సాక్షి, కరీంనగర్: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రజాభిమానం ఉన్న కొందరు నాయకులు స్వతంత్రులుగా పోటీ చేసి, విజయబావుటా ఎగురవేశారు. ప్రజాబలం ముందు పార్టీ సింబల్ బలాదూర్ అని నిరూపించారు. 1952 నుంచి 2018 వరకు 15 సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి.
1994 వరకు (ఉప ఎన్నికలతో కలిపి) 15 మంది స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి, దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. గెలిచాక వివిధ పార్టీల్లో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే గొట్టె భూపతి వరుసగా రెండుసార్లు రిజర్వ్‌డ్ స్థానం(నేరెళ్ల) నుంచి పోటీ చేసి, ప్రజా నాయకుడని నిరూపించుకున్నారు.
నియోజకవర్గాల వారీగా గెలిచినవారు..
1952లో మెట్‌పల్లి నుంచి జి.భూమయ్య, 1957లో హుజూరాబాద్ నుంచి పి.నర్సింగరావు, 1957లో హుజూరాబాద్ ద్వినియోజకవర్గం నుంచి జి.రాములు, 1962లో జగిత్యాల నుంచి ఎం.ధర్మారావు, 1962లో బుగ్గారం నుంచి ఎ.నారాయణరెడ్డి, 1967లో నేరెళ్ల నుంచి జి.భూపతి, 1967లో మెట్‌పల్లి నుంచి సీహెచ్.సత్యనారాయణరావు, 1967లో పెద్దపల్లి నుంచి జె.మల్లారెడ్డి, 1972లో నేరెళ్ల నుంచి జి.భూపతి, 1972లో బుగ్గారం నుంచి జె.దామోదర్‌రావు, 1972లో కమలాపూర్ నుంచి పి.జనార్ధన్‌రెడ్డి, 1989లో హుజూరాబాద్ నుంచి కె.సాయిరెడ్డి, 1989లో బుగ్గారం నుంచి జె.రత్నాకర్‌రావు, 1989లో కరీంనగర్ నుంచి వి.జగపతిరావు, 1994లో మేడారం నుంచి మాలెం మల్లేశం గెలుపొందారు. ఆ తర్వాత స్వతంత్రులకు ఆదరణ కరువైంది.
Comments
Please login to add a commentAdd a comment