కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్ పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. నియోజకవర్గస్థాయిల్లో పేరున్న నేతలతో పాటు అర్ధబలం, అంగబలం, సామాజికవర్గాల్లో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరడమే ఖాయమని భావించిన స్థానిక మైత్రి గ్రూప్ అధినేత కొత్త జయపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరేందుకే మొగ్గుచూపినట్లు సమాచారం.
ఈ మేరకు హైదరాబాద్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్‌లు సంప్రదింపులు జరిపి పార్టీలో చేరే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా సమ్మతించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణకే కేంద్ర బిందువుగా ఉన్న ఉమ్మడి జిల్లా నుంచి రానున్న ఎన్నికల్లో మరోసారి విజయ ఢంగా మోగించేందుకు బీఆర్‌ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
జిల్లాకేంద్రంలో బలమైన సామాజిక వర్గం, గ్రానైట్, రియల్టర్, మీడియా గ్రూప్‌ల్లో భాగస్వామ్యుడైన కొత్త జయపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో మంతనాలు జరపడం, రాష్ట్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ చెప్పడం, వారం రోజుల్లోనే పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేయడంపై జిల్లాలో రాజకీయ చర్చ మొదలైంది. కొత్త జయపాల్‌రెడ్డి గతంలో నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయత్వంతో సంప్రదింపులు జరపడం, కరీంనగర్ బీజేపీ టికెట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు పూర్తయ్యాయని కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఖాయమైందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది.
కరీంనగర్ బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో రెండు పార్టీల్లో నుంచి సరియైన సంకేతాలు రాకపోవడంతో జయపాల్‌రెడ్డి గమ్ముగా ఉన్నారు. దీంతో మంత్రి గంగుల అధిష్టానంతో కొత్త జయపాల్‌రెడ్డి చేరికతో లాభనష్టాలపై పార్టీకి విన్నవించడంతో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.
త్వరలో మరిన్ని చేరికలు..
బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలు కొద్ది రోజుల్లోనే ఆయా పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల్లో స్తబ్దత నెలకొనడం.. అధికార బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వెళ్తుండడంతో ఆయా పార్టీల్లో గుర్తింపు లేని లీడర్లు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమయం వరకు చేరికలు భారీగా ఉంటాయని ఆ పార్టీ లీడర్లు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment