సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. ఎన్నికల సంఘం పర్యటన మొదలైన దరిమిలా అధికార పార్టీ కూడా అభివృద్ధి పనుల శంకుస్థాపనల స్పీడ్ పెంచింది. అవే వేదికలపై ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. తమను మరోసారి గెలిపిస్తే.. ఇంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ వస్తే.. రాష్ట్రం అధోగతి పాలవుతుందని మాటలదాడి చేస్తున్నారు.
ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు అంతా అభివృద్ధి పనుల స్పీడ్ పెంచారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల పనులు, పెండింగ్ పనులు పూర్తిచేయడం, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, దళితబంధు జాబితా ఎంపిక, పింఛన్లు పంపిణీ, రోడ్లు, మున్సిపల్ వర్క్స్ తదితరాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వేగం పెంచారు. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏదిచేసినా ఈనెల 6– నుంచి 14 తేదీలోగా పూర్తిచేయాలన్న పార్టీ అధిష్టానం సూచనలతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
60 ఏళ్లలో పాత జిల్లాలో జరిగిన అభివృద్ధి, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తాము దేశంలో ముందున్నామని వివరిస్తున్నారు. 13 నియోజకవర్గాల్లో ప్రతీరోజూ చేరికల పర్వంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్దపల్లి, జగిత్యాల, రామగుండం, ధర్మపురిలో అభివృద్ధి పనులను ప్రారంభించి ఎన్నికల సమరశంఖం పూరించారు. మినీ బహిరంగసభలతో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
ఎమ్మెల్యేల ప్రైవేట్ కార్యాలయాలు సిద్ధం..
ఎన్నికలకు ముందస్తు వ్యూహంతో వచ్చిన భారత రాష్ట సమితి(బీఆర్‌ఎస్) ముందే అభ్యర్థులను ప్రకటించింది. వాస్తవానికి మరునాటి నుంచే అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మధ్యలో జమిలి ఎన్నికల ప్రస్తావనతో కాస్త విరామం ప్రకటించారు. ఇటీవల జమిలి లేదని తేలడంతో తిరిగి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వేదికలపై నుంచి తమ అభివృద్ధి వివరిస్తూనే.. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
త్వరలోనే ఎన్నికల షెడ్యూలు విడుదలవనున్న నేపథ్యంలో క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఇప్పటికే అందరికీ అందుబాటులో ఉండేలా వారంతా ప్రైవేట్ కార్యాలయాలను కిరాయికి తీసుకోవడం విశేషం. మరోవైపు.. సోషల్ మీడియాను కూడా బలోపేతం చేసుకుంటున్నారు. ప్రతీ గ్రామంలో సోషల్ మీడియా ఆర్మీలను నియమించుకుంటున్నారు. పర్వదినాలు, పండుగలు, పరామర్శలు.. ఇలా సందర్భమేదైనా ముందుంటున్నారు.
కాంగ్రెస్, బీజేపీలో రాని స్పష్టత..
ఉమ్మడి జిల్లా నుంచి 13 నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ నుంచి 85 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు అదేసంఖ్యలో బీజేపీ నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇంతవరకూ రెండుపార్టీలు ఒక్కఅభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించలేదు.
పాత కరీంనగర్ జిల్లాలో ఒకటిరెండుచోట్ల మినహా అన్నిస్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారన్న ప్రచారం ఉన్నా.. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థుల విషయంలో ఇదేరకమైన అనిశ్చితి నెలకొంది. దీన్నిఅవకాశంగా తీసుకున్న బీఆర్‌ఎస్.. మరింత దూకుడు పెంచుతోంది. 11మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రతీరోజు సుడిగాలి పర్యటనలు చేస్తూ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
బీఎస్పీ జాబితా విడుదల..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఎస్పీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మూడు ఎస్సీ స్థానాలు, ఒకటి జనరల్ కావడం విశేషం. నిశాని రామచందర్ –మానకొండూరు, చొప్పదండి– కొంకటి శేఖర్, ధర్మపురి– నక్కా విజయ్‌కుమార్, పెద్దపల్లి–దాసరి ఉష పేర్లు ఖరారు చేసింది.
ఇందులో అభ్యర్థులంతా ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీచేస్తామని తాజాగా ప్రకటించిన జనసేన పార్టీ.. పాత కరీంనగర్ జిల్లాలో నాలుగు స్థానాలపై కన్నేసింది. రామగుండం, హుస్నాబాద్, జగిత్యాల, మంథని స్థానాల నుంచి తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment