ఏపీకి ఎన్‌ఐడీఎం హుళక్కే!
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం) రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి ష్టాత్మక ఎన్‌ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న కేంద్రప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ప్రాంతీయ కేంద్రంతో సరిపుచ్చే దిశగా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ విషయమై కేంద్ర హోంశాఖ అధికారిని ‘సాక్షి’ సంప్రదించగా రాష్ట్రానికి ఎన్‌ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని తాజాగా సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పునర్విభజన చట్టం ప్రకారం...
విపత్తుల నిర్వహణకు సంబంధించి విధి విధానాలు రూపొందించే, ప్రాంతీయ కేంద్రాలను పర్యవేక్షించే కీలకమైన ఎన్‌ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని ఏపీలో నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎన్‌ఐడీఎం ప్రధాన కార్యాలయం ఉన్నా దానికి అవసరమైన హంగులేమీ లేవు. చిన్న కార్యాలయంలోనే ఇది నడుస్తోంది.
సువిశాల తీరప్రాంతమున్న ఏపీలో పూర్తిస్థాయి ఎన్‌ఐడీఎం కేంద్ర కార్యాలయాన్ని నిర్మించి ఢిల్లీలోని ప్రస్తుత కార్యాలయాన్ని ప్రాంతీయ కేంద్రంగా మార్చాలని అప్పట్లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకు స్థలం కేటాయించాలనీ రాష్ట్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో జాతీయ విపత్తు సహాయదళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) కోసం గతంలో కేటాయించిన 50 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుని జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ నిర్మాణ పనులు ఆరంభించినా రాష్ట్ర ప్రభుత్వం భూమిని వెనక్కు తీసుకోవడంపై సంబంధిత అధికారులు కినుక వహించారు.
‘ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు కేటాయించిన భూమిని నిర్మాణ పనులు ఆరంభించిన తర్వాత వెనక్కు తీసుకోవడం ఏమిటి? మరెక్కడా రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు భూమి లేదా?’ అని కేంద్ర హోంశాఖ అధికారులు అంతర్గతంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐడీఎంకు స్థలం కేటాయింపులోనూ జాప్యం చేయడంతో ఏపీలో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందని నిర్ణయించారు. ఎన్‌ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న ఢిల్లీలోనే కొంతకాలం కొనసాగించి తర్వాత అవసరమైతే వేరే రాష్ట్రంలో నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం గమనార్హం. రాష్ట్రానికి వచ్చిన సంస్థను పోగొట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును అధికారులు తప్పుబడుతున్నారు.
గన్నవరం మండలంలో...
గన్నవరం మండలంలో వంద ఎకరాల్లో ఎన్‌ఐడీఎం, 50 ఎకరాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, 50 ఎకరాల్లో రాష్ట్ర విపత్తు సహాయ దళం(ఎస్‌డీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ శాఖ కోరింది. తదుపరి కేంద్రం ఎన్‌ఐడీఎం విషయంలో నిర్ణయం మార్చుకున్నందున దీనికి పది ఎకరాలే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు.