కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ బరిలో ఎంపీ బండి సంజయ్ ఈసారి ఉండేది అనుమానమే. ఇక్కడి నుంచి గత పార్లమెంటు ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆయన ఈసారి లోక్‌సభ బరికే మొగ్గుచూపుతున్నారని సమాచారం. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి, తన ప్రత్యర్థి, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌పై హోరాహోరీగా పోరాడారు.
మొత్తం బీజేపీకి 66,009 ఓట్లు పోలవ్వగా, బీఆర్‌ఎస్‌కు 80,983 ఓట్లు వచ్చాయి. 14,974 ఓట్ల మెజారిటీతో గంగుల విజయబావుటా ఎగురవేశారు. ప్రతి రౌండ్‌లోనూ గట్టి పోటీ ఇచ్చి, కొన్ని సందర్భాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బండితో విజయం దోబూచులాడింది. ఆ సానుభూతి 2019 పార్లమెంటు ఎన్నికల్లో బాగా పని చేసింది.
ఆ సమయంలో పుల్వామా దాడులు, పాకిస్తాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్, సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం వెరసి.. జాతీయభావం ఎన్నికపై బాగా ప్రభావం చూపింది. దీనికితోడు బండి సంజయ్‌కి స్థానికుల నుంచి సానుభూతి వెల్లువెత్తడంతో ఎంపీగా ఘన విజయం సాధించారు. మొత్తం 4,98,276 ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి బి.వినోద్‌కుమార్‌పై 89,508 ఓట్ల తేడాతో గెలుపొందారు.
కేంద్ర కేబినెట్ పక్కా అన్న హామీతోనే..
మొన్నటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ సంజయ్ తన హయాంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు తెప్పించారు. మునుగోడు బైపోల్‌లోనూ చివరికి వరకు బీజేపీ పోరాడింది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ఉన్న 7 శాతం ఓటుబ్యాంకును 32 శాతానికి తీసుకురావడంలో సఫలీకృతుడయ్యారు.
ఒక దశలో బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరగగా అనూహ్య పరిస్థితుల మధ్య రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ తాను కరీంనగర్ నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని సన్నిహితులతో, మీడియాతో చెబుతూ వచ్చారు. అసలు ఆ ఉద్దేశంతోనే పార్టీలో నగరంపై ఎవరికీ పట్టు చిక్కకుండా వ్యూహాత్మకంగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ అంటూ ఐదు భాగాలుగా విభజించారు.
కానీ, ఇప్పుడు ఆకస్మికంగా కరీంనగర్ అసెంబ్లీ రేసు నుంచి సంజయ్ వైదొలగబోతున్నారన్న ప్రచారంపై ఆయన అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్రంలో మూడోసారి కూడా మోదీ ప్రభుత్వమే కొలువుదీరనుందని, ఈసారి పార్లమెంటుకు ఎన్నికై తే బండికి కేంద్ర కేబినెట్‌లో స్థానం పక్కా అన్న హామీ మేరకే ఆయన లోకసభపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ ప్రచారంపై మరో రెండు రోజుల్లో బండి సంజయ్ నుంచి ప్రకటన రానుంది.
అసెంబ్లీ, పార్లమెంటు సీట్లకు తీవ్ర పోటీ..
ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్నాక కరీంనగర్ అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో పోటీకి ఆశావహులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఒకవేళ నిజంగానే ఆయన పోటీ చేయకపోతే.. ఎవరిని రంగంలోకి దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ బీజేపీలో చేరి, అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈసారి తనకు కరీంనగర్ లోకసభ నుంచి అవకాశం ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత పొల్సాని సుగుణాకర్‌రావు ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి విన్నవించారు. మొన్నటిదాకా సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ, పార్లమెంటు రెండు సీట్లకూ పోటీ చేస్తారన్న ప్రచారంతో వీరెవరూ ముందుకు వచ్చే సాహసం చేయలేదు. కానీ, తాజా ప్రచారంతో బీజేపీలోని ఆశావహులంతా ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment