ఎన్నిక లయ్యాకే రెండు రాష్ట్రాల ఏర్పాటు?
సాంకేతిక ఇబ్బందులు దాటాకే అధికారిక విభజన
సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలంటున్న సీమాంధ్ర నేతలు
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయా, లేక రెండు రాష్ట్రాలు విడిపోయాకా? విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఈ అంశంపై చర్చ సాగుతోంది. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని సీమాంధ్ర నేతలు, కొత్త రాష్ట్రాల్లోనేనని తెలంగాణ నేతలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక అమలు తేదీ (అపాయింటెడ్ డే) నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా రెండుగా విడిపోతుంది. అప్పటి నుంచి రెండు అసెంబ్లీలుంటాయి. ఇద్దరు సీఎంలుంటారు. అయితే ఆ అపాయింటెడ్ డే ఎప్పుడన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తెలంగాణ బిల్లును కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి పంపిస్తుంది. దానిపై ఆయన లాంఛనంగా ఆమోదముద్ర వేశాక గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. అపాయింటెడ్ డేను అందులోనే రాష్ట్రపతి నిర్దేశిస్తారు.
ప్రస్తుత బిల్లులో సాంకేతిక లోపాలున్నాయి. పైగా ఆస్తులు అప్పులు, ఆదాయాల పంపిణీ ఉద్యోగుల కేటాయింపు వంటి కీలకాంశాలు పూర్తవాల్సి ఉంది. అందుకు కనీసం నాలుగైదు నెలలైనా పడుతుందని అంచనా. కానీ మార్చి తొలి వారంలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుంది. షెడ్యూలు వచ్చిందంటే అధికార యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణలోనే తలమునకలై ఉంటుంది. సాధారణ పరిపాలనా వ్యవహారాలు తప్ప ఆ సమయంలో మరే కార్యక్రమమూ చేపట్టే వీలుండదు. కాబట్టి ఎన్నికలయ్యేదాకా అధికారిక విభజన వీలు కాదన్నది సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అంచనా. పైగా విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లోనూ ఎస్సీ, ఎస్టీల జనాభాలో తేడా వచ్చి, ఆ మేరకు చట్టసభల్లో వారి రిజర్వేషన్లు కూడా సమస్యగా మారతాయి. ఎందుకంటే ఇప్పుడు సమైక్య రాష్ట్రం యూనిట్‌గా ఉన్న ఎస్సీ, ఎస్టీ స్థానాలను విభజన అనంతరం ఒక్కో రాష్ట్రాన్నీ యూనిట్‌గా తీసుకుని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. లేదంటే వారికి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం దక్కదు.
రాజకీయంగా కూడా
రాజకీయంగా చూసుకున్నా ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే పూర్తయితేనే మేలని అధిష్టానం భావిస్తోందని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఆస్తులు అప్పులు, ఆదాయాలు, ఉద్యోగుల పంపిణీ, పెన్షన్‌దారుల వ్యవహారాలను ప్రస్తుత పరిస్థితుల్లో హడావుడిగా తలకెత్తుకోవడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఈ అంశాల్లో ఇరు ప్రాంతాల నేతలు, ఉద్యోగ సంఘాలు, తదితర సంస్థల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని బిల్లులో పేర్కొనగా, తెలంగాణ నేతలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పెన్షనర్ల భారం కూడా ఇరు ప్రాంతాల మధ్య విభేదాలకు దారితీసేలా ఉంది.
సాగునీరు, విద్యుత్తు తదితరాల పంపిణీ కూడా జటిలంగానే కన్పిస్తోంది. ఇలాంటి సున్నితమైన అంశాలను ఎన్నికల ముందు తెరపైకి తెస్తే రెండు చోట్లా పార్టీ దెబ్బ తింటుందని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తే, ఈ సమస్యలనే సాకుగా చూపి, ‘మీకే ఎక్కువ న్యాయం చేస్తాం’ అని ఇరు ప్రాంతాల్లోనూ ప్రచారం చేయించి లబ్ధి పొందవచ్చన్న ఆలోచన ఉందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలను అధికారికంగా ఏర్పాటు చేయాలంటున్నారు. ఏదో సాకు చూపి వాయిదా వేస్తే ప్రక్రియ చిక్కుల్లో పడుతుందంటున్నారు. చిన్న చిన్న సమస్యలేమైనా ఉంటే అధికారికంగా విడివడ్డాక పరిష్కారమవుతాయన్నది వారి వాదన.