TS Karimnagar Assembly Constituency: TS Election 2023: ఉద్యోగులూ.. జాగ్రత్త! ప్రచారానికి పోతే సస్పెన్షన్‌ వేటే!
Sakshi News home page

TS Election 2023: ఉద్యోగులూ.. జాగ్రత్త! ప్రచారానికి పోతే సస్పెన్షన్‌ వేటే!

Published Thu, Oct 12 2023 5:02 AM | Last Updated on Thu, Oct 12 2023 8:59 AM

- - Sakshi

కరీంనగర్‌: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది. ఎన్నికల నిబంధనల అమలులో ఉన్నతాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా సస్పెన్షన్‌ వేటు పడనుంది. కేవలం తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయొద్దని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. నిరంతర నిఘాతోపాటు వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగాం పోస్టులపైనా ఓ కన్నేశారు.

సభలు.. సమావేశాలు వద్దు..
ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకుని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొంటే వేటు పడినట్లే. దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు ఎన్నికల అధికారులకు అందినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా జరగాల్సిన నష్టం జరుగుతుంది.

నిరంతర నిఘా ఉంటున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాలకు హాజరుకాకపోవడమే ఉత్తమం. గతంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రాగానే అంగన్‌వాడీలపై వేటు వేశారు. అప్పట్లో అంగన్‌వాడీ, ఐకేపీ సిబ్బంది ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫోన్లు చేసి, మద్దతు కోరినా దయచేసి తమను ఎన్నికల్లోకి లాగొద్దని కోరుతున్నారు.

సెల్‌ఫోన్లతో కష్టాలు..
స్మార్ట్‌ఫోన్లలో అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. తొలుత విధుల నుంచి తొలగించాకే మరో ఆలోచన ఉంటుంది.

ఉద్యోగులు ఎటువైపు?
ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలముంటే, మరికొన్ని ప్రతికూలమంటున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఆశించిన ప్రయోజనాలను కల్పించలేకపోయిందన్న ఆరోపణలున్న నేపథ్యంలో వారి తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సీపీఎస్‌ విధానంపై ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. పాత పెన్షన్‌ విధానాన్ని ఎవరు అమలుపరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

► ‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీందర్‌ బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించాడని ఫిర్యాదులొచ్చాయి. రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరుపగా నిజమేనని తేలడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు.’

► ‘2018 ఎన్నికల్లోనే చొప్పదండి మండలంలోని ఆర్నకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులొచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆయనను సస్పెండ్‌ చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయారు.’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement