సాక్షి, కరీంనగర్: మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించి, జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17కు ఒక విశిష్టత ఉందని, 75 ఏళ్లక్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు.
వీరులకు జోహార్లు..
ఇటీవలే దేశస్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నామని, దానికి కొనసాగింపుగానే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆదివాసీ వీరుడు కుమ్రంభీం, దొడ్డి కొమురయ్యతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు బద్ధం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్ వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకోవాలని సూచించారు.
చేతివృత్తులకు చేయూత..
చేతివృత్తిదారుల జీవనాన్ని మెరుగుపర్చేందుకు బీసీ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 1,700మందికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 174మందికి రూ.లక్ష చొప్పున రూ.1.74 కోట్ల విలువైన చెక్కులు అందించామని అన్నారు.
అవార్డుల్లో ప్రథమం..
దివ్యాంగులకు ఫించన్ రూ.4016కు పెంచామని, బీడీ టేకేదారులకు రూ.2016 అందిస్తున్నట్లు తెలి పారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని 15గ్రామాలకు స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ–2023 అవార్డులు, గన్నేరువరం మండలం ఖాసింపేట, రామడుగు మండలం వెలిచాల రాష్ట్రస్థాయి అవార్డులు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు.
అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో దళితబంధు ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే మొట్టమొదటగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,021 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున రూ.1784 కోట్లు అందించినట్లు తెలి పారు. జిల్లాలోని 49,544మంది రైతుల బ్యాంకుఖాతాల్లో రూ.261.19 కోట్లు జమచేశామన్నారు.
వైద్యరంగానికి పెద్దపీట..
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఏ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కళాశాలలను స్థాపించుకున్నామని, 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయని అన్నారు. నగరం ఏ మూలన చూసిన అద్భుతమైన రోడ్లు, విద్యుత్‌లైట్లు, కేబుల్‌బ్రిడ్జితో విరాజిల్లుతోందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద వాటర్ ఫౌంటెన్ పనులు ఏడాదిలో పూర్తిచేసి, బోటింగ్ ఏర్పాటు చేస్తామని వివరించారు.
సత్కారాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు!
అనంతరం మంత్రి కమలాకర్ స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై.సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ.రామక్రిష్ణారావు, కలెక్టర్ గోపి, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ అనిల్‌కుమార్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment