ఉమ్మడి ఆస్తులు, అప్పుల్లో సింహభాగం తెలంగాణకే!
‘పవర్’ పంపకాలకు రంగం సిద్ధంఆస్తుల విభజన ముసాయిదాకు ఏపీ జెన్‌కో బోర్డు ఆమోదం
హైదరాబాద్: విద్యుత్ సంస్థల ఉమ్మడి ఆస్తులు, అప్పులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంచేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఏపీ ఉత్పాదక సంస్థ పాలక మండలి(అవిభక్త రాష్ట్రంలోని ఏపీ జెన్‌కో బోర్డు) ఆమోదించింది. దీన్ని కేంద్రం నియమించిన షీలాబిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీకి సమర్పించింది. ఈ వివరాలను బుధవారం అధికారవర్గాలు విడుదల చేశాయి. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించి మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం 2014 మే 31న విడుదల చేయడం, దీనిప్రకారం బ్యాలెన్స్ షీట్‌ను రూపొందించే బాధ్యతలను కేపీఎంజీ సంస్థకు అప్పగించడం తెలిసిందే. కేంద్రచట్టానికి అనుగుణంగా కేపీఎంజీ రూపొందించిన ముసాయిదాను ఏపీజెన్‌కో ఆమోదించడంతో ఓ అంకం ముగిసింది. అయితే ముసాయిదాపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు, విద్యుత్ సంస్థలు తమ అభ్యంతరాల్ని నిపుణుల కమిటీకి తెలపాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించాక కమిటీ తుదినిర్ణయం తీసుకుంటుంది. అయితే కమిటీ కాలపరిమితి ఈ నెల 31వరకే ఉంది. దీన్ని కేంద్రం పొడిగించే అవకాశముంది. మొత్తంమీద మరో ఆరు నెలల్లో ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవుతుందని అధికారులు అంటున్నారు.
తెలంగాణకే అప్పులు, ఆస్తులు..
ఉమ్మడి ఆస్తులు, అప్పుల్లో సింహభాగం తెలంగాణకే వెళ్తున్నాయి. అవిభక్త రాష్ట్రంలో ప్రతిపాదిత విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టుల్లో ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయి. కేటీపీపీ-2, లోయర్ జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల, ఎగువ జూరాల.. ఇలా మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నాయి. స్థానికతనుబట్టి ఇవన్నీ తెలంగాణకే చెందుతాయి. కాబట్టి వీటి నిర్మాణానికి తీసుకున్న అప్పులన్నీ ఆ రాష్ట్రమే భరించాలని ముసాయిదా పేర్కొంది. అలాగే ఈ ప్రాజెక్టుల స్థిరాస్తులన్నీ తెలంగాణకే సొంతం. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీపీపీ-4 మాత్రమే నిర్మాణ దశలో ఉంది. దీని వ్యయం, స్థిరాస్తిని ఆ రాష్ట్రఖాతాలో చేర్చారు. ఫలితంగా రూ.7,168 కోట్లున్న నిర్మాణ వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,201 కోట్లు, తెలంగాణకు రూ.4,967 కోట్లుగా విభజించారు. జెన్‌కో ప్రాజెక్టుల ప్రధాన కార్యాలయాలు, యంత్రసామాగ్రీ తెలంగాణలోనే ఉన్నందున స్థిరాస్తులు(ఇప్పుడున్నవి, కొత్త ప్రాజెక్టులు) రూ.12,748 కోట్లు ఉంటే.. ఇందులో ఏపీకి రూ.4,947 కోట్లు, తెలంగాణకు రూ.7,801 కోట్లు చొప్పున వాటా దక్కుతుంది. ఈ ప్రకారం మూలధనం, ఆదాయం, దీర్ఘ, స్వల్పకాలిక రుణాలు, ఇతర అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకే ఎక్కువగా ఉంటాయి.