కరీంనగర్: కరీంనగర్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. విదేశాల నుంచి మన దేశానికి వచ్చే పర్యాటకులు కరీంనగర్‌ను ఎంచుకునేలా నగరం మారబోతోందన్నారు. నూతనంగా నిర్మించిన గణేశ్‌నగర్ బైపాస్ రోడ్డును గురువారం ఆయన ప్రారంభించారు.
అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌పై వీధి దీపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. భావితరాలకు అద్భుతమైన నగరాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా ఎల్‌ఎండీ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు నీటిని నిలిపి, బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ తనకు ఇష్టమైన ప్రాజెక్టు అని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందబోతుందని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అద్భుతమైన ఫౌంటెయిన్‌లలో మొదటిది యోషోలో, రెండోది చైనాలో ఉన్నాయని, మూడోది కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని, నగర అభివృద్ధి, ప్రజల సంతోషమే ముఖ్యమన్నారు. గణేశ్‌నగర్ రోడ్డుకు డ్రైనేజీతో సమస్య ఉండేదని, అయితే దాన్నే మాయం చేయాలన్న ఆలోచనతో రోడ్డు నిర్మించామని తెలిపారు. నగరంలో మరో రూ.130 కోట్లతో అంతర్గత రోడ్లు నిర్మిస్తామన్నారు.
కేసీఆర్.. మరోసారి సీఎం..
ఎన్నికలు వస్తున్నాయని, కేసీఆర్ మరోసారి సీఎం అవడం ఖాయమని మంత్రి గంగుల అన్నారు. మేయర్ యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ.. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గణేశ్‌నగర్ బైపాస్ రోడ్డును మంత్రి చేతులమీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళా వాకర్స్ ఇబ్బంది పడకుండా అంబేడ్కర్ స్టేడియంలో లైట్లు, ప్రత్యేకంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు.
కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రణాళిక ప్రకా రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తాను తమిళనాడుతోపాటు తెలంగాణలోని పలు పట్ట ణాలను చూశానన్నారు. కానీ కరీంనగర్ బా గుందని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి, మేయర్‌లకు కాలనీవాసులు మంగళహారతులతో స్వాగతం పలికి, సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment