త్వరలోనే థర్డ్‌ వేవ్‌! | Experts warn of imminent third wave of COVID-19 in September and October | Sakshi
Sakshi News home page

త్వరలోనే థర్డ్‌ వేవ్‌!

Published Tue, Aug 24 2021 4:36 AM | Last Updated on Tue, Aug 24 2021 8:28 AM

Experts warn of imminent third wave of COVID-19 in September and October  - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దాదాపు ముగిసిపోయి, మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కొంత నెమ్మదించినప్పటికీ థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. సెప్టెంబర్‌–అక్టోబర్‌ నెలల మధ్య ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించింది. థర్డ్‌ వేవ్‌ తీవ్రతను తగ్గించాలంటే కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి త్వరగా టీకా ఇవ్వాలని సూచించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) సమర్పించింది. మూడో వేవ్‌లో పెద్దలకు ఉన్నట్లే చిన్నారులకు సైతం కరోనా ముప్పు  ఉంటుందని తెలిపింది. భారీ సంఖ్యలో పిల్లలు వైరస్‌ బారినపడితే చికిత్స అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం

కొత్త వేరియంట్లతో ముప్పు
జనాభాలో 67 శాతం మందిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్‌ లేదా వ్యాక్సినేషన్‌ ద్వారా యాంటీబాడీలు పెరిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించినట్లేనని నిపుణుల కమిటీ గతంలో అభిప్రాయపడింది. ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం హెర్డ్‌ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాల్సిందేనని తాజాగా తెలిపింది. ఒకసారి సోకిన కరోనా ఇన్ఫెక్షన్‌ లేదా వ్యాక్సినేషన్‌ ద్వారా శరీరంలో పెరిగిన రోగ నిరోధక శక్తి నుంచి కొత్త వేరియంట్లు తప్పించుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. కొత్త వేరియంట్ల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వీలుగా సామూహిక నిరోధకత సాధించడానికి జనాభాలో 80–90 శాతం మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం కావాలని తెలిపింది.

సామూహిక నిరోధకత సాధించేదాకా..
భారత్‌లో ఇప్పటిదాకా 7.6 శాతం మందికే (10.4 కోట్లు) పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ జరిగిందని నిపుణుల కమిటీ తెలిపింది. వ్యాక్సినేషన్‌లో వేగం పెంచకపోతే థర్డ్‌ వేవ్‌లో నిత్యం 6 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని తేల్చిచెప్పింది. ఇన్ఫెక్షన్‌ లేదా వ్యాక్సినేషన్‌ ద్వారా సామూహిక నిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ) సాధించేదాకా కరోనాలో కొత్త వేవ్‌లు వస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు అంచనా వేశారని గుర్తుచేసింది. కరోనా నియంత్రణ నిబంధనలను ఎత్తివేయడాన్ని బట్టి ఇండియాలో థర్డ్‌ వేవ్‌ మూడు రకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ–కాన్పూర్‌ నిపుణులు గతంలో తెలిపారు. ఒకటి.. థర్డ్‌ వేవ్‌ అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 3.2 పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తాయి. రెండోది.. అధిక తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో థర్డ్‌ వేవ్‌ సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రతిరోజూ 5 లక్షల కేసులు బయటపడతాయి. ఇక మూడోది.. అక్టోబర్‌ మాసాంతంలో థర్డ్‌ వేవ్‌ గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 2 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదవుతాయి.

వైరస్‌లో మార్పులు.. పిల్లలకు సవాలే
థర్డ్‌ వేవ్‌లో పెద్దల కంటే పిల్లలే అధికంగా ప్రభావితం అవుతారని చెప్పడానికి ఇప్పటివరకైతే తగినంత సమాచారం లేదని నిపుణులు కమిటీ వివరించింది. కరోనా వైరస్‌లో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అవి పిల్లలకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని గుర్తుచేసింది. ఒకవేళ చిన్నారులకు కరోనా సోకినా అసలు లక్షణాలేవీ కనిపించకపోవడం, స్వల్పంగా కనిపించడం వంటివి ఉంటాయని వివరించింది. వారు అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నవారైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో 60–70 శాతం మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పిల్లల్లో అపాయకరమైన ఎంఐఎస్‌–సి(మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌) తలెత్తే అవకాశం ఉందని నిపుణుల కమిటీ తన నివేదికలో తెలియజేసింది. చదవండి:Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..!

ప్రమాదకరమైన వేరియంట్‌ పుట్టుకొస్తేనే థర్డ్‌ వేవ్‌
కరోనాలో డెల్టా కంటే ఎక్కువ తీవ్రత కలిగిన కొత్త వేరియంట్‌ ఉద్భవిస్తే థర్డ్‌ వేవ్‌ నవంబర్‌లో గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ప్రముఖ సైంటిస్టు మహీంద్ర అగర్వాల్‌ సోమవారం చెప్పారు. ఇది సెప్టెంబర్‌ ఆఖరు నాటికి పూర్తి క్రియాశీలకంగా మారుతుందని అన్నారు. డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్‌ పుట్టుకురాకపోతే థర్డ్‌ వేవ్‌ దాదాపు రానట్లేనని అగర్వాల్‌ స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి కొత్త వేరియంట్‌ బయటపడితే మూడో వేవ్‌లో నిత్యం 1.5 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement