కరీంనగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కుమ్మక్కయినట్లు జరుగుతున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాను పార్లమెంట్ సమావేశాలు, అమెరికా పర్యటనలో ఉండడంతోనే కోర్టుకు హాజరుకాలేకపోయానని తెలిపారు.
గురువారం కరీంనగర్‌లోని తన నివాసంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి దీక్ష ను భగ్నం చేసి, కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించారు. రాష్రాన్ని రూ.5.5 లక్షల కోట్ల అప్పుల పాలుజేసి, కేసీఆర్ చెల్లని రూపాయిలా మారారని ఎద్దేవా చేశారు. ఓవైసీ చెబితేనే సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించారని ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.
తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో క్లారిటీ ఉందని, ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే కరీంనగర్ అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో గంజాయి ఏరు లై పారిస్తూ యువతను చిత్తు చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు గంజాయిని కంట్రోల్ చేయని పక్షంలో తామే యువకులతో దళాలను ఏర్పాటు చేసి కట్టడిచేస్తామని ప్రకటించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండబోరనే హామీ ఏమైంది?
రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండబోరని ప్రకటించిన కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment