్ ఛాంబర్‌లో నేనూ, కమల్‌నాథ్, సుష్మాస్వరాజ్‌ల మధ్య రాజీ కుదిర్చాను’’ అని చేసిన జైపాల్‌రెడ్డిగారి ప్రకటన ఆధారంగా, జైపాల్‌రెడ్డిగారి ఉపన్యాస శైలితో పరిచయం వున్న వ్యక్తిగా ఆ కీలకమైన గంటలో, ఏం జరిగి వుండవచ్చునో, ఊహించి రాశాను. జైపాల్‌రెడ్డి గారు రూల్ ప్రకారం తలలు లెక్కపెట్టినట్లు నటించమని చెప్పారు. కానీ స్పీకర్ గారు ఒకటి రెండు సవరణలకి లెక్క పెట్టినట్లు ‘‘అనుకూలం 169 వ్యతిరేకం 6 అంటూ ప్రకటించారు గానీ ఆ తర్వాత అసలు లెక్కించలేదు.
కనీసం తలలైనా లెక్క పెట్టి ఎంత మంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరేకమో చెప్పండంటూ అసదుద్దీన్ ఒవైసీ పదే పదే స్పీకర్‌ని అడగటం జరిగింది గానీ, స్పీకర్ మాత్రం లెక్కించనే లేదు! సవరణ చదవటం, వీగిపోయిందంటూ ప్రకటించటం.. జరిగిపోయింది!! ఈ ప్రక్రియ రూల్ వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం కూడా!! జైపాల్‌రెడ్డి గారు నేను అభిమానించే రాజనీతిజ్ఞుడు. తెలంగాణా విషయంలో మాత్రం ఆయన సగటు రాజకీయ నాయకుడి గానే ప్రవర్తించారని నేననుకుంటు న్నాను. అలా ఎందుకనుకుంటున్నానో కూడా వివరిస్తాను.
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు:
- ఉండవల్లి అరుణ్‌కుమార్
a_vundavalli@yahoo.com