NIDM
-
త్వరలోనే థర్డ్ వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు ముగిసిపోయి, మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కొంత నెమ్మదించినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. సెప్టెంబర్–అక్టోబర్ నెలల మధ్య ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించింది. థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించాలంటే కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి త్వరగా టీకా ఇవ్వాలని సూచించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) సమర్పించింది. మూడో వేవ్‌లో పెద్దలకు ఉన్నట్లే చిన్నారులకు సైతం కరోనా ముప్పు ఉంటుందని తెలిపింది. భారీ సంఖ్యలో పిల్లలు వైరస్ బారినపడితే చికిత్స అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం కొత్త వేరియంట్లతో ముప్పు జనాభాలో 67 శాతం మందిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా యాంటీబాడీలు పెరిగితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లేనని నిపుణుల కమిటీ గతంలో అభిప్రాయపడింది. ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం హెర్డ్ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాల్సిందేనని తాజాగా తెలిపింది. ఒకసారి సోకిన కరోనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా శరీరంలో పెరిగిన రోగ నిరోధక శక్తి నుంచి కొత్త వేరియంట్లు తప్పించుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. కొత్త వేరియంట్ల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వీలుగా సామూహిక నిరోధకత సాధించడానికి జనాభాలో 80–90 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం కావాలని తెలిపింది. సామూహిక నిరోధకత సాధించేదాకా.. భారత్‌లో ఇప్పటిదాకా 7.6 శాతం మందికే (10.4 కోట్లు) పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని నిపుణుల కమిటీ తెలిపింది. వ్యాక్సినేషన్లో వేగం పెంచకపోతే థర్డ్ వేవ్‌లో నిత్యం 6 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని తేల్చిచెప్పింది. ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా సామూహిక నిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించేదాకా కరోనాలో కొత్త వేవ్‌లు వస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు అంచనా వేశారని గుర్తుచేసింది. కరోనా నియంత్రణ నిబంధనలను ఎత్తివేయడాన్ని బట్టి ఇండియాలో థర్డ్ వేవ్ మూడు రకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ–కాన్పూర్ నిపుణులు గతంలో తెలిపారు. ఒకటి.. థర్డ్ వేవ్ అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 3.2 పాజిటివ్ కేసులు వెలుగు చూస్తాయి. రెండోది.. అధిక తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో థర్డ్ వేవ్ సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రతిరోజూ 5 లక్షల కేసులు బయటపడతాయి. ఇక మూడోది.. అక్టోబర్ మాసాంతంలో థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 2 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతాయి. వైరస్‌లో మార్పులు.. పిల్లలకు సవాలే థర్డ్ వేవ్‌లో పెద్దల కంటే పిల్లలే అధికంగా ప్రభావితం అవుతారని చెప్పడానికి ఇప్పటివరకైతే తగినంత సమాచారం లేదని నిపుణులు కమిటీ వివరించింది. కరోనా వైరస్‌లో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అవి పిల్లలకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని గుర్తుచేసింది. ఒకవేళ చిన్నారులకు కరోనా సోకినా అసలు లక్షణాలేవీ కనిపించకపోవడం, స్వల్పంగా కనిపించడం వంటివి ఉంటాయని వివరించింది. వారు అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నవారైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో 60–70 శాతం మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పిల్లల్లో అపాయకరమైన ఎంఐఎస్–సి(మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్) తలెత్తే అవకాశం ఉందని నిపుణుల కమిటీ తన నివేదికలో తెలియజేసింది. చదవండి:Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..! ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకొస్తేనే థర్డ్ వేవ్ కరోనాలో డెల్టా కంటే ఎక్కువ తీవ్రత కలిగిన కొత్త వేరియంట్ ఉద్భవిస్తే థర్డ్ వేవ్ నవంబర్‌లో గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ప్రముఖ సైంటిస్టు మహీంద్ర అగర్వాల్ సోమవారం చెప్పారు. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికి పూర్తి క్రియాశీలకంగా మారుతుందని అన్నారు. డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకురాకపోతే థర్డ్ వేవ్ దాదాపు రానట్లేనని అగర్వాల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి కొత్త వేరియంట్ బయటపడితే మూడో వేవ్‌లో నిత్యం 1.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
Covid-19: భారత్‌లో అక్టోబర్‌లో థర్డ్‌వేవ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల నుంచి భారత్‌లో సెకండ్ వేవ్ ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తుంది. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. త్వరలో థర్డ్ వేవ్ రానుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లో అక్టోబర్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు పీఎంవోకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం) నిపుణుల కమిటీ నివేదిక అందజేసింది. ఇక థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఎన్ఐడీఎం హెచ్చరించింది. (చదవండి: 4 నెలలు.. రూ.900 కోట్ల నష్టం) థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యం కోసం సన్నద్ధం కావాలని ఎన్ఐడీఎం సూచించింది. థర్డ్‌వేవ్ సమయంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని నివేదికలో వెల్లడించారు. ఇక చిన్న పిల్లలకు వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని సూచించారు. వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని తెలిపారు. దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉండగా.. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎన్ఐడీఎం నివేదిక తెలిపింది. థర్డ్‌వేవ్ ముప్పును దృష్టిలో పెట్టుకుని వైద్యుల కొరత, ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. చదవండి: పిల్లలకూ కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. ఎలా పనిచేస్తుంది? -
ఏడాదిలోపే ఎన్ఐడీఎం నిర్మాణం: రిజిజు
సాక్షి, గన్నవరం : నేషనల్ ఇనిస్టిట్యూట్ డిజాస్టర్ మేనేజిమెంట్ సౌత్ క్యాంపస్ కార్యాలయానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఏపీ పునర్విభజనలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను కేంద్ర ప్రభుత్వం కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ ఈ ప్రాంత ప్రతిష్ట పెంచనుంది. ఎన్ఐడీఎం చుట్టుపక్కల చాలా ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. 400 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ వివిధ సంస్థలు వస్తున్నాయి. గతేడాది శంకుస్థాపన చేసిన ఎన్డీయేఎఫ్ బెటాలియన్ నిర్మాణాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. వాటిని త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజును కోరుతున్నా. కాలం గతి తప్పుతోంది. రుతువులు క్రమం తప్పుతున్నాయి. దీనికి మనం చేస్తున్న పనులు కూడా కారణం. ప్రకృతితో సహజీవనం చేయటం అలవర్చుకోవాలి. భూమి,నీరు, ఆకాశం, వెలుతురుని సద్వినియోగం చేసుకోవాలి. అతిపెద్ద కోస్త తీరప్రాంతం ఉన్న ఏపీకి ఎన్ఐడీఎం ఎంతో అవసరం. అతి తక్కువ కాలంలో ఎక్కువ సంస్థలు రాష్ట్రానికి వచ్చేలా చూసా. ప్రకృతి వైపరీత్యాల నివారణలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. విపత్తులను ఎదుర్కోవడంలో ఏపీ అధికారులకు అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు పెను సవాల్‌గా పరిణమించాయి.’ అని అన్నారు. ఏడాదిలోపే ఎన్ఐడీఎం నిర్మాణం: రిజిజు విపత్తు నిర్వహణ విషయంలో దేశవ్యాప్తంగా రెండువేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు కింద పనులు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అందులో ఏపీలో మెజార్టీ కార్యాకలాపాలు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. కొండపావులూరులో ఎన్ఐడీఎం నిర్మాణం ఏడాదిలోపే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని తెలిపారు. కాగా అతి పెద్ద కోస్తా తీరం, దక్కన్ పీఠభూమి, పశ్చిమ కనుమలతో ఉండే దక్షిణ భారతదేశంలో విపత్తులకు ఆస్కారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సెంటర్ ద్వారా విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడంతో పాటు ఎదుర్కొనే సత్తా ఎన్డీఆర్ఎఫ్కు ఉంది. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లాలో ఎన్ఐడీఎం ‘దక్షిణ’ క్యాంపస్
సాక్షి, అమరావతి : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడీఎం) దక్షిణ భారత క్యాంపస్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. కృష్ణా జిల్లా కొండపావులూరులో దీనిని నిర్మించనున్నారు. ప్రస్తుతం దేశం మొత్తానికి ఢిల్లీలో ఒక్కచోటే ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయం ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం ఎన్ఐడీఎం దక్షిణ భారత క్యాంపస్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విపత్తులను ఎదుర్కోవడంపై శిక్షణ ఇవ్వడం, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం పెంచడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. మొదట దీనిని గుంటూరు జిల్లాలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే దీనికి కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో ఎన్ఐడీఎం ఏర్పాటులో జాప్యం అనివార్యమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్ఐడీఎంకు స్థలం కేటాయించింది. దీనిని పరిశీలించిన ఎన్ఐడీఎం ప్రతినిధులు ఇక్కడ కేంద్రం ఏర్పాటుకు సమ్మతించారు. 12 రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలకు ఇది సేవలందించనుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు సహాయక దళాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. కొండపావులూరులో ఎన్ఐడీఎం ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులు అంగీకరించారని, త్వరలో నిర్మాణ పనులు చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. 2016 – 17 బడ్జెట్లోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ఐడీఎం ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించింది. -
ఏపీకి ఎన్ఐడీఎం హుళక్కే!
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం) రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి ష్టాత్మక ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న కేంద్రప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ప్రాంతీయ కేంద్రంతో సరిపుచ్చే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ అధికారిని ‘సాక్షి’ సంప్రదించగా రాష్ట్రానికి ఎన్ఐడీఎం ప్రాంతీయ కేంద్రంతో సరిపెట్టాలని తాజాగా సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం... విపత్తుల నిర్వహణకు సంబంధించి విధి విధానాలు రూపొందించే, ప్రాంతీయ కేంద్రాలను పర్యవేక్షించే కీలకమైన ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని ఏపీలో నెలకొల్పుతామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయం ఉన్నా దానికి అవసరమైన హంగులేమీ లేవు. చిన్న కార్యాలయంలోనే ఇది నడుస్తోంది. సువిశాల తీరప్రాంతమున్న ఏపీలో పూర్తిస్థాయి ఎన్ఐడీఎం కేంద్ర కార్యాలయాన్ని నిర్మించి ఢిల్లీలోని ప్రస్తుత కార్యాలయాన్ని ప్రాంతీయ కేంద్రంగా మార్చాలని అప్పట్లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకు స్థలం కేటాయించాలనీ రాష్ట్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో జాతీయ విపత్తు సహాయదళం(ఎన్డీఆర్ఎఫ్) కోసం గతంలో కేటాయించిన 50 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుని జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ నిర్మాణ పనులు ఆరంభించినా రాష్ట్ర ప్రభుత్వం భూమిని వెనక్కు తీసుకోవడంపై సంబంధిత అధికారులు కినుక వహించారు. ‘ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు కేటాయించిన భూమిని నిర్మాణ పనులు ఆరంభించిన తర్వాత వెనక్కు తీసుకోవడం ఏమిటి? మరెక్కడా రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు భూమి లేదా?’ అని కేంద్ర హోంశాఖ అధికారులు అంతర్గతంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్ఐడీఎంకు స్థలం కేటాయింపులోనూ జాప్యం చేయడంతో ఏపీలో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందని నిర్ణయించారు. ఎన్ఐడీఎం ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న ఢిల్లీలోనే కొంతకాలం కొనసాగించి తర్వాత అవసరమైతే వేరే రాష్ట్రంలో నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం గమనార్హం. రాష్ట్రానికి వచ్చిన సంస్థను పోగొట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును అధికారులు తప్పుబడుతున్నారు. గన్నవరం మండలంలో... గన్నవరం మండలంలో వంద ఎకరాల్లో ఎన్ఐడీఎం, 50 ఎకరాల్లో ఎన్డీఆర్ఎఫ్, 50 ఎకరాల్లో రాష్ట్ర విపత్తు సహాయ దళం(ఎస్డీఆర్ఎఫ్) ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ శాఖ కోరింది. తదుపరి కేంద్రం ఎన్ఐడీఎం విషయంలో నిర్ణయం మార్చుకున్నందున దీనికి పది ఎకరాలే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు.