పొలిటికల్‌ పటాకులు.. పేలుతున్న డైలాగులు! | - | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ పటాకులు.. పేలుతున్న డైలాగులు!

Published Sun, Nov 12 2023 1:24 AM | Last Updated on Sun, Nov 12 2023 10:57 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఐదేళ్లకోసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల పండుగకు ఈసారి దీపావళి తోడైంది. ఈ వేడుకలు అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ గుర్తుకువచ్చేది టపాసులే. తోకబాంబుల నుంచి చిచ్చుబుడ్లు, రాకెట్లు, బాంబులు, భూచక్రాలు తదితరాలను ఎంతో ఇష్టపడి కాలుస్తుంటారు. ఓవైపు దీపావళికి జనాలు సిద్ధమవుతున్న తరుణంలో నాయకులు తమ విమర్శలకు పదును పెడుతున్నారు.

మాటలను తూటాలుగా చేసి, ప్రత్యర్థులపై సంధిస్తున్నారు. సీనియర్‌ నాయకులు మరో అడుగు ముందుకేసి, తమ ఆరోపణాస్త్రాలను టపాసుల్లా పేలుస్తున్నారు. తమ నోటి నుంచి వచ్చే ఆరోపణలు, మాటలు, హామీలను చిచ్చుబుడ్డి, రాకెట్‌, భూచక్రాలు, తోక పటాకుల్లా సందర్భాన్ని బట్టి తమకు అనుకూలంగా మలచుకొని, ప్రయోగిస్తున్నారు. ఇవి పేలగానే జనాలు చప్పట్లతో స్వాగతిస్తున్నారు. అలాంటి తూటాల్లాంటి మాటలు కొన్నింటిని గుర్తు చేసుకుందాం!

తెలంగాణతో నాది కుటుంబ బంధం!
ఇటీవల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అనేక పంచ్‌ డైలాగులు విసిరారు. అందులో తెలంగాణతో నాది రాజకీయ బంధం కాదు, కుటుంబ బంధం అంటూ సభికులను కలుపుకుపోతూ చెప్పిన మాటలు వారి మనసును రాకెట్లలా తాకాయి.

రాహుల్‌కు ఎద్దు ఎరుకనా? ఎవుసం ఎరుకనా?
ఇటీవల ధర్మపురిలో సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ను విమర్శించారు. ఈ క్రమంలో రాహుల్‌కు ఎద్దు ఎరుకనా? ఎవుసం ఎరుకనా? ఏమీ తెలియని వాడు కూడా ధరణిని తొలగిస్తాం అంటున్నాడని వ్యాఖ్యానించారు.

గులుగుడు గులుగుడే.. గుద్దుడు.. గుద్దుడే!
సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ కొన్ని రోజులుగా ప్రతీ వేదిక మీద చెబుతున్న భూచక్రాల్లాంటి మాటలివి. ప్రజలంతా తమవైపే ఉన్నారని, ఒకరిద్దరు వ్యతిరేకంగా ఉన్నా.. కారుకే ఓటేస్తారని చెప్పే క్రమంలో గులుగుడు.. గులుగుడే.. గుద్దుడు.. గుద్దుడే అన్న మాటలు ట్రెండ్‌ అవుతున్నాయి.

సంక్షేమమా? సంక్షోభమా?
హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్‌కు హాజరైన మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే ఈటల మాటలకు మోసపోవద్దని, బీఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని అన్నారు. సంక్షోభం కావాలా? సంక్షేమం కావాలా? తేల్చుకోవాలని ప్రజలను కోరారు.

ఐదేళ్లు నా రక్తం ధారపోస్తా!
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో 20 రోజులు కష్టపడండి.. రాబోయే ఐదేళ్లు నా రక్తాన్ని ధారపోస్తా అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్న మాటలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతున్నాయి.

ఇక్కడే పుట్టిన.. ఈ గడ్డ మీద పెరిగిన
నేను ఇక్కడే పుట్టిన.. ఈ గడ్డ మీద పెరిగిన.. ఇక్కడ గాలి పీల్చి న.. మీతోనే ఎదిగిన.. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న.. అని బీఆర్‌ఎస్‌ కో రుట్ల అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ అ న్నారు. వాళ్లంతా ఎన్నికల టైంలో వచ్చేటోళ్లు.. మళ్లీ కనబడరు.. యాదించుకోండ్రి.. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సీఎంకు గుంట భూమి ఎక్కువ..
ధరణి పోర్టల్‌ను విమర్శించే క్రమంలో 53 ఎకరాల 30 గుంటలకు బదులు 53 ఎకరాల 31 గుంటలు చూపిస్తోంది అని సీఎం కేసీఆర్‌ అఫిడవిట్‌ను చూపిస్తూ బండి సంజయ్‌కుమార్‌ చేసిన కామెంట్లు చిచ్చుబుడ్డిలా పేలుతున్నాయి.

రైతు రాజ్యమా? రాబంధుల రాజ్యమా?
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంట్‌, రుణమాఫీ లాంటి పథకాలతో రైతులు సుభిక్షంగా ఉండేలా చర్యలు తీసుకుందని బీఆర్‌ఎస్‌ జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ వారు వస్తే మూడు గంటల కరెంట్‌, ధరణిని ఎత్తివేస్తామంటూ, రైతుబంధును కుదిస్తామంటూ మాట్లాడుతున్నారని.. రైతు రాజ్యం కావాలో.. రాబంధుల రాజ్యం కావాలో తేల్చుకోవాలని జగిత్యాల ప్రజలను కోరారు.
ఇవి చదవండి: విభిన్న తీర్పు! ప్రస్తుత ఎన్నికల ట్రెండ్‌పై సర్వత్రా ఆరా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement