న్యూఢిల్లీ: ఇప్పుడున్న కరోనా వేరియంట్ల కన్నా డేంజర్ వేరియంట్ సెప్టెంబర్‌లో బయటపడితే దేశంలో కరోనా థర్డ్‌వేవ్ వస్తుందని ఐఐటీ కాన్పూర్ సైంటిస్టు మనీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే రాబోయే అక్టోబర్– నవంబర్ మధ్య కాలంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి కనిపిస్తుందని అంచనా వేశారు. అయితే ఎంత ప్రమాదకరమైన వేరియంట్‌తో థర్డ్‌వేవ్ వచ్చినా, దాని తీవ్రత సెకండ్ వేవ్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా మేథమేటికల్ మోడలింగ్‌లో ఆయన నిపుణుడు. దేశంలో ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలను అంచనా వేసే ముగ్గురు సభ్యుల బృందంలో ఆయన ఒకరు. సెప్టెంబర్ నాటికి కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే మాత్రం ఎలాంటి థర్డ్ వేవ్ రాదని ఆయన వెల్లడించారు. థర్డ్‌వేవ్ ఉధృత దశలో దేశీయంగా రోజుకు లక్ష కేసులు బయటపడవచ్చని అంచనా వేశారు. సెకండ్‌వేవ్ ప్రబలిన సమయంలో దేశీయంగా రోజుకు 4 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే!
‘‘న్యూ మ్యూటెంట్ రాకున్నా, కొత్త వేరియంట్ కనిపించకున్నా యథాతథ స్థితి ఉంటుంది. కొత్త వేరియంట్ సెప్టెంబర్ నాటికి బయటపడితే థర్డ్‌వేవ్ అవకాశాలుంటాయి.’’అని అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్, తద్వారా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు 1/33 వంతులని అంచనా వేశారు. ఇప్పటివరకు డెల్టాను మించిన ప్రమాదకరమైన వేరియంట్ ఇంకా బయటపడలేదు. డెల్టా కారణంగా థర్డ్‌వేవ్ ఆరంభమైనా, కొత్త వేరియంట్ పుట్టకపోవడంతో ఉధృతి కొనసాగడం లేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా నమోదైతున్న కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment