కరీంనగర్: 108.. ఇది ఎమర్జెన్సీ అంబులెన్స్ నంబర్ కాదు.. అదేదో వ్రతం కోసం గుడి చుట్టూ చేసే ప్రదక్షిణలు కావు.. వచ్చే డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు కాస్త అటూ ఇటుగా ఉన్న రోజులు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుంటున్న అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు తమ కళ్ల ముందు మెదులుతున్న ఖర్చుల కొండను తలుచుకొని, బెంబేలెత్తుతున్నారు.
అధికార బీఆర్‌ఎస్ ఎన్నికలకు సమరశంఖం పూరించడం, మరోవైపు మిగిలిన పార్టీల్లోనూ ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. కానీ ఎన్నికల్లో రానురాను ఖర్చులు పెరుగుతుండటం అభ్యర్థులను కలవరపెడుతోంది. నామినేషన్, ప్రచారం, పోలింగ్ ఇవన్నీ ఒక ఎత్తయితే, దానికి ముందే ఎన్నికల వాతావరణం రావడంతో ఇటు కేడర్‌ను, అటు ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు రూ.లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఓటర్లు మొదలుకొని కార్యకర్త, నాయకుల వరకు ఇప్పటికే మర్యాదలు మొదలయ్యాయి.
వెళ్లాల్సిందే.. కట్నాలు చదివించాల్సిందే..
ప్రతీ నియోజకవర్గంలో అన్ని రకాల కులాలు, మతాల ఓటర్లు ఉంటారు. మహిళలు, వృద్ధులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, దివ్యాంగులు, వితంతువులు.. ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఆశావహులదే. ఇందుకు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు ఎవరూ అతీతులు కారు. దీంతో ఇకపై నియోజకవర్గంలో జరిగే ప్రతీ పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చావు, పుట్టుక, పుట్టిన రోజు, పెళ్లిరోజు, సారీ ఫంక్షన్, సంతాప సభ, సన్మానాలు, కులసంఘాల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు, ఉద్యోగ విరమణల నుంచి గృహ ప్రవేశాల వరకు ప్రతీ సందర్భానికి వెళ్లాల్సిందే.. కట్నకానుకలు చదివించాల్సిందే.
డజన్‌కు పైగా పండుగలు
ఈ నెల 25న వరలక్ష్మీ వ్రతం, 31న రాఖీ, సెప్టెంబర్ 6న కృష్ణాష్టమి, 18న వినాయక చవితి, 28న వినా యక నిమజ్జనం/మిలాద్–ఉన్–నబీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి, 23న సద్దుల బతుకమ్మ, 24న దసరా, నవంబర్ 13న దీపావళి, 14న బాలల దినోత్సవం, 27న కార్తీక పౌర్ణమి.. ఇలా ఎన్నికలు ముగిసేలోగా.. డజన్‌కు పైగా పండుగలను ప్రజలు గుర్తుంచుకునేలా జరిపే బాధ్యత లీడర్లదే.
ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధం
జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలనుకునేవా రు, ఈసారి కాకుంటే ఇంకెప్పటికీ కాలేమన్న ఆలోచనలో ఉన్నవారు ఈసారి సర్వశక్తులు ఒడ్డేందుకు ముందుకొస్తున్నారు. చివరికి పార్టీలో, నలుగురిలో తాము ధనవంతులమే అని చాటుకునేందుకు తమ ఆస్తులు అమ్మేందుకు, కుదవపెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ రోజుల్లో నాయకుడు బయటికి వ చ్చాడంటే.. కనీసం నాలుగైదు కార్లు తప్పనిసరి.
వాటిలో పెట్రోలు కొట్టించాలి. ఒక్కో కారులో ఐదారుగురు అనుచరులు, కాన్వాయ్ రాగానే జిందాబాద్‌కొట్టేందుకు యువత, జెండాలతో తిరిగే కార్యకర్తలు, మంగళహారతులు ఇచ్చేందుకు మహిళలు ఉండాలి. ప్రతీ నాయకుడు కనీసం 100 మందికి ఈ మూడు నెలలపాటు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలు ఇవ్వాల్సిందే. వారి వాహనాల్లో పెట్రోలు కొట్టించడం, భోజనాలు, చేతి ఖర్చులు, రాత్రిపూట రాచమర్యాదలు సరేసరి. ఎంత లేదన్నా రూ.2, 3 కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
‘కోడ్’ కూశాక అసలు ఆట
ఈ 108 రోజుల్లో కేడర్‌ను చూసుకునేందుకు రోజుకు రూ.లక్ష అయినా ఖర్చవుతుంది. ఇక దసరాకు కాస్త అటూఇటుగా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలున్నాయి. అధికార పార్టీకి అంతోఇంతో పార్టీ నుంచి, వివిధ వర్గాల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. కానీ, ప్రతిపక్షాలకు ఆ అవకాశాలు చాలా తక్కువ. పోస్టర్లు, ప్రచారం, సభలు, సమావేశాలు, యాడ్స్, ఫ్లెక్సీలు, ఇంటింటి ప్రచారాలు, పాదయాత్రలు అంటూ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆశావహుల జేబులకు చిల్లులు పడేది ఈ సమయంలోనే.
అటు తర్వాత చేసే ఖర్చు లెక్కలను ఎన్నికల సంఘానికి చెప్పాల్సి ఉంటుంది. బయటకు కనబడకుండా ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు పరిమితికి మించి ఖర్చు చేయాలి. అదే సమయంలో పక్కనే ఉంటూ వైరిపక్షాలకు సాయపడే వెన్నుపోటుదారులను తలచుకొని, నేతలు గుబులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment