కరీంనగర్: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) తన అభ్యర్థులను ప్రకటించింది. 13 అసెంబ్లీ స్థానాలున్న విశాల ఉమ్మడి జిల్లా అభ్యర్థుల జాబితాను సోమవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించగానే.. పాత జిల్లాలో గులాబీ శ్రేణుల సంబురాలు మొదలయ్యాయి. ఇటీవల జాబితాలో ఉమ్మడి జిల్లాలో భారీగా మార్పులు ఉంటాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో సీఎం జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కానీ.. పాత జిల్లాలో పదిమందిని పాత వారిని, ముగ్గురు కొత్తవారి పేర్లు ప్రకటించి సీఎం.. అందరి అంచనాలను తలకిందులు చేశారు. అంతా ఊహించినట్లుగా వేములవాడ అభ్యర్థిని అందరి కంటే ముందే మారుస్తున్నామని సీఎం ప్రకటించారు. పౌరసత్వం వివాదంలో ఆయన మార్పు అనివార్యమైందని వివరించారు. ఆయన స్థానంలో చెలిమెడ లక్ష్మీనర్సింహారావు పేరును ఖరారు చేశారు.
కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు కుమారుడు డాక్టర్ కె.సంజయ్‌ను ప్రకటించారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యాసాగర్‌రావు కోరిక మేరకు సంజయ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇక హుజూరాబాద్‌లో అంతా అనుకున్నట్లుగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు సిట్టింగులను మార్చగా ఇందులో జిల్లాకు చెందినవారే ఇద్దరు కావడం విశేషం.
పదిమంది పాతకాపులే..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడుస్థానాల్లో అభ్యర్థులు మారగా, మిగిలిన 10 స్థానాల్లో సీనియర్లే ఉన్నారు. అందులో సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్, కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీచేస్తారు.
చొప్పదండి నుంచి సుంకె రవిశంకర్, మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్, హుస్నాబాద్ నుంచి సతీశ్‌బాబు, జగిత్యాల నుంచి సంజయ్, పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం నుంచి కోరుకంటి చందర్, మంథని నుంచి పుట్ట మధు బరిలో దిగనున్నారు. ఇందులో సిరిసిల్ల, కరీంనగర్, హుస్నాబాద్, మానకొండూరు, జగిత్యాల మినహా మిగిలిన చొప్పదండి, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథనిలో ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు వీచాయి.
మంత్రి ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అదే సమయంలో చొప్పదండి, రామగుండం, మంథని, పెద్దపల్లి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు తిరుగుబాటు చేశారు. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఈశ్వర్‌ల చొరవతో అవన్నీ సద్దుమణిగాయి.
కులాల వారీగా..
13 అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు ఓసీ అభ్యర్థులు ఉన్నారు. ముగ్గురు బీసీలు, ముగ్గురు ఎస్సీలకు అవకాశం దక్కింది. ఇందులో కేటీఆర్, డాక్టర్ సంజయ్, డాక్టర్ కె.సంజయ్‌కుమార్, చలిమెడ లక్ష్మీనర్సింహరావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌ది రెడ్డి సామాజిక వర్గం.
హుస్నాబాద్ నుంచి సతీశ్‌బాబు బ్రాహ్మణ(కరణం) కాగా, కరీంనగర్ నుంచి కమలాకర్, రామగుండం నుంచి కోరుకంటి చందర్, మంథని నుంచి పుట్ట మధు.. ఈ ముగ్గురూ మున్నూరుకాపు సామాజికవర్గం వారు కావడం విశేషం. సుంకె రవిశంకర్(చొప్పదండి), రసమయి బాలకిషన్(మానకొండూరు) మాదిగ, కొప్పుల ఈశ్వర్(ధర్మపురి) మాల సామాజిక వర్గానికి చెందివారు కావడం గమనార్హం.
ఏడుగురు మూడోసారి..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాతజిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు నాయకులు బీఆర్‌ఎస్ టికెట్‌పై మూడోసారి పోటీ చేస్తున్నారు. అందులో కేటీఆర్(సిరిసిల్ల), సతీశ్‌బాబు(హుస్నాబాద్), మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి), పుట్ట మధు(మంథని), గంగుల కమలాకర్ (కరీంనగర్), కొప్పుల ఈశ్వర్(ధర్మపురి), రసమయి బాలకిషన్ (మానకొండూరు) ఉన్నారు.
డాక్టర్ సంజయ్(జగిత్యాల), సుంకె రవిశంకర్(చొప్పదండి) రెండోసారి బీఆర్‌ఎస్ టికెట్‌పై బరిలోకి దిగనున్నారు. ఇక మిగిలిన నలుగురు లక్ష్మీనర్సింహారావు(వేములవాడ), పాడికౌశిక్‌రెడ్డి(హుజూరాబాద్), డాక్టర్ కె.సంజయ్ (కోరుట్ల), కోరుకంటి చందర్(రామగుండం) తొలిసారిగా బీఆర్‌ఎస్ బీఫాం మీద పోటీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment