సాక్షిప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ పోరు నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. వివిధ పార్టీల అగ్రనేతల రాకతో రాజకీయ సందడి నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా ఆయా పార్టీల ముఖ్య నాయకులు సభలతో ఎన్నికల శంఖారావం పూరించారు. గత ఆదివారానికి(అమావాస్య) ముందు మంచి రోజులు లేవు. దీంతో ప్రచార రథాలు సిద్ధమైనా బయటకు తీయలేదు. అడపాదడపా గ్రామాలకు వెళ్లడం మినహా సీరియస్‌గా ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు శ్రీకారం చుట్టలేదు.
ఈ నెల 15 నుంచి మంచి రోజులు ప్రారంభమవడం, ఆరోజు నుంచే అగ్రనేతల పర్యటనలతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా గల్లీల్లో డప్పుచప్పుళ్లతో, బతుకమ్మలు, బోనాలు, బైక్ ర్యాలీలతో ప్రచార స్పీడ్ పెంచారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న దరిమిలా.. కారు పార్టీ బీఆర్‌ఎస్ ప్రచారంలో రెండడుగులు ముందే ఉంది. బీజేపీ, హస్తం పార్టీలు దసరా తర్వాత మరింత దూకుడుగా వెళ్లనున్నాయి.
కారుకు కంచుకోట..
అందరి కంటే ముందే అభ్యర్థుల ప్రకటన, బీఫాంలు అందజేసిన కారు పార్టీ ప్రచారంలో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. దీనికితోడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించింది. ఉద్యమ కాలం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కారుకు కంచుకోట. ఈసారి పాత 12 స్థానాలతోపాటు చాలా కాలంగా ఊరిస్తున్న 13వ స్థానం కూడా దక్కించుకోవాలన్న ఫార్ములాతో ముందుకు సాగుతోంది.
ఈసారి సీఎం కేసీఆర్ తొలి బహిరంగ సభను హుస్నాబాద్ కేంద్రంగా నిర్వహించి, ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలోనూ ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వచ్చ నెల మొదటి వారంలో సీఎం సభలను ధర్మపురి, కోరుట్ల, పెద్దపల్లి, మంథనిల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్‌లలో నిర్వహించిన ప్ర జాఆశీర్వాద సభతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.
కాంగ్రెస్ రెండో జాబితాపై ఉత్కంఠ!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. గత గురువారం మొదటిరోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంథని, పెద్దపల్లి, కరీంనగర్‌లో రోడ్ షో, బహిరంగ సభ, పాదయాత్ర ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపారు. విజయభేరి యాత్రలో భాగంగా రెండో రోజు జగిత్యాల, కోరుట్ల కా ర్నర్ మీటింగ్‌లో ఆరు గ్యారెంటీలను వివరించారు. మిగిలిన ఏడు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటిస్తే.. కాంగ్రెస్ ప్రచారం మరింత ఊపందుకోనుంది.
బీజేపీ నాయకులు బిజీబిజీ..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ప్రకటన, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాని మోదీ రెండు సభల్లో పాల్గొన్ని, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హుజూరాబాద్ కేంద్రంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడుతుండటంతో కావాల్సిన సరంజామా సమకూర్చుకునే పనిలో బీజేపీ నాయకులు బిజీబిజీగా గడుపుతున్నారు.
చదవండి: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు.. 13 శాఖలను గుర్తించిన ఈసీ..
Comments
Please login to add a commentAdd a comment